20, ఫిబ్రవరి 2025, గురువారం

ధన్యాత్ములు మీరెవరండీ

 

తరచుగ శ్రీహరినామము పలికే 

    ధన్యాత్ములు మీరెవరండీ

హరిహరి యనుచు తరించదలచే 

    హరిభక్తులము మేమండీ


తరచుగ శ్రీహరిసేవల నుండే 

    ధన్యాత్ములు మీరెవరండీ

హరిసేవలకే యంకితమగు శ్రీ

    హరికింకరులము మేమండీ


తరచుగ శ్రీహరిగాథలు చెప్పే 

    ధన్యాత్ములు మీరెవరండీ

హరికథలను వినిపించుచు తిరిగే 

    హరిదాసులము మేమండీ


తరచుగ హరికీర్తనలను పాడే 

    ధన్యాత్ములు మీరెవరండీ

హరికీర్తనమే యానందమనే 

    హరిజీవనులము మేమండీ


తరచుగ హరిపూజలలో గడిపే 

    ధన్యాత్ములు మీరెవరండీ

హరిపూజలతో తరించదలచే 

    హరిభక్తులము మేమండీ


తరచుగ హరిక్షేత్రంబులు తిరిగే 

    ధన్యాత్ములు మీరెవరండీ

హరితీర్ధములను సంచరించు శ్రీ

    హరిభక్తులము మేమండీ


తరచుగ  శ్రీహరిభజనలు చేసే 

    ధన్యాత్ములు మీరెవరండీ

హరేరామయను హరేకృష్ణయను 

    హరిభక్తులము మేమండీ    


తరచుగ హరిపై కవిత్వమల్లే 

    ధన్యాత్ములు మీరెవరండీ

హరికే కవిత్వ మంకితమిచ్చే 

    హరికవులము మేమేనండీ



2 కామెంట్‌లు:

  1. గానం చేయడానికి అనువుగా ఉంది.

    హరి నీ నామ మహత్వము,
    హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!

    నన్నయ్యకు తిక్కన్నకు సంధి కాలమైన 11-12 వ శతాబ్దములో నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, పండితారాధ్యుడు వంటివారిని శివకవులు అనేవారు.

    అలాగే మీ కవిత్వాన్ని బట్టి మిమ్మల్ని ' హరికవి ' అనవచ్చుననుకుంటే, ఆ కోవలోనే "హరికే కవిత్వ మంకితమిచ్చే
    హరిభక్తులము మేమండీ" దగ్గర "హరిభక్తులము మేమండీ" బదులుగా "హరికవులము మేమేనండీ" అనడం ఒప్పుతుందేమో చూడండి.

    గేయంలోని హరికింకరులు, హరిదాసులు, హరిజీవనుల కోవలో హరికవులు కూడా ఇముడుతుందని భావన.

    రిప్లయితొలగించండి
  2. మీ అభిప్రాయం సబబుగానే ఉంది. అన్ని చరణాలలోనూ మేమండీ అని వాడి ఈ చరణంలో మాత్రం మేమేనండీ అనవలసి వస్తుంది. కాని అదేమంత పెద్ద ప్రతిబంధకం కాదు, అది కాక తరువాతి చరణంలో మరలా మేమండీ అని వస్తున్నది. అందుచేత చిన్న మార్పు అనివార్యం అవుతున్నది చివరి రెండు చరణాలను క్రిందుమీదులు చేయటమే ఆమార్పు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.