1, ఆగస్టు 2013, గురువారం

ఈ‌ రోజున మనస్సు ఏమీ బాగోలేదు.

ఈ రోజున మనస్సు చాలా అశాంతికి గురై ఉంది.  చివరికి భాగవతం‌ చదువుకుందామన్నా ఈ‌ అశాంతితో దృష్టి నిలవటం లేదు.

ఘోరాతిఘోరంగా ఒక పద్ధతి లేకుండా అడ్డదిడ్డంగా నామాలు విభజిస్తూ సాగిన లలితాసహస్రనామపారాయణం ఒక కారణం.  ఈ‌ మధ్య ఇలా లలితాసహస్రం పారాయణం చేయటం ఒక ఫేషన్ అయిపోయింది. ఈ మహత్తర కార్యక్రమం చేసేందుకు కొన్ని సమాజాలూ‌ బయలుదేరాయి.  వాళ్ళేం‌ చదువుతున్నారో, దానిని ఎలా సరిగా ఉఛ్ఛరించాలో వాళ్ళకు ఎంతమాత్రం అవగాహన ఉండదు. చాలా చోట్ల అక్షరాలను తప్పుగా ఉఛ్ఛరిస్తారు.  వాళ్ళు, సాధారణంగా అనుష్టుప్పులు చదివే ధోరణిలో‌, దంపుళ్ళపాటలాగా లలితానామసహస్రం చదువుకుంటూ‌ పోతారు. ఏ నామం ఎక్కడ మొదలవుతోందీ‌ ఎక్కడ సరిగా ముగుస్తుందీ‌ అన్నది జాగ్రత్తగా గమనించరు. నిజానికి అలా గమనించుకోవాలన్న స్పృహ వాళ్ళకు ఉండనే ఉండదు. ఒకవేళ ఎవరికైనా కొంచెం ఉన్నా, తెలియదు. లలితా సహస్రంలో కొన్నినామాలు చాలా దీర్ఘంగా ఉంటాయి. అందులో కొన్ని పాదం అంతా నిండి కూడా ఉంటాయి. అవి వీళ్ళు చిత్తం వచ్చినట్లు ముక్కలు ముక్కలు చేస్తుంటే వినలేక ప్రాణం గిలగిల్లాడుతుంది.

లలితా సహస్రంలో ఒక నామం 
    లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా
ఈ‌ నామాన్ని పట్టుకుని రెండు ముక్కలు చేసి
   లక్ష్యరోమా లతాధారా  తాసమున్నేయ మధ్యమా
అని పలికితే వినవలసిరావటం ఎంత దౌర్భాగ్యం!

ఇలాగే పాదం అంతా నడిచేవి ఇంకా చాలా నామాలున్నాయి లలితా సహస్రంలో.
    నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా
    చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
    కురువిందమణీశ్రేణీకంత్కోటీరమండితా
    అష్టమీచంద్రవిభ్రాజదళీకస్థలశోభితా
    మృగచంద్రకళంకాభమృగనాభవిశేషికా
    వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా
    వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా
    నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
    తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా
    కందంబమంజరీకప్తకర్ణపూరమనోహరా
    తాటంకయుగళీభూతతపనోడుపమండలా
    పద్మరాగశిలాదర్శిపరిభావికపోలభూః
    నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనఛ్ఛదా
    శుధ్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్వలా
    కర్పూరవీటికామోదసమాకర్షదిగంతరా
    నిజసల్లాపమాధుర్యవినిర్భిత్సితకఛ్చపీ
    మందస్మితప్రభాపూరమజ్జాత్కామేశమానసా
    అనాకలితసదృశ్యచుబుకశ్రీవిరాజితా
    కామేశబధ్ధమాంగల్యసూత్రశోభితకంధరా

ఇత్యాది.  ఈ‌ నామాలన్నింటినీ ఈ పారాయణసమాజం మనుషులు చిత్తం వచ్చినట్లు విరిచిపోగులు పెడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. 

అలాంటప్పుడు, అక్కడ ఉండటం దుర్భరం అనుకుంటే బయటకు పోవచ్చును కదా? అలా కూడా చేయటానికి వీల్లేకుండా పెద్ద వానొకటి బయట.

ఇదివరలో ఇలాంటి అనుభవమే అదే స్థలంలో కలిగింది.  అప్పుడు వచ్చిన పారాయణసమాజం‌లో నాయకురాలొకావిడ నామాలకు అర్థం కూడా సెలవిచ్చారు.  ఆ దారుణం మాటల్లో కూడా వివరించలేను!

లలితా పారాయణం అయ్యేది మరొకటయ్యేది, సరిగా పారాయణం చేసే విధానాన్ని పెద్దల దగ్గర కొన్నాళ్ళు కూర్చుని వారి సహాయంతో అభ్యాసం చేసి మరీ పదిమందిలో పారాయణం నిర్వహించటం చేయాలి.  అలా నిష్ణాతులైతే మరొక పది మందికి నేర్పించవచ్చును కూడా.  కాని ఈ పెద్దమనుషులు అలాంటి పనులేం చెయ్యరు.  చేత్తో పుస్తకం పుచ్చుకుని సరాసరి జనం మీద పడటమే.

అమ్మవారి నామసహస్రం చేయాలని బయలు దేరి సరిగా శ్రధ్ధగా చేయకపోతే ఎలా?

మనస్సును మరింత అస్థిమితానికి గురిచేసిన తరువాతి కార్యక్రమం. వేదపారాయణం.  మీరు సరిగ్గానే చదివారు.  వేదపారాయణమే.  శన్నో మిత్రతో మొదలు పెట్టి పురుషసూక్తం వగైరా చదివారు.  ఎవరూ వేదం నేర్చుకున్న వాళ్ళూ కాదు ఏమీ‌ కాదు. ఇవన్నీ‌ ఈ రోజుల్లో పూజల పుస్తకాల్లో అచ్చువేస్తున్నారు కదా అవి ముందు పెట్టుకుని చిత్తం వచ్చినట్లు ఎవరి ధోరణిలో వారు గడబిడగా చదివేయటమే అన్నమాట.  ఇలా చేయకూడదు వగైరా వాదనలు వాళ్ళముందు పని చెయ్యవు. అందుకని ఊరుకో వలసిందే. వినలేక పోతే పోవాలి బయటకు.  కాని బయట పెద్ద వాన కదా?

నా మనస్సు బాగో‌క పోవటానికి ఇంకొక కారణం, ఆ పారాయణ కార్యక్రమం, వేదపఠనం అనే మహత్తరకార్యక్రమాల తరువాత జరిగిన గొప్ప భజనతంతు.  

ఈ రోజుల్లో బోలెడంతమంది గురువులు.  అందులో కొందరు జగత్పసిధ్ధులు. వాళ్ళకు చెప్పనలవి కానంత ఫాలోయింగు. ఈ గురువులు దేవుళ్ళుకూడా. పెద్ద పెద్ద సంస్థలే నడుస్తూ ఉంటాయి యీ గురువుల పేరిట జగత్కల్యాణార్థమై.అందరికీ ఒక్క విషయం తెలిసే ఉంటుంది. నాబోటి మీబోటి వాడు చేయగింది వీలయితే నలుగురితో‌ పాటు నారాయణా అని జైగురుదేవా అనటం. కాకపోతే నోర్మూసుకుని కూర్చోవటం అంతే.  వాదనలూ‌ ప్రతివాదనలూ దండగమారి కార్యక్రమాలు.

ఎవరు వ్రాస్తారో తెలియదు.  తలాతోకా లేని భజనకీర్తనలు ఈ గురువులూ నయాదేవుళ్ళ కోసం చేసే భజనల్లో పాడటానికి. 

పత్రికలవాళ్ళు ప్రతిరోజు ఖచ్చితంగా అన్ని పేజీల నిండా వార్తలు ఎలా రాస్తారా అని చిన్నప్పుడు తెగ హాశ్చర్యపోయేవాడిని.  తరువాత తెలిసింది వార్తలు పదునుగా కావలసిన మసాలాలతో కావలసిన పరిమాణంలో వండటం అనే విద్యకూడా ఉంటుందని. అవసరమైన చోట సోది చేర్చి వార్తను నింపుతారు.

భజన కీర్తన రాయాలంటె ఒక పల్లవీ, కుదిరితే ఒక అనుపల్లవీ, కనీసం రెండో మూడో చరణాలూ కూర్చాలి. వాటిలో విషయం లేకపోతే‌ పాట ఎలా తయారవుతుందీ.  అలా కూర్పు చేయటానికి ఈ‌ భజన కీర్తనల్లో కాలమ్‌ ఫిల్లర్స్ లాగా అనూచానంగా వస్తున్న బోలెడు సాంప్రదాయకమైన సామాగ్రి ఉంది.  అదంతా వాడుకోవచ్చు.

మాటవరసకు ఒక పాత భజన కీర్తనను ఎడిట్ చేసి, అది వినాయకుడి మీద కీర్తన అనుకోండి గణనాథా అన్న మాట పీకేసి గురునాథా చేయటం, ఇంకా కొన్ని మాటలకు అదే‌ శైలిలో ప్రత్నామ్నాయంగా మాటలు వేయటం చేస్తే మన గురువుగారిమీద మంచి భజన కీర్తన సిథ్థం. 

మరీ‌ అంత తేలిక కాదను కోండి. కోంచెం ప్రాక్టీసు చేయాల్సి ఉంటుంది. కాని అదేమీ‌ బ్రహ్మవిద్య కాదు కదా.

మీరంతా గమనించే ఉంటారు, ఇదేదో‌ పేరడీ‌ వ్యవహారం కదా అని. అలాంటిదే.  అయ్యప్ప, వేంకటేశ్వరస్వామితో సహా అందరు దేవుళ్ళ మీదా సినిమాపాటలు ఆధారంగా అలాంటి పేరడీ‌ భక్తి గీతాలు బోలెడు వచ్చాయి.

ఇలాంటి భక్తి గీతాలు వండేటప్పుడు పాతకాలం నాటి శ్రీరాముడూ,శ్రీకృష్ణుడూ, విష్ణుమూర్తీ, శివుడూ వగైరా దేవుళ్ళంతా ఎవరికి చేతనైన సాయం వాళ్ళు చేస్తారు. ఆ పాతదేవుళ్ళంతా తమతమ నామరూపగుణవిక్రమకీర్తిచరిత్రవిశేషాలన్నీ మన గురుదేవుడి లేదా నయాదేవుడి ఖాతాలోకి జబర్దస్తీగా జమచేసుకుందుకు అనుమతి ఇచ్చేస్తారు. ఎందుకు ఇవ్వరండీ?  ఆ పాతదేవుళ్ళంతా మన కొత్త గురుదేవుడి పాత అవతారాలే‌కదా.

ఇలాంటి దుర్భరభజన కార్యక్రమంలో కూర్చోవటం‌ నాకైతే నరకం.  కాని, బయట వాన కారణంగా చచ్చినట్లు కూర్చోవటమే జరిగింది.

ఇలా విమర్శగా అన్నందుకు కొంతమందికి నామీద కోపం కూడా రావచ్చును.  దానికి నేనేమీ చేయలేను.

చివరికి కార్యక్రమం జయప్రదంగా ముగిసి, ఇంటికి వచ్చినా అశాంతి మనస్సునుంచి తొలగించటం నావల్ల కావటం లేదు.

తెలిసి దైవాపచారం జరిగే చోట ఉన్నందుకు అశాంతి కలిగిందేమో!

కొందరు అనవచ్చును.  ఎలా చేస్తే ఏమీ భక్తి ముఖ్యం కదా, వాళ్ళకు చేతయింది చేసారు. నువ్వే అనవసరంగా ఏదో గొప్పవాడిలాగా ఫీలయిపోతూ లేనిపోని అశాంతిని సృష్టించుకున్నావూ అని.  కొంచెం తెలిసినవారైతే‌ మరికొంత మెట్టవేదాంతం కూడా జోడిస్తారు.  తిన్నడులాంటి వాళ్ళు నీలాగా శాస్త్రప్రకారం పూజలు చేసారా? దేవుడు మెచ్చలేదా?  మనస్సే ప్రధానం అని.  మంచి వాదనే.  కాని సరైనది కాదు.  తెలియక కాదు, చేతకాక కాదు - నిర్లక్ష్యం కారణంగా చేసే‌ అపచారాన్ని కువాదంతో సరిపుచ్చుకో‌వటం కుదరదు.  ఎవరిని పడితే వారిని -- ఏం? ఈ‌యన మాత్రం విష్ణువు లేదా శివుడి అవతారం ఎందుక్కాకూడదూ‌ -- అని వితండవాదం చేసి, పూజలూ‌ భజనలూ చేయటం‌ భగవదపచారమే నాదృష్టిలో.  నా మాటలు ఎవర్నైనా నొప్పించాలని కాదు. నిష్టూరంగా ఉన్నా నిజం మాట్లాడుకోవటం తప్పుకాదు కదా! ఏదో‌ నా బాధ కారణంగా నేను చెప్పుకుంటున్నాను.

దానికితోడు నేను వ్రాస్తున్న  శ్యామలీయం భాగవతం  బ్లాగు చూసి మరింత ఆవేదన కలిగింది. నిన్నటి టపా చదివిన వారు ఇప్పటికి అక్షరాలా  ఒక్కరు!  ఎవరికీ‌ ఈ‌ 'పాహి రామప్రభో' లాంటి పద్యాలూ, భాగవతం లాంటి చాదస్తం భక్తి గ్రంథాలూ నచ్చనపుడు ఎందుకు వ్రాయటం?  భాగవతం అయితే ఒక వెయ్యి టపాల బృహత్తరకార్యక్రమం. నేను ఒక్కడినే చదువుకుందుకు అయితే, నేను పోతనగారినే చదువుకోవచ్చును. మరలా వ్యావహారికంలో వ్రాయాలని సమయం వెచ్చించటం దేనికి.  రాములవారిమీద ప్రస్తుతం ఈ‌ బ్లాగులో మానసిక పూజా విధానం నడుస్తున్నది.  ఎవరూ చదవరు.  మంచిది.  ఈ‌ శీర్షిక త్వరలో రెండువందల పద్యాలకు చేరుతుంది.  బహుశః అక్కడితో ముగుస్తుందేమో తెలియదు.

అవసరమైతే శ్యామలీయం‌ కథకూడా త్వరలోనే ముగుస్తుంది!