బాలరాము డటునిటు పరుగులు దీయ
చాలముచ్చటగ దోచు సకియ లందరకును
రారా నాకన్నతండ్రి నా రాముడా యని
రారా కొడుకా యని రవికులోత్తమ యని
రారా బంగారుతండ్రి రఘునాయకా యని
కూరిమితో కన్నతల్లి కోసలసుత పిలువ
రారా నాకంటివెలుగ నా రామచంద్ర యని
రారా చిన్నారి దశరథరాముడా యని
రారా ఓ ప్రావృణ్ణీరదశ్యాముడా యని
గారాము చేయుతల్లి కైకమ్మయు పిలువ
కేరింతలు కొట్టుచును కిలకిలకిల నవ్వుచును
చేరబిలుచున్న తల్లుల చేతులలో వ్రాలగ
తూరీగవలె పరుగులువాఱు వాని నడ్డుకొని
రారా కొడుకా యని సుమిత్రామాత ముద్దిడ