సెటిలర్. ఈ మాటకు అర్ధం నాకు తెలుసుననే అనుకుంటున్నాను. ఇదే కదా? "తన స్వస్థలం విడచి పరాయి ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న వ్యక్తి" అని.
ఈ మాట విన్నప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది.
ఇదేదో తప్పుమాట అని కాదు. ఈమాటను తెలుగువాళ్ళు అన్వయిస్తున్న విధానం వలననే నాకు మనస్తాపం కలగతున్నది.
ఈ మాటను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో లేదా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో నా బాధ కాదు. తెలుగువాళ్ళే సాటితెలుగువాళ్ళ పట్ల ఎంత అవమానకరంగా ఎలా వాడుతున్నారో అని నా బాధ.
మన తెలుగువాళ్ళలో కూడా తోలుమందం మనుష్యులు కోకొల్లలుగా ఉన్నారు. కాని వాళ్ళతోపాటే నాలాంటి కొంచెం సున్నితమనస్కులు కూడా ఉన్నారు. తోలుమందం జనాభాకైతే పట్టించుకోకుండా కించిత్తూ బాధపడకుండా ఉండే హక్కు ఎలాగైతే ఉందో, నాలాంటి వారికి కొద్దో గొప్పో బాధపడే హక్కు కూడా అలాగే ఉంది. తోలుమందం జనాభాకు మౌనంగా మాటల్ని భరించే హక్కు ఎలా ఉందో (అదీ ఒక హక్కేనా అని ఎవరికన్నా అనుమానం వస్తే మంచిదే!), నాలాంటి వారికి భరించలేక తమ అభిప్రాయాన్నీ నిర్మొగమాటంగా చెప్పే హక్కూ అలాగే ఉంది. అందువలన ఒకరి అనుమతి అవసరం లేదు నా అభిప్రాయ ప్రకటనకు.
పాలపొంగు ఒకటి తెలుగుప్రజల రాష్ట్రాన్ని ఎలా రెండుముక్కలు చేసిందో అందరమూ చూసిందే. దరిమిలా ఒక తెలుగురాష్ట్రం (ప్రస్తుతానికి) రెండుగా మారి, తెలుగువారికీ రెండు రాష్ట్రాలు ఏర్పాటై, తమకు ఒక్క రాష్ట్రమేనా అని విచారించే అమృతహృదయులకు ఎలా ఊరట చేకూర్చిందో అందరికీ తెలిసిందే.
ఒకటి చివరకు రెండు ఐన తెలుగుప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వాలు చివరకు ఎలా అభివృధ్ధిపథంలో దూసుకొని పోతున్నాయో కూడా మనందరికీ బాగా అవగతం అవుతూ ఉన్నదే.
ఈ విషయంలో నాకు విచారించటానికి వ్యక్తిగతంగా కారణం ఏమీ లేదు. కాని చిక్కల్లా ఆ మహర్దినం దాకా స్వరాష్ట్రంలోనే ఉన్నవాడిని కాస్తా హఠాత్తుగా నా చిరనివాసప్రాంతంలోనే పరాయి వాడిని ఐపోవటమే. అలా ఐపోయానని నేను అనుకొనటం మానటం అంత ముఖ్యమైన సంగతి కాదు. నేను అలా పరాయివాడినీ అని ఘడియకు ఒకసారి గుర్తుచేసే సహృదయవాక్యాలను తట్టుకోవటం ఎంత కష్టంగా ఉంటుందీ అన్నదే ముఖ్యమైన సంగతి.
కాని ఈరాష్ట్రంలోనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణానికి ముందే వచ్చిన వాళ్ళు మాత్రమే తెలంగాణా వారిగానూ మిగతా వారంతా పరాయి వారుగానూ తెలంగాణా రాష్ట్రప్రభుత్వాధినేతయే చేసిన ప్రకటనలు ఎంతమందికి ఇంకా గుర్తున్నాయో నాకు తెలియదు. ఈకొద్ది సంవత్సరాలలోనే అదేదో గత త్రేతాయుగం నాటి సంగతి కదా ఇప్పుడెవ్వరికి పట్టింది అన్నట్లు మర్చిపోగల వాళ్ళకు ఒక నమస్కారం. అది నావల్ల కాదు. కానే కాదు. ఎందుకో చెప్పనివ్వండి.
నేను నలభైయేడేళ్ళ క్రిందట పొట్టచేత్తో పట్టుకొని వచ్చాను హైదరాబాదు నగరానికి. అప్పటికి అదింకా నిర్వివాదంగా తెలుగువాళ్ళ స్వరాష్ట్రానికి ముఖ్యపట్టణం. అందుచేత నేను అప్పట్లో నాస్వరాష్ట్రరాజధానికి ఉద్యోగనిమిత్తం వచ్చాను కాని ఏదో పరాయి ప్రాంతానికి ప్రవాసం పోలేదు. నేను వచ్చింది నా పొట్టపోసుకుందుకే కాని ఏదో తెలంగాణా ప్రజల పొట్టకొట్టి ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో ఐపోయి పెత్తనం చేదామని కాదు. ఆ వచ్చింది కూడా భారతప్రభుత్వం అధీనం లోని సంస్థకు కాని ఇక్కడి ఏదో ప్రైవేట్ కంపెనీకి ఐనా కాదు.
నేను వచ్చిన కొద్ది కాలానికే నా కుటుంబం అంతా, మా నాన్నగారి నిర్యాణానంతరం, నా దగ్గర ఉండటానికి వచ్చారు. అందరం ఇక్కడే ఉన్నాం అప్పటినుండి. నాసోదరసోదరీమణులంతా ఈ హైదరాబాదులోనే చదువుకున్నారు. మా చెల్లెళ్ళందరినీ హైదరాబాదు వాస్తవ్యులకే ఇచ్చి వివాహాలు చేసాం.
పందొమ్మిది వందల యాభైఆరు నవంబరు కన్నా ముందుగానే దీర్ఘదర్శనులై మా తాతగారు హైదరాబాదు వచ్చి స్థిరావాసం ఏర్పరుచుకొన లేదు కాబట్టి మేమంతా పరాయి వాళ్ళం అన్న తెలంగాణా ప్రభుత్వం మాట ఎలా సబబు అని మాకు అనిపిస్తుంది చెప్పండి?
ఈ రెండురాష్ట్రాలు ఏర్పడినప్పటినుండీ నాకు 'సెటిలర్' అన్న బిరుదు ఇస్తానంటే నేనెలా ఒప్పుతాను చెప్పండి?
ఆంధ్రాప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చి అర్ధశతాబ్దం కావస్తున్నది. అక్కడివారికి ఇప్పుడు దాదాపుగా పరాయివాడిని. ఇక్కడి వారికి కూడా నేనొక 'సెటిలర్'ను అనగా పరాయివాడికి. చాలా బాగుంది. ఇదెక్కడి న్యాయం?
మా ఆఖరు తమ్ముడు ఇక్కడే జన్మించాడు. ఇక్కడే చదువుకున్నాడు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు వాడికీ ఒక కుటుంబం ఉంది. వాళ్ళంతా కూడా 'సెటిలర్స్' అనటం అసహజం అభ్యతరకరం కాదా?
నాలాంటి వారు ఈహైదరాబాదులో కొల్లలు. ఎవరి కథ వారిది. వాళ్ళంతా పొట్ట చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వచ్చినవారే.
అంద్రాప్రాంతం నుండి వచ్చిన వారంతా దుష్టులు అని అ తెలంగాణా ఉద్యమం రోజుల్లో తిట్టిపోసింది చాలు. ఒక పెద్దమనిషి, నా స్నేహితులే లెండి, అవసరం ఐతే ఆంద్రావారంతా చచ్చిపోయి ఐనా తెలంగాణా రావలసిందే అని చెప్పారు. ఉద్యమం వేడి అట. వేడి! ఎంత చక్కని మాట.
ఆంద్రావాళ్ళు బిర్యానీచేస్తే పేడలా ఉంటుంది అని వెక్కిరించి వెకిలిగా నవ్వులు చిలికించిన పెద్దమనిషి ఓట్ల అవసరం రాగానే ఆంధ్రావాళ్ళమీద కొంచెం ప్రేమ ఒలికించేమాటలూ మాట్లాడారు అనుకోండి. అంతమాత్రం చేత ఆ గుండెల్లో ప్రేమను చూడటం నావల్ల కాదు.
సరే జరిగిందేదో జరిగిపోయింది. రాజకీయాల్లో బోలెడు జరుగుతూ ఉంటాయి. వాటికి ఎవరూ ఏమీ చేయలేరు.
కాని ఇంకా అంధ్రప్రాంతం వారిని 'సెటిలర్స్' అంటూ వేరుగా చూడటం సమంజసమా? ఆప్రాంతం నుండి వచ్చి ఈతెలంగాణాలో స్థిరపడిన కుటుంబాలు మరొక ఐదువందల యేళ్ళైనా సెటిలర్స్ అనే పిలవబడుతారా?
ఈహైదరాబాదులో అంధ్రప్రాంతం నుండే కాక భారతదేశంలోని అనేక ప్రాంతాలనుండి వచ్చి 'సెటిల్' ఐన కుటుంబాలు కొల్లలు. కాని చూస్తుంటే వారెవర్నీ 'సెటిలర్స్' అన్నట్లు కనిపించదు. ఆంద్రప్రాంత నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఈ సాటి తెలుగువాళ్ళే తెలంగాణావారికి పరాయి వారు, 'సెటిలర్స్' అన్నమాట. భారతదేశంలోని ఏయితర ప్రాంతనుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారూ తెలంగాణా ద్రోహులు కారు. సాటి తెలుగువారైన ఆంధ్రాప్రాంతం వారే తెలంగాణాద్రోహులు (పుట్టుకచేతనే ఆంధ్రాప్రాంతం వారు తెలంగాణాద్రోహులు అన్నమాటనూ రాజకీయులు అనగా విన్నాను.). కాబట్టి సాటి తెలుగువారికి ద్రోహులు అని నిత్యం గుర్తుచేయటానికి వారిని మాత్రమే సెటిలర్స్ అంటారన్నమాట.
ఎన్నికలూ వగైరా అవసరాలు వచ్చినప్పుడు ఓట్లకోసం అంధ్రప్రాంతం వాళ్ళకి మెరమెచ్చు మాటల చెప్పే ఈరాజకీయులు 'ఆంధ్రానుండి వచ్చినవాళ్ళూ మావాళ్ళే' అంటూ ఉండటం విన్నదే. ఆమాటల్లో ఉన్న నిజాయితీ గురించి మేధావులు అనబడే కొందరు ఎంతో చక్కటి విశ్లేషణలు అందిస్తారనటంలో సందేహం లేదు. కాని అవన్నీ పైపై మాటలే అన్నసంగతి మాత్రమే అసలు నిజం.
నేను అమెరికాలో కొన్నేళ్ళు ఉండి వచ్చాను. ఎందరో అమెరికాలో సెటిల్ అయ్యారు మన తెలుగువాళ్ళు. కాని అక్కడ సెటిల్ ఐనా మన వాళ్ళని ఎవరూ అక్కడ 'సెటిలర్స్' అనరు.
ఏదో నాగోడు నేను చెప్పుకున్నాను. ఎందరు ఏకీభవిస్తారో, ఎవరు ఏకీభవించరో అన్నది వేరే విషయం. సత్యం కళ్ళముందే ఉంది. అటు ఆంధ్రకూ ఇటు తెలంగాణకూ చెందని రెండింటికీ చెడిన రేవడులే ఈ సెటిలర్స్ అన్నదే ఆనిజం.
ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను. నేను కూడా ఎంతో మంది సాటి తెలుగువారిలాగే ఆ అమెరికాలోనే సెటిల్ అయ్యుంటే ఈఅవమానకరమైన సెటిలర్ టైటిల్ నా నెత్తి మీద ఉండేది కాదు కదా అని.
4, డిసెంబర్ 2020, శుక్రవారం
సెటిలర్స్
తరచుగా ఆంధ్రాప్రాంతం వారిని ఉద్దేశించి సెటిలర్స్ అని సంబోధించటం గమనించవచ్చును. ఇప్పటికీ ఆ దిక్కుమాలిన సంబోధన మారటం లేదు. ఇదిగో ఈరోజున కొండలరావు గారు కూడా తన బ్లాగులో ఒకవ్యాఖ్యలో ఈ రోజున "ఇప్పటివరకూ విశ్లేషణలు చూస్తుంటే సెటిలర్స్ మాత్రమే టీ.ఆర్.ఎస్ ను కాపాడారనిపిస్తోంది." అని ఆ పదాన్ని ప్రయోగించారు. ఎంతో విచారం కలుగుతూ ఉంటుంది ఆ సెటిలర్ అన్న మాట తటస్థించినప్పుడల్లా. మరొకరూ ఆసెటిలర్స్ అన్నపదాన్ని కొనసాగించారనీ మనం అక్కడ గమనించవచ్చును.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)