రారా నిన్నే కోరితి మన
సారా నిన్నే కోరితి
తనివార నిను జూడ
మనసిజశతకోటి
ఘనసుందరా యిటు
మునికోటికే మరులు
జనియింపగాజేయు
నినుజూడ మనసాయె
వనజేక్షణా యిటు
భువనేశ్వరా రామ
పవమానసుత వనజ
భవశక్రభవవినుత
భవనాశక యిటు
మునివరులకు ముద్దు వచ్చు మోహనాంగుడు వాడు
జనకునకు ముద్దు వచ్చు వినయశీలి
జనుల కతడు మెచ్చుగొలుపు సద్గుణశాలి వాడు
జనకసుతకు ముద్దు వచ్చు శ్యామలాంగుడు
చక్కదనమునకే నిర్వచనమన నొప్పు వాడు
చక్కనైన విక్రమాతిశయము వాడు
చక్కగ భక్తులకు మోక్షంబు నిచ్చెడు వాడు
దిక్కై దీనులకు నిలుచు దేవదేవుడు
శ్రీమన్మంగళమూర్తిని రాముని
చిత్తములో ధ్యానించవలె
ఆమహనీయుని నామామృతమును
హాయిగ నిత్యము గ్రోలవలె
శ్రీరఘురాముని పాదాబ్జంబుల
సేవను మానక చేయవలె
రాముని భక్తులతో నెల్లప్పుడు
ప్రేమగ సంగతి చేయవలె
చక్కగ రాముని తత్త్వము భక్తుల
సంగతితో గ్రహియించవలె
రాముడె సత్యము రాముడె సర్వము
రాముడె జగమని తలచవలె
అంతఃకరణచతుష్టయమును రా
మార్పణముగ నొనరించవలె
రామభక్తుడై రామయోగియై
రామదాసుడై బ్రతుకవలె
కారణకారణు నన్యము లడుగక
ఘనముగ మోక్షము నడుగవలె
బ్రహ్మానందము బయటదొరకునా
రామమయం బని తెలియవలె
రామచంద్రుని బంటునైతే
రాము డెట్లా చూచు నయ్యా
రామపాదము విడువకుంటే
రాము డేమి చేయు నయ్యా
రామచంద్రుని బంటు వైతే
రాము డాదరించు నయ్యా
ప్రేమతో నిను చేరదీయును
కామితార్ధము లిచ్చు నయ్యా
రామబంట్లే భాగ్యశాలురు
భూమినందరి కంటె నయ్యా
రామబంటుగ నైన నిన్నా
బ్రహ్మయైనను గౌరవించును
రామపాదము రావణానుజు
లంక కధిపతి జేసెనయ్యా
రామపాదము పట్టు హనుమకు
ప్రభువు బ్రహ్మపదము నిచ్చెను
రామపాదము విడువకుంటే
ప్రభువు మోక్ష మైన నిచ్చును
రామబంటుగ మారవయ్యా
రామపాదము విడువకయ్యా
శ్రీరామ నీనామమే చేయుచున్నాను
చేపట్టి రక్షించరా దేవ
వారాశిగర్వాపహారి భవవారాశిని
పడియుంటి రక్షించరా దేవ
నీనామమే గాక నేనన్య మెఱుగను
నిండార దయచూపరా దేవ
మానవేంద్రుడ నేను మానవాధముడనే
మన్నించి రక్షించరా దేవ
నీపాదములె సాక్షి నీవాడనే నేను
చేపట్టి రక్షించరా దేవ
కోపించవద్దు నాదోషంబులను జూచి
గోవింద రక్షించరా దేవ
నీసాటిదైవంబు లేడంచు చాటించు
నీ భక్తునిక బ్రోవర దేవ
దాసానుదాసుండ ధర్మవిగ్రహ నన్ను
దయచేసి రక్షించరా దేవ
నాలుక భగవన్నామము పలుకక
నాలుక కలిగిన సత్ఫల మేమిక
చెవులకు భగవన్నామము సోకక
చెవు లున్నందుకు సత్ఫల మేమిక
కనులకు భగవద్రూపము కానక
కను లున్నందుకు సత్ఫల మేమిక
కరములు భగవత్సేవకు కదలక
కరములు కలిగిన సత్ఫల మేమిక
పదములు భగవత్సేవకు నడువక
పదములు కలిగిన సత్ఫల మేమిక
మనసుకు భగవత్తత్త్వము తోచక
మన సున్నందుకు సత్ఫల మేమిక
బ్రతుకును భగవంతున కర్పించక
బ్రతుకొక టుండిన సత్ఫల మేమిక
రాముని భగవంతునిగా తెలియక
భూమిని పుట్టిన సత్ఫల మేమిక
మనకేమి భయమయ్య మనరాము డుండగ
మనవాడై మనతోడుగ
కామలోభక్రోధమదమోహమాత్సర్య
ఘనరాక్షసులు డాసిన
భూమిజనులు చాల తామసులై తిట్టి
యేమని దండించిన
కల్లగురువులు వచ్చి కల్లమతముల దెచ్చి
గడబిడలే చేసిన
కల్లదేవుళ్ళకు కలి యెంత వత్తాసుగా
నిల్చి జళిపించిన
అన్నన్న తాపత్రయములెంత హృదయము
నగ్నిగోళము చేసిన
దున్నపోతు నెక్కి దుష్టుడైన యముడు
దుడుకుగ పైబడిన
రామ గోవింద రామ గోవింద
కామారి సన్పుత రామ గోవింద
శ్రీమంతుడా హరి రామ గోవింద
ధీమంతుఢా హరి రామ గోవింద
సామీరి సన్నుత రామ గోవింద
నామొర్ర లాలించు రామ గోవింద
కోమలాంగా హరి రామ గోవింద
శ్యామలాంగా హరి రామ గోవింద
పామరుడను నేను రామ గోవింద
ప్రేమగా నన్నేలు రామ గోవింద
ఆ మోక్ష మొక్కటె రామ గోవింద
నామనోరథమయ్య రామ గోవింద
మామంచి దేవుడ రామ గోవింద
నామీద దయచూపు రామగోవింద