నాటకమే హరి నాటకమే అది నాటకమే జగన్నాటకమే
మునుకొని హరిభటు లగు జయవిజయులు మునుల నడ్డుటొక నాటకమే
సనకసనందులు కినిసి వారలను శపియించుటయును నాటకమే
ఏడుజన్మములు మిత్రులుగా నిల నెసగుడనుట హరి నాటకమే
మూడుజన్మముల వైరము వారు వేడుటయును హరి నాటకమే
అంతట వారును హేమకశిపహేమాక్షు లగుట హరి నాటకమే
చింతలపాలై యింద్రాదులు ద్యుతిచెడి యుండుట హరి నాటకమే
వరాహనరసింహాకృతులను హరి వారిని జంపుట నాటకమే
ధరపై రావణఘటకర్ణులుగా మరల వారగుట నాటకమే
భూమిని తాను రామచంద్రుడై పొడముట శ్రీహరి నాటకమే
భూమిజ రావణవంచిత యగుటయు పురుషోత్తముని నాటకమే
రావణాదులను నిర్మూలించుట రమ్యమైన హరి నాటకమే
పావనతారకనామము ధరపై ప్రభవించుట హరి నాటకమే
జయవిజయులు హరిబంధువు లనగా జనియించుట హరి నాటకమే
జయశీలుడు కృష్ణునిగా వారిని జంపుటయును హరి నాటకమే
హరి భూభారము తగ్గించుటకై యాడిన చక్కని నాటకమే
మరల మరల స్మరియింప దగినదై మహిమాన్వితమగు నాటకమే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.