నీలిమేఘ మొకటి నిలువునామముబెట్టి
నేలకు దిగివచ్చె నెమలిఫించము గట్టి
వాలెనె నాముందు బాలా నిన్నటి రాత్రి
ఏలాగు వివరింప జాలుదునే యపుడు
చాలసేపటి వరకు కాలమే తెలియని
మేలైన స్థితి కలిగె నీలాలక వినుము
దానాలు ధర్మాలు దండిగ జేసిన
వేనవేలేండ్లుగ మౌనియై యుండిన
తాను రాడట మనసు తనకంకితము జేసి
ధ్యానించినందుకే యవతరించేనట
తనువునాదను భ్రాంతి మనసున లేదాయె
మనసు నాదను భ్రాంతి మటుమాయమైపోయె
విను మేను వాడగుచు విహరించినది నిజము
తనదాయె నాయాత్మ ధన్యనైతిని చెలియ