9, ఫిబ్రవరి 2025, ఆదివారం

కాపాడు వాడవు శ్రీరామ

 

కాపాడు వాడవు శ్రీరామ యేల 

కాపాడ కున్నావు రఘురామ నీవు

కాపాడ కున్నచో శ్రీరామ యింక 

కాపాడు వారెవరు రఘురామ


కాపాడు మని వేడు కరిని సంరక్షించి

కాపాడు మని వేడు కాంతను రక్షించి

కాపాడు మని వేడు గోపాలురను బ్రోచి

కాపాడు మని వేడ కాపాడవే నన్ను


ఆనాడు కాపాడి కానలను సుగ్రీవు

నానాడు కాపాడి యసురేశు సోదరుని

ఆనాడు కాపాడి యంబరీషుని స్వామి

ఈనాడు కాపాడ కీసడింతువు నన్ను


కాపాడి తన్వంగి శాపమును దీర్చితివి

ఆపాడు రావణుని హతమార్చి యానాడు

కాపాడి సీతమ్మ కష్టమును దీర్చితివి

కాపాడ రావేల ఘనశ్యాముడా నన్ను



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.