వేదనలన్నీ విభునినామమున
వెన్నవలే కరిగె
శ్రీదయితుని శుభనామపు మహిమ
చిత్తములో నిలిచె
లోకపు పాపపు వాసనలన్నీ
రూపరి శాంతియె నిలిచె
శోకము మోహము క్రోథము లోభము
సుంత దూరముగ నిలిచె
సాకేతపురాధీశుని దయచే
చక్కని బుధ్ధులు నిలిచె
శ్రీకరమగు శ్రీరామనామమున
చిత్తము చక్కగ నిలిచె
హరిభక్తుల సంసర్గమునే మది
ఆనందముగా తలచె
నిరంతరము శ్రీహరినామమునే
మరిమరి చిత్తము తలచె
హరినామమునే యడలెడు చిత్తము
పరమౌషధమని తలచె
పరమపదమునే కోరెడు నాత్మయు
హరినామమునే వలచె
హరెరామ యని పలుకుటతోనే
ఆనందవృష్టి కురిసె
హరేకృష్ణ యని పలుకుటతోనే
అమృతంపువృష్టి కురిసె
హరేరామ శ్రీహరేకృష్ణ యన
హరి దయావృష్టి కురిసె
కురిసిన హరిదయతో నిజరూపము
నెరిగిన జీవుడు మురిసె