విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను
నన్ను కాచుటకు నాస్వామీ నీ కన్నను హితు లెవరున్నారుచన్న భవములను గావించినవి చిన్నతప్పులో పాపములో
యెన్నగ నేవో పున్నెములో నా కన్నను నీకే యెఱుకగదా
అన్నియు గలసి తేపతేపకు నన్ను త్రిప్పురా యిల చుట్టూ
మన్నించర నే నలసితిరా బ్రతిమాలుదు రామా బ్రోవరా
సత్వము లేదే సర్వతీర్థములు శ్రధ్ధ మీర సేవించుటకు
తత్వసార విచారము చేయగ చదువును చాలదురా నా దీ
నత్వము నెఱిగిన కరుణామయుడవు నాకేమో నీదయయే
సత్వము తత్వము కావున నన్ను చప్పున రామా బ్రోవరా
తెలిసిన దొకటే నిన్నే నమ్ముట తెలిసీ తెలియని మనసునకు
తెలియని దొకటే మంచి దారిని తీరుగ నడిచే సద్విద్య
తలచుకొంటివా తక్షణమే నా తాపము లన్నీ తీరునయా
కలిసెద నీలో కల్మషముడిగి గ్రక్కున రామా బ్రోవరా