అందరమును హరిసభ కేగుదమా
అందాలరాముని జూచుదమా
కందర్పశతాధికసుందరు రఘు
నందను కన్నుల జూచుదమా
చందురు కంటెను చల్లని శ్రీరఘు
నందను కన్నుల జూచుదమా
బృందారకజనవందితు డగు రఘు
నందను కన్నుల జూచుదమా
చందనచర్చితశ్యామలాంగు రఘు
నందను కన్నుల జూచుదమా
అందరమును హరివైభవమును కను
విందుగ గాంచి తరించుదమా
అందరమును హరిసభాంగణము కను
విందుగ గాంచి తరించుదమా
అందరమును హరిభక్తజనుల కను
విందుగ గాంచి తరించుదమా
అందరమును హరి ముందర నిలబడి
హారతు లెత్తి తరించుదమా
వందనశతములు చేసి రాఘవుని
భక్తిగ స్తోత్రము చేయుదమా
చిందులుత్రొక్కుచు శ్రీరఘునందను
శీఘ్రముగా కీర్తించుదమా
ఆనందముగా శ్రీరఘునందను
నందరమును ప్రార్ధించుదమా
ఆనందంబులు నైశ్వర్యంబులు
నందర కిమ్మని యడుగుదమా