శ్రీమన్మంగళమూర్తిని రాముని
చిత్తములో ధ్యానించవలె
ఆమహనీయుని నామామృతమును
హాయిగ నిత్యము గ్రోలవలె
శ్రీరఘురాముని పాదాబ్జంబుల
సేవను మానక చేయవలె
రాముని భక్తులతో నెల్లప్పుడు
ప్రేమగ సంగతి చేయవలె
చక్కగ రాముని తత్త్వము భక్తుల
సంగతితో గ్రహియించవలె
రాముడె సత్యము రాముడె సర్వము
రాముడె జగమని తలచవలె
అంతఃకరణచతుష్టయమును రా
మార్పణముగ నొనరించవలె
రామభక్తుడై రామయోగియై
రామదాసుడై బ్రతుకవలె
కారణకారణు నన్యము లడుగక
ఘనముగ మోక్షము నడుగవలె
బ్రహ్మానందము బయటదొరకునా
రామమయం బని తెలియవలె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.