20, ఫిబ్రవరి 2025, గురువారం

శ్రీరఘురాముని కొలవండీ


శ్రీరఘురాముని కొలవండీ కడు 

    చిత్తశుధ్ధితో కొలవండీ

శ్రీరఘురాముని కొలిచేవారికి 

    చేకూరని శుభమేదండీ


అన్యులితర దైవంబుల గొలుచుట

    నఱసి మీరు భ్రమపడకండీ

అన్యదేవతల గొలిచిన ఫలితము

    లల్పములే నని తెలియండీ

ధన్యులు రాముని కన్యము నెన్నడు

    తలపని వారని తెలియండీ

సన్యాసులకును సంసారులకును

    సముడని రాముని తెలియండీ


భూమి నితరులను కొలుచుచు వీఱిడి

    వోవుట దేనికి చెప్పండీ

రాముని కొలిచేవారికి దైన్యము 

    రానేరాదని తెలియండీ

పామరులకును పండితులకును 

    రాముడు సముడని తెలియండీ

రాముని కంటెను దైవము లేడని 

    భూమిని చక్కగ చాటండీ


సదాశివుడు ధ్యానించెడు రాముని 

    చక్కగ ధ్యానము చేయండీ

మదిలో నన్యము నెన్నక రాముని 

    మానక ధ్యానము చేయండీ

చెదరని భక్తిని చూపిన తప్పక 

    శ్రీరాముడు మురిసేనండీ

ముదమున రాముని కొలిచెడు వారికి 

     మోక్షము తప్పక కలదండీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.