వాడప్పుడే విల్లు పట్టెనదే చూడరే
బొమ్మవిల్లు చేతబట్టి మురిసిపోవుచున్న వాని
అమ్మముందు నిలిచి దాని అందమును చూపు వాని
నెమ్మదిగ వంచి గుణము నిమ్ముగాను సంధించి
అమ్మా బాణాలు కావాలమ్మా యనే వానిని
నారి తొడుగు ఒడుపు జూచి నాతి కౌసల్య నవ్వె
చేరి బాణాలనడుగ చిన్నగా సుమిత్ర నవ్వె
రారా నావద్ద గలవు రామచంద్ర బాణాలు
తీరైన విండ్లు నీవు కోరినన్ని యనె కైక
అవును కైకమ్మ బలే యస్త్రవిద్యావేత్తరా
సవినయముగ అమ్మవద్ద చక్కగా నేర్వరా
రవికులోత్తమ యనుచు రాము నెత్తి కౌసల్య
సవతి చేతి కందించగ చాల నవ్వె సుమిత్ర