25, ఫిబ్రవరి 2025, మంగళవారం

ఏమి చేసినావురా


ఏమి చేసినావురా శ్రీరామ 

    యేమని నిన్నందురా


పట్టుబట్టి నన్ను భూమికి పంపించి

    నట్టి ఘనుడవు నీవెగా

పుట్టినదాదిగ గట్టిగ నినునమ్మి

    నట్టి నన్నేడ్పింతువు


ఆరోగ్య మన శ్రద్ధ యావంతయును లేని 

    యాలి నిచ్చినావురా

ధారాళముగ నాకు కష్టాలనే యిచ్చి 

    దండించు చున్నావురా


ఏడుపదులు దాటి యీప్రాయమున నే 

    నేమిసంపాదింతురా

పాడు చేసి బ్రతుకు బ్రహ్మాండముగ నీవు 

   పకపక లాడేవురా


సిగ్గెగ్గులను వీడి చేయిజాచు స్థితికి

     శ్రీరామ తెచ్చితివి

లగ్గగు నెగ్గగు మానావమానాలు

    రామయ్య నీకే సుమా


బుజ మాసరా లేని బ్రతుకాయెరా నాది

    ముందుముం దెట్లుండునో

నిజముగ దయయున్న నన్నిన్ని కష్టాలు

    నీవేల పెట్టేవురా


శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచునె

    చితికి పోవుచుంటిని

భారమ్ము నీపైన వైచితి నిక నన్ను

    వంచించక ప్రోవరా


నావాడ వని నమ్మి నిన్నాశ్రయించితే

    నీవేల దయజూపవో

గోవింద నేనేమి చేసిన నీకరుణ

    కొంచెము నాకబ్బురా


నీవు కర్మక్ష్క్షయము నాకిట్లు చేయగ

    భావించినావో ప్రభూ

దేవాధిదేవా నీదివ్యప్రభావంబు

   తెలియగ నేనెంతరా


నిన్నే నమ్ముకొన్న నాకు మోక్షము నీయ

    నీవెంచినట్లున్నది

కావుననే యిట్లు కష్టంబులను పేర

    కర్మక్షయ మగుచున్నది


కానిమ్ము కానిమ్ము నీదు సంకల్పమె

     కానిమ్ము రామప్రభో

దీనపోషక రామ జ్ణానదాయక రామ

     నేనేమి యెఱుగుదును



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.