16, నవంబర్ 2019, శనివారం

కర్మ నెట్‍వర్క్


ఒకదేశపు రాజు. ఆయనకు ఉన్నట్లుండి ఒకనాడు రాజదానిలో ఒక రోజున నగరసంచారం చేయాలీ అన్న బుధ్ధిపుట్టింది.  అదేమీ కొత్తసంగతి కాదు లెండి. అప్పుడప్పుడు ఆయన అలాగే చేస్తూ ఉంటాడు. ఎందుకలా అంటే ఆయన తండ్రి అలా చేసేవాడు. ఆయన తాతముత్తాతలూ ఆపని చేసేవారని ఆ తండ్రిగారే ఒకనాడు కొడుక్కి చెప్పాడు. ఇక తనకూ ఆనవాయితీని కొనసాగించటం అన్న మహత్కార్యం ఎలా తప్పుతుందీ. ఐతే ఏదన్నా సరే తెలిసి చేయటంలో ఒక అర్ధం ఒక పరమార్ధం ఉంటాయంటారు. ఆమాట కూడా రాజుగారికి తండ్రిగారే ఉపదేశించారు.

అసలు ఆ తండ్రిగారు కొడుక్కి చాలానే విషయాలు ఉపదేశించారు. వేదాంతంతో సహా. ఆయనకు రాజకీయం తలకెక్కింది కాని వేదాంతం మాత్రం రుచించలేదు. అది వేరే సంగతి.

ఇంతకీ నగరసంచారం ఎందుకంటే రాజు స్వయంగా రాజ్యం ఎట్లా నడుస్తున్నదీ రాజ్యాంగం ఎలా అమలౌతున్నదీ పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆపని చేయటానికి మహాదర్జాగా జీతాలు పుచ్చుకుంటున్న మంత్రులూ మందీ మార్బలమూ లేదా అని మీరనవచ్చును.  పాపం, రాజుగారు కూడా చిన్నతనం కొద్దీ తండ్రిగారిని ఆమాట అడిగారు కూడా. అందుకు సమాధానం ఏమిటంటే రాజు ఎవ్వరినీ పూర్తిగా నమ్మకూడదు. అలాగని ఎవ్వరినీ తాను సంపూర్ణంగా విశ్వసించటం లేదని ఎవ్వరికీ తెలియనీయ కూడదు. చివరికి మహారాణీని ఐనా సరే, యువరాజును ఐనా సరే ఎంతవరకూ నమ్మాలో అంతవరకే. స్వయంగా అందరిమీదా ఒక కన్నేసి ఉంచని రాజు అధోగతికి పోతాడట. అదీ విషయం. అందుకని అయ్యా మీపరిపాలన బ్రహ్మాండంగా ఉందని మంత్రిపురోహితదండనాథాదులు ఎంతగా ఊదరగొడుతున్నా చారులు ఎంతగా అందరూ మనది రామరాజ్యం అని పొగుడుతున్నారండీ అని ఉబ్బేస్తున్నా సరే అదేదో వీలైనంతగా స్వయంగా పరిశీలించుకోక తప్పదన్న మాట.

పగలల్లా రాజుగారు మారువేషం కట్టి నగరం అంతా తిరిగి చూసాడు. తన మందిరానికి చేరుకొని మళ్ళా రాత్రి పూట కూడా రాజధానీ నగరం అంతా పరిశీలనగా చూస్తూ పోతున్నాడు.

అర్ధరాత్రి దాటింది. అంతవరకూ ఏ విధమైన వింతలూ విడ్డూరాలూ అనుమాస్పదసంగతులూ ఆయన దృష్టికి రాలేదు.

ఇంతలో ఆయన కంటికి ఒక వ్యక్తి చేతిలో కత్తిపట్టుకొని ఊరి చివరకు వెళ్తూ కనిపించాడు. చూడటానికి చాలా పేదవాడిలాగా ఉన్నాడు. వడివడిగా అతను ఊరిచివరన ఉన్న అమ్మవారి దేవాలయం ఒకదాని దగ్గరకు చేరుకొనే సరికి అతని వెనకాలే కుతూహలంగా రాజుగారూ అక్కడికి చేరుకొనారు..

అమ్మవారి గుడి చాలా పాతది. శిథిలావస్థలో ఉంది. గుడికి తలుపులు కూడా లేవు. అసలా గుడి ఒకటి ఉందని రాజుగారికి తెలియను కూడా తెలియదు. ఆ పేదవాడు గుడిలోనికి వెళ్ళాడు. రాజుగారు కూడా అతడికి తెలియకుండా తానూ గుడిలోనికి ప్రవేశించి ఒక స్తంభం చాటున నిలబడ్డాడు.

ఇంక చాలమ్మా అని ఆ పేదవాడు ఒక పొలికేక పెట్టాడు. సాగిలపడి అమ్మవారికి దండం పెట్టి అమ్మ మూర్తికి చేరువగా వచ్చి నిలుచున్నాడు.

అమ్మా, వీరుణ్ణి నువ్వు దీనుణ్ణి చేసావు. రాజుగారు ఇస్తున్న భత్యం నా కుటుంబం పోషణకు ఏమూలకూ రావటం లేదు. ఐనా నీదయ ఇలా ఉంటే ఇంకేం చేసేదీ అని రోజులు నెట్టుకొని వస్తున్నాను.

ఇప్పుడు నువ్వు చేతికి అందివస్తున్న నా కొడుకును కూడా ఎత్తుకొని పోయావు. రేపోమాపో వాడు కొలువులో చేరి మాకింత ముద్దపెట్టి ఆదుకుంటాడని ఆశగా ఎదురుచూస్తున్నామే, నీ పుణ్యమా అని ఆ ఆశకూడా పోయింది.

ఇంకా బతికి ఏం చూడాలమ్మా?

ఇదిగో నిన్ను పదిసార్లు జై కొట్టి పిలుస్తాను. నువ్వు నాకు మానహాని లేకుండా జీవించే ఏర్పాటు చేస్తున్నానని చెప్పావా సరి. లేదా పదవసారి జైకొట్టిన వెంటనే నా తలకొట్టుకొని నీ పాదాలవద్ద సమర్పిస్తాను.

నా ఇంటిదాని సంగతంటావా అదీ రేపు నావెనకే నీ పేరు చెప్పుకొని అగ్గిలో దూకుతుంది.

ఇదిగో విను పదే సార్లు పిలువగలను అంతే.

ఇలా అని జై జగన్మాతా అని అరిచాడు.

అంతా వింటున్న రాజు ఆశ్చర్యపోయాడు. ఇతడెవరో మొన్న పొరుగురాజ్యంతో జరిగిన యుధ్ధంలో గాయపడ్ద సైనికుడు. ఇక సైన్యంలో పని చేయటానికి నప్పడని రాజ్యం భృతి ఇస్తున్నది. ఇతడి మాటలను బట్టి చూస్తే ఇతడికి భార్యా ఒక కొడుకూ తప్ప ఎవరూ లేనట్లుంది. మరి భృతి ఎందుకు సరిపోవటం లేదు? ఇందులో ఏదో మర్మం ఉంది. విచారించాలి అనుకున్నాడు.

అంత కంటే ముందుగా ఈ వీరుడు ఆత్మాహుతి చేసుకోకుండా ఎలా ఆపాలా అనుకున్నాడు.

కాని ఆ భక్తుడికి అమ్మవారిపైన ఉన్న విశ్వాసం గుర్తుకు వచ్చి ఆగాడు. అతడిని అమ్మవారు కనికరిస్తుందా లేదా తెలుసుకోవాలని ఆయనకు తోచింది.

ఏం జరుగుతుందో చూదామని, కొంచెం దగ్గరగా చేరి వేచి చూస్తున్నాడు.

తొమ్మిది సార్లు జై జగన్మాతా అని ఆ వీరుడు పిలిచాడు. పదోసారి గుడి అంత మారుమ్రోగేటట్ల్గుగా జై జగన్మాతా అని అరచి, రాజు అతడి చేతిని పట్టుకొని ఆపేందుకు యత్నించే లోగానే తటాలున తలను నరుక్కున్నాడు.

పెద్ద మెఱుపు మెరిసినట్లైనది. గుడి అంతా వెలుగుతో నిండిపోయింది.

ఆ వీరసైనికుడి కత్తి కాస్తా పూలదండగా మారి అతడి మెడలో ప్రకాశించింది.

రాజు నిశ్చేష్ఠుడైనాడు..

ఆ సైనికుడికి కొంత సేపటికి కాని వంటి మీదకు స్పృహ రాలేదు.

తీరా వచ్చాక అతడు కూడా విభాంత చిత్తుడై అమ్మవారిని చూస్తూ ఉండిపోయాడు.

*    *    *    *    *

 అమ్మవారు ప్రత్యక్షం ఐనది. ఆ తల్లి దివ్యకంఠస్వరం తీయగా వినిపించింది.

నాయనా నీ భక్తికి మెచ్చాను. ఇకనుండీ నీ కుటుంబానికి అన్ని ఇబ్బందులూ తొలగి పోతాయి.  సంతోషమేనా?

వీరుడు అనందభాష్పాలు తుడుచుకుంటూ అడిగాడు. అమ్మా పుట్టి బుద్దెరిగి నప్పటి నుండీ నీకు పరమభక్తుడను. అసలు నాకిన్ని కష్టాలు ఎందుకు కలిగించావమ్మా అని.

అమ్మ మందహాసం చేసింది. నాయనా అందరూ కర్మఫలాలను తప్పక అనుభవించాలి. అది సృష్టినియమం అన్నది.

ఐతే ఏమి కర్మఫలం నన్ను వీరుణ్ణీ చేసింది? ఇప్పుడేది నన్ను అవిటి వాడిని చేసింది అన్నాడు వీరుడు.

గత జన్మలో నీవు ఒక వీరుడికి సేవకుడిగా ఉండి అతడిలా వీరుడివై దేశసేవ చేయాలని కోరుకున్నావు. చాలా ప్రయత్నించావు. కాని ఆ ఉపాధికి అంత శక్తి లేదు. అందుకే ఈజన్మలో వీరుడివి అయ్యావు. ఐతే అప్పట్లో నీ వచ్చీ రాని సాధన వలన ఒకడికి అవయవలోపం కలిగింది. ఆదోషం వలన ఇప్పుడు నీకు కొంచెం అవిటితనం వచ్చింది అంది అమ్మవారు.

మరి నా కొడుకేమి చేసాడమ్మా వాడిని తీసుకొని పోయావే అన్నాడు వీరుడు అమ్మవారిని నిలదీస్తూ.

ఒక సారి యుధ్ధోన్మాదంలో నువ్వు ఒక యువకుడిని ఆతడి తండ్రికండ్లముందే చంపావు. నిజానికి నువ్వు రాజాజ్ఞ ప్రకారం అతడి తండ్రిని బంధించాలని వెళ్ళావు. ఆతని కుమారుడు ఏమీ తప్పు చేయలేదే? కాని నీవు నీ వీరత్వం చూపటానికి అతడిని బలితీసుకొన్నావు. ఆ తండ్రి పడిన క్షోభను ఇప్పుడు నువ్వు అనుభవించవలసి వచ్చింది.

నువ్వు అడుగకపోయినా మరొక సంగతి నీకుమారుడు కూడా తన కర్మఫలం ప్రకారమే అల్పాయుష్కుడు అయ్యాడు. నీ భార్యకూడా గతజన్మలో దరిద్రులను హేళనగా చూసిన పాపానికి గాను ఇప్పుడు దారిద్యం అనుభవించవలసి వచ్చింది.

నాయనా ఎవరూ తమతమ కర్మఫలాలను తప్పించుకొన లేరు అనుభవించకుండా.

మూడేండ్లనుండీ నీవు దుర్భరదారిద్ర్యం అనుభవిస్తున్నా,  ఈనాటికి గాని నీకు నా అనుగ్రహం కోసం ఇలా రావాలన్న స్పృహ కలుగలేదు. దానికి కారణం ఇప్పటికి గాని నీకు కర్మక్షయం కాకపోవటమే.

నీ కొడుకు ఒకడు తప్పిపోయాడు కదా చిన్నతనంలో వాడు, తిరిగి వస్తున్నాడు తొందరలో. ఇంక మీకు అన్నీ శుభాలే. పో, నీ అవిటితనం కూడా తొలగిస్తున్నాను అంది అమ్మవారు.

ఇదంతా వింటున్న రాజుగారు సంభ్రమాశ్చర్యాలతో కొయ్యబారి ఉన్నాడు.

అమ్మవారు రాజును కూడా ఇలా రావయ్యా అని పిలిచింది.

రాజు గారిలో చలనం వచ్చింది. అమ్మ చెంతకు వచ్చాడు.

నీకు నా దర్శనం ఎందుకు దొరికిందో తెలుసునా అన్నది అమ్మవారు.

అమ్మా అది నా పూర్వజన్మసుకృతం అన్నాడు రాజుగారు.

అది సరే, ఈ గుడిని ఒకప్పుడు నీవే కట్టించావు. ఇదిగో ఇలా పాడుబడింది. దీనికి జీర్ణోధ్దరణ చేయి. నీకూ కర్మక్షయం కావస్తున్నది. అందుకే దర్సనం ఇచ్చాను. పో నీకు శుభం కలుగుతుంది అని అమ్మవారు అదృశ్యం అయ్యారు.

ఉపసంహారంగా ఆట్టే చెప్పవలసింది ఏముంది? రాజుగారు గుడిని జీర్ణోద్ధరణ చేసారు. కొడుక్కి రాజ్యం అప్పగించి అమ్మవారిని సేవించుకుంటూ ఉండిపోయారు.

అన్నట్లు మరిచాను, ఎంతగా వెయ్యికళ్ళతో లెక్కలు చూస్తున్నా మాజీసైనికులకు ఇచ్చే భత్యాలనూ బొక్కుతూ ఇబ్బంది పెడుతున్న రాజోద్యోగులను కనిపెట్టి పనిబట్టారు అన్నిటి కంటే ముందుగా.

కథ కంచికి.