27, సెప్టెంబర్ 2016, మంగళవారం

దనుజులపాలి కోదండరాముడుదనుజులపాలి కోదండరాముడు భక్త
జనకోటిపాలిటి జానకీరాముడు

కరుణాళువు వీడు లోకకళ్యాణరాముడు
సురగణంబులకు సర్వశుభదరాముడు
అరయగా దశరథున కానందరాముడు
మురియు కౌసల్య కేమొ ముద్దులరాముడు
దనుజుల

మునిపత్నిపాలి శాపమోచనరాముడు
మునికోటులకు వీడు మోక్షదరాముడు
జనకరాజునకు వీడు జామాత రాముడు
జనకాత్మజామనస్సరసీరుహధాముడు
దనుజుల

సామాన్యులము మాకు సకలవరదరాముడు
కామాదిదుష్టవైరిఖండనరాముడు
పామరత్వమణచు నట్టి బంగారురాముడు
రామరాజ్యస్థాపకుడు రాజారాముడు
దనుజుల
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.