31, జులై 2023, సోమవారం

సతతం ప్రణమామి

కం. ధృతిమంతమ్ ద్యుతిమంతమ్
మతిమంతమ్ సర్వశక్తిమంతమ్ సత్య
వ్రతపాలనగుణవంతమ్
సతతం ప్రణమామి రామచంద్ర మనంతమ్ 


ఆశ్రయామి శ్రీరఘునాథమ్

కం. శ్యామమ్ పట్టాభిరామమ్ 
కోమలకరవిధృతభర్గగురుకోదండమ్ 
భూమాతాజామాతమ్
క్షేమంకర మాశ్రయామి శ్రీరఘునాథమ్ 

జితశతమదనాకారం

 కం. జితశతమదనాకారం 
ధృతహరకోదండ మఖిలదేవగణేశం 
హతరాక్షసగణనాథం
సతతం సంపూజయామి శాంతం రామమ్

రామమ్ పద్మాక్షం సు శ్యామం

కం. రామమ్ పద్మాక్షం సు
శ్యామం రణభీమ మతులశరచాపధరమ్
కామేశాభినుతం సం
గ్రామనిహతపంక్తికంథరం వందేహమ్ 

29, జులై 2023, శనివారం

సురరిపువంశవిదారం

కం. సురరిపువంశవిదారం
వరభక్తాధారసత్కృపారసపూరం
సురగణబహుళోదారం
పరదైవతమాశ్రయామి వరదమ్ రామమ్ 

శ్రీరాముడు మోక్షమిచ్చు

కం. శ్రీరాము డుండ భయమా
చేరుము రామయ్య చెంత శ్రీరామునకే
కూరిమి సేవలు చేయుము
శ్రీరాముడు మోక్షమిచ్చు ప్రీతిగ నరుడా 

రాముని వా డుండువిధము

కం. రాముని మది భావించును
రామునితో మాటలాడు రాముని కొఱకై
యేమైన దాను చేయును
రాముని వా డుండువిధమురా యిది నరుడా 

రాముని పొగడును విబుధుడు

కం. రాముని పొగడును విబుధుడు
రాముని దుర్జనుడు తిట్టు రామపదంబున్
చేరును విబుధుడు మూర్ఖుడు
నేరడు భవవార్ధి గడువ నిక్కము నరుడా 


వరదుడు వీరేంద్రుడు హరి

కం. వరదుడు వీరేంద్రుడు హరి
పరమాత్ముడు రాము డనుచు భావించి సదా
శరణాగతులై  కొలిచిన
పరమపదము కలుగు తెలియవయ్యా నరుడా

సద్భక్తుని నైజము

కం. ఉదయమె రాముని తలచును
మది నాతని నెన్నుచుండు మరి పవలెల్లన్
వదలడు స్మరణము రాత్రియు
నది సద్భక్తునకు నైజ మరయుము నరుడా 

పామరుడా మారీచుడు

కం. పామరుడా మారీచుడు
రాముని నిజతత్త్వ మెఱిగె రాక్షసు డయ్యున్
రామాయణ మరయకయే
రాముని శంకించు పామరత్వపు నరుడా 

శివుడే పొగడును రాముని

కం. శివుడే పొగడును రాముని 
పవమానసుతుండు పొగడు బ్రహ్మయు పొగడున్
దివిజగణంబులు పొగడును
సవినయముగ నీవు పొగడజాలవె నరుడా

ఇప్పుడు నరుడా అన్న మకుటంతో వస్తున్నయి ఈశీర్షికలో పద్యాలు. చూదాం ఇవెన్ని అవుతాయో.

జగడాలమారి మనుజుల

కం. జగడాలమారి మనుజుల
పొగడగ నీకేల గాని పురుషోత్తమునిం
బొగడుము  శ్రీరఘురాముని
నిగమములును పొగడు నతని నిక్కము నరుడా

27, జులై 2023, గురువారం

మావాంఛితము


భగవంతుడు శ్రీరామునకు మీవాంఛిత మేదో తెలుపండి 
తగినవిధంబుగ దానిని చేగొని ధన్యులు కండో జనులార

శ్రీరఘురాముని  సేవల నిరతము చేయుటయే మావాంఛితము
శ్రీరఘురాముని భక్తులవద్దకు.చేరుటయే మావాంఛితము
శ్రీరఘురాముని నామకీర్తనము చేయుటయే మావాంఛితము
శ్రీరఘురాముని నామామృతమును సేవించుటె మావాంఛితము

శ్రీరఘురాముని నిరంతరము పూజించుటయే మావాంఛితము
శ్రీరఘురాముని నిత్య మెడదలో చింతించుట మావాంఛితము 
శ్రీరఘురాముని సద్భక్తులమై జీవించుటె మావాంఛితము
శ్రీరఘురాముని పరివారములో చేరుటయే మావాంఛితముమావాంఛితము


కోరికలేమియు కోరక రాముని కొలుచుకొనుటె మావాంఛితమ
నోరారా శ్రీరాముని కథలను నుడువుటయే మావాంఛితము
శ్రీరఘురాముని కన్యము నెఱుగక జీవించుటె మావాంఛితము
తారకనామముతో సంసారము తరియించుటె మావాంఛితము


రాముని కీర్తించ నోరు రాదా

కం. భామల పొగడగ లేచును
భూములకై తగవులాడ ముందుకు దూకున్
ప్రేమగ మోక్షం బిచ్చెడు
రాముని కీర్తించ నోరు రాదా నరుడా 

26, జులై 2023, బుధవారం

వ్రతముగ రాముని నామము

కం. వ్రతముగ రాముని నామము 
ప్రతిదినమును పలుకు నోరు రఘుపతిసేవా
రతి నెపుడు నుండు కరములు
మతిమంతుడు కోరవలయు మానక నరుడా

25, జులై 2023, మంగళవారం

రామస్తవం - 8


శా. శ్రీరామున్ శశిశేఖరాదివినుతున్ క్షేమంకరున్ సర్వలో  
కారాధ్యున్ సుగుణాభిరాము గగనశ్యామున్ పరంధాము  నిం
పారన్ కడు భక్తి సంయుతుడనై ఆత్మీయునిన్ గూర్మితో
కారుణ్యాలయు సన్నుతింతు నెపుడున్ కంజాక్షు నారాయణున్

ఈ ఎనిమిదవ పద్యంతో రామస్తవం సంపన్నం ఐనది.

రామస్తవం - 7


శా. శ్రీరామున్ ఘనవక్షు చాపధరునిన్ సింహాసనస్థున్ హరిన్
పారావారగభీరు భూమితనయా ప్రాణప్రియున్ సుందరున్
ధీరున్ వాయుసుతార్చితున్ కమలజాదిప్రార్ధితున్ దుర్గమున్ 
కారుణ్యాలయు సన్నుతింతు నెపుడున్ కంజాక్షు నారాయణున్

రామస్తవం - 6


శా. శ్రీరామున్ స్తవనీయు శాశ్వతు నెదన్ చింతించుటన్ మాని సం
సారుల్ వీరలవారలం గొలిచి నిచ్చల్ చింతలన్ దేలుచున్ 
పోరెన్నండు భవంబు వీడి మరి నే పోనెంచి ముక్తుండనై
కారుణ్యాలయు సన్నుతింతు నెపుడున్ కంజాక్షు నారాయణున్


రామస్తవం - 5


శా. శ్రీరామున్ జనకాత్మజాసహితునక్షీణప్రభావున్ హరిన్
భూరిప్రాభవయుక్తు రాగరహితున్ భూపాలకశ్రేష్ఠునిన్
నోరారన్ మునులెల్లరున్ పొగడు పుణ్యోపేతు లోకేశ్వరున్
కారుణ్యాలయు సన్నుతింతు నెపుడున్ కంజాక్షు నారాయణున్

రామస్తవం - 4


శా. శ్రీరామున్ రఘుపుంగవున్ స్మరగురున్ స్మేరాననున్ చిన్మయున్
ఘోరాపద్వినివారకున్ ప్రవిలసత్కోదండధారిన్ హరిన్
పారావారనిబంధనున్ దశముఖప్రాగల్భ్యసంశోషకున్
కారుణ్యాలయు సన్నుతింతు నెపుడున్ కంజాక్షు నారాయణున్

రామస్తవం - 3

 
శా. శ్రీరామున్ కమనీయనీలవపుషున్ క్షిప్రప్రసాదిన్ హరిన్ 
మారీచాంతకు రావణాంతకు ఘనున్ మార్తాండవంశోద్భవున్ 
నారీలోకమహోపకారకు సదా జ్ఞానప్రభాసూర్యునిన్ 
కారుణ్యాలయు సన్నుతింతు నెపుడున్ కంజాక్షు నారాయణున్

రామస్తవం - 2


శా. శ్రీరామున్ కమలాప్తవంశవిభునిన్ సీతామనోనాయకున్
దారిద్ర్యాంతకు సర్వలోకవినుతున్ దైత్యాంతకున్ శ్రీహరిన్
ధీరున్ వీరవరేణ్యవందితమహాదివ్యప్రతాపాన్వితున్
కారుణ్యాలయు సన్నుతింతు నెపుడున్ కంజాక్షు నారాయణున్

రామస్తవం - 1


శా. శ్రీరామున్ భవనాశకున్ సురరిపు క్షేమాంతకున్  ఘోరసం
సారభ్రాంతినివారకున్ సురగురున్ సర్వాత్మకున్ శాశ్వతున్
వీరాగ్రేసరు లక్ష్మణాగ్రజుని సద్విప్రప్రసన్నున్ హరిన్
కారుణ్యాలయు సన్నుతింతు నెపుడున్ కంజాక్షు నారాయణున్

ఇక్కడి నుండి కొన్ని పద్యాలు ఒక వరుసగా వస్తాయి మకుటంతో సహా. గమనించగలరు.


24, జులై 2023, సోమవారం

ఈ రోజు మాతమ్ముడు రామం పుట్టిన రోజు

ఈ రోజు మాతమ్ముడు రామం పుట్టిన రోజు.

ఎటొచ్చీ శుభాకాంక్షలు చెప్పాలని ఉన్నా అందుకుందుకు వాడు మనమధ్యన  లేడు.

అది చాలా బాధావహమైన విషయం. జ్ఞాపకంగా మారిపోయిన మా తమ్ముడు రామం ఎప్పటికీ మా దృష్టిపథంలోనే ఉన్నాడు. ఉంటాడు.





ఎంతో దర్జాగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ అన్న బోర్డు ఉన్న బల్ల మీద ఫైళ్ళు చూస్తున్న మాతమ్ముడిని చూసి ఈరోజున చాలా చాలా సంతోషమూ తృప్తీ కలిగాయి. వాడు లేడే అని ఎంతో నిర్వేదమూ  కలిగింది దానితోపాటే

నేను ఉద్యోగస్థుడనైన ఏణ్ణర్ధం లోపే మానాన్నగారు తాడిగడప సత్యనారాయణ గారు హఠాత్తుగా గుండెనెప్పి వచ్చి అక్టోబరు 28, 1975 తారీఖునాడు రాత్రి ఎనిమిది గంటలకు స్వర్గస్థులయ్యారు. అప్పుడు మాకుటుంబం నివాసం  రాజోలులో. 

నాకెలాగూ ఉద్యోగం ఉంది కదా అని, మాతమ్ముడు సత్యశ్రీరామచంద్ర మూర్తికి ఏదైనా ప్రభుత్వోద్యోగం ఇప్పించమని తోర్పుగోదావరి జిల్లా కలెక్టరు గారికి ఒక చిన్న విన్నపం ఉత్తరం ద్వారా పంపాను.

ఆశ్చర్యం ఏమిటంటే ఇంకా వారం తిరక్కుండానే మాతమ్ముడికి జిల్లా పరిషత్తు ఆఫీసులో చిన్న ఉద్యోగం ఇస్తున్నాం రమ్మని తిరుగుజవాబు పంపారు కలెక్టరు గారు.

అలా వాడు చిన్న ఉద్యోగిగా కాకినాడ వెళ్ళాడు. మిగిలిన కుటుంబం అంతా నాదగ్గరకు హైదరాబాదు వచ్చేసారు.

కాలక్రమేణా మాతమ్ముడు కాకినాడలోనే స్థిరపడిపోయాడు. కొత్తలో కొన్నేళ్ళపాటు  తనూ హైదరాబాదు వద్దామని ప్రయత్నించినా  సర్వీసు  కోల్పోయి మరీ రావలసి ఉండటంతో అక్కడే ఉండిపోయాడు.

మిగిలిన నాచెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ హైదరాబాదులోనే పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడ్డారు.

ఒక చిన్న ఉద్యోగిగా మొదలైన మాతమ్ముడు మంచి సమర్ధుడిగా పేరుతెచ్చుకొన్నాడు. మంచి పదోన్నతులూ పొందాడు. కాకినాడలో ఒక ప్రముఖవ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  రిటైర్ కూడా ఐనాడు.

రిటైర్ ఐనా సరే జిల్లా పరిషత్తు వారు (ముఖ్యంగా కలెక్టరు కార్యాలయం అనుకుంటాను) అతడిని వదలలేదు.  కొత్తగా వచ్చే ఆఫీసర్లకు ట్రైనింగు ఇచ్చే కార్యభారం ఇతడికి అప్పచెప్పారు.

అలా ఉద్యోగానంతరం కూడా హుషారుగా పనిచేసుకుంటూ ఉన్న మాతమ్ముడిని కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకొంది.

అలా అతడు ఆఫీసుపని చేసుకుంటుండగా తీసినదన్నమాట ఆపై ఫోటో.

దానిని చూడటం నాకూ ఇదే మొదటి సారి.

విశాఖలో ఉండే మా మేనమామ ప్రసాద్ ఆత్రేయ గారు తన కంప్యూటరులో ఈఫోటో ఉన్నదని 22వ తారీఖున ఉదయమే నాకు పంపారు. చెప్పానుగా ఆ ఫోటోను చూడగానే ఎంతో సంతోషమూ నిర్వేదమూ  కూడా ఎండావానలు ఒక్కసారే వచ్చినట్లు వచ్చాయి నాకు.

ఈఫోటోను భద్రపరచుకుందుకు అన్నమాట ఈటపా!

కాకతాళీయంగా ఈరోజు మాతమ్ముడు రామం పుట్టిన రోజు కూడా.

17, జులై 2023, సోమవారం

కొంచెమైన దయను



కొంచెమైన దయను జూప గూడదటయ్యా

అంచితముగ మంచివాడ వన్నపేరు బడసి


పోనిచ్చితి వొక్కకన్ను పుచ్చుకొని అలనాడు

మానక కాకాసురుని మంచివాడ వగుచు

వాని కన్న యపరాథిని కానే నన్నెందుకు

పోనిమ్మని కడగంట నైన చూడవు


పోనిచ్చితివి రామా మునుపు శుకసారణుల

దానవేంద్రు చారులను మన్నించుచు నీవు

ఆనాటి మంచితనము నంత దయాబుధ్ధియు

నీనాడు నాపైన మరి యేల జూపవు


పోనిచ్చితి వొక్కనాడు పొలికలని రావణుని

యీనాడు జంపననుచు నించుకంత క్పపను

నేనన నీభక్తుడనే కాని పైవాడనా

దానవారి నాపైన దయను చూపవు 


హరి దివ్యనామంబు లందు

హరి దివ్యనామంబు లందు రుచియే లేని

నరులతో పనియేమి నాకెప్పుడైన


సారహీనంబైన సంసారమందుడ

గోరు మతిహీనులను కూడ నాకేమి

శ్రీరామ యనుటకే సిగ్గుపడుచున్నట్టి

వారితో నాకేమిపని యెప్పుడైనను


కల్లగురువుల చేరి కల్లబోధలు విని

కల్లపూజలు చేసి కల్లదైవముల

కెల్ల విధముల చూపి వల్లమాలిన భక్తి

గుల్లబారగ బుధ్ధి గోవిందు మరచి


రామనామము నందు రక్తికలిగిన వారు

భూమి నుత్తములనుచు బుధ్ధిలో గ్రహియించి

రామనామము పలుకు ధీమంతు లగువారి

నేమరక సేవింప నెంచదను కాని



15, జులై 2023, శనివారం

రామరామ యనువారికి

రామరామ యనువారికి రామునికృప దొరకును
రామునికృప కలవారికి ఆమోక్షము దొరకును

రామరామ యనుచుండును రామభక్తుడు హనుమ
రామరామ యనుచుండును లంకను విభీషణుడు
రామరామ యనుచుండును రక్తిమీఱ శ్రీహరుడు
రామరామ యనుచుందురు భూమిని యోగీశ్వరులు

రామనామ మొక టుండిన రాని సుఖము లేదురా
రామనామ మొక టుండిన నేమి భయము లేదురా
రామనామ మొక టుండిన కామితములు తీరురా
రామనామ మొక టుండిన రాముడు నీవాడురా

అనరా శ్రీరామ యని యనవరతము భక్తితో
అనరా శ్రీరామ యని యమితమైన భక్తితో
అనరా శ్రీరామ యని యఖిలజనులు మెచ్చగా
అనరా శ్రీరామ యని ఆరాముడు మెచ్చగా

14, జులై 2023, శుక్రవారం

ఆనందముగా హరిసంకీర్తనము

ఆనందముగా హరిసంకీర్తన మాచరించవే మనసా
దాని ఫలితముగ మోక్షము నీకిక తప్పక కలుగును మనసా

మధురతమంబగు రామనామమును మానక చేయవె మనసా
విధి శంకరులును వినుతించెదరా విమలనామమును మనసా

వెంటరాని సంపదలకోసమై వెంపరలాడకు మనసా
బంటువు నీవై రామచంద్రుని బాగుగ కొలవవె మనసా

చింతలు విడచి శ్రీహరిపదముల చెంతనుండవే మనసా
అంతకుడైనను రామసేవకుల నంటజాలడే మనసా

అన్యము నెఱుగక రాముని కొలుచుటె ఆచరణీయము మనసా
ధన్యులు రాముని భక్తులు వారికి తప్పదు మోక్షము మనసా

11, జులై 2023, మంగళవారం

బుధులు - పామరమానవులు

ఉ. శ్రీరఘునాథపాదసరసీరహయుగ్మము నాశ్రయించి సం
సారవిముక్తులై బుధులు చక్కగ ముక్తిని చెందుచుండ దు
ర్వారభవాబ్ధిగ్రుంకులిడు పామరమానవు లంద రెప్పుడున్
మారుని యాప్తుడంచు మతిమాలి దలంతురు మూర్ఖచిత్తులై

ప్రపంచంలో ఉత్తములైన వాళ్ళు ఏమి చేస్తున్నారు?

శ్రీరఘునాథుని పాదపద్మాల జంటను ఆశ్రయిస్తున్నారు. అందుచేత వాళ్ళు ఈసంసారం నుండి విముక్తులై హాయిగా ముక్తిని చెందుతున్నారు.

ఇక ఉత్తములైన వాళ్ళు అతికొద్దిగా ఉండే ఈలోకంలో పామరమానవులు అత్యధికంగా ఉన్నారు.

వాళ్ళేమి చేస్తున్నారు?

వాళ్ళు కామాసక్తులై కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు.

వాళ్ళు ఆ మన్మథుణ్ణి ఆప్తుడిగా తలపోస్తున్నారు!

వట్టి మూర్ఖపు బుద్ధులు వాళ్ళవి!

వాళ్ళు చేస్తున్న ఈపిచ్చిపనికి ప్రతిఫలంగా వాళ్ళు భవసముద్రంలో పడి ప్రయాసపడుతూ అనంతకాలంగా ఈత కొడుతూనే ఉన్నారు.

10, జులై 2023, సోమవారం

శ్రీరఘురాముని తలచవలె


శ్రీరఘురాముని తలచవలె చిత్తములో నీచిత్తములో
శ్రీరఘురాముని కొలువవలె చేతులతో నీచేతులతో

అన్యప్రసంగము లేమియు వలదని హరిసంకీర్తన చేయవలె
ధన్యులు భక్తుల యోగుల మార్గము తప్పక తెలిసి చరించవలె
ధన్యులు కావలె నంటే మీకా తారకనామము కలుగవలె
అన్య గురువుల యవసర మేమని హరునే గురునిగ తెలియవలె

సవనరక్షకుడు భువనరక్షకుడు సార్వభౌముడగు రాఘవుని
సవినయముగ సేవించి తరించుట జన్మమెత్తుటకు కారణము
పవనాత్మజు డెప్పుడు పలికెడు పావననామమె చాలనుచు
భవహరమగు హరి తారకనామము వదలక నిత్యము చేయవలె

శ్రీరఘురాముని దివ్యనామమును జిహ్వను నిరతము నిలుపవలె
శ్రీరఘురాముని దివ్యచరితమును ప్రీతిగ నిత్యము చదువవలె
శ్రీరఘురాముని పాదపద్మముల సేవను వదలక చేయవలె
శ్రీరఘురాముని భక్తుల నితము జేరి తత్త్వమును తెలియవలె



రామనామము చేయరా శ్రీరామనామము చేయరా



రామనామము చేయరా శ్రీరామనామము చేయరా 

రామనామము చేయువారికి రాని సౌఖ్యము లేదురా


రామనామము చేయుచుండును కామవైరి మహాత్ముడు

రామనామము చేయుచుండును ప్రేమతో హనుమంతుడు

రామనామము భక్తితో మునిరాజులు జపియింతురు

రామనామము నాల్కనుండిన రాని సౌఖ్యము లేదురా


రామచంద్రుడు ప్రేమమయుడా రామచంద్రుడె మిత్రుడు

రామచంద్రుడు విశ్వనాథుడు రామచంద్రుడు నిత్యుడు

రామచంద్రుడు విష్ణుదేవుడు రామచంద్రుడు దేవుడు

రామచంద్రుడు కరుణజూపిన రాని సౌఖ్యము లేదురా


రాముడిచ్చును బలము తేజము రాముడిచ్చును శాంతిని

రాముడిచ్చు నభయమ్ము జయము రాముడిచ్చును మానము

రాముడిచ్చును సంపదలను రాముడిచ్చును ముక్తిని

రాముడుండగ నండగా కనరాని సౌఖ్యము లేదురా



9, జులై 2023, ఆదివారం

జగమంతా తిరిగి మీరు సంపాదించి

జగమంతా తిరిగి మీరు సంపాదించి తుట్టతుదకు
దిగవిడిచి పోకుందురె తెలివిలేని నరులార

తెలివిచూపి మీరు దేశదేశములను తిరిగేరు
గెలిచి సొమ్ములార్జించి గేహమెల్ల నింపేరు
వలచి ప్రోగులిడిన దెల్ల వసుధ మీదనే వదలి
అలసి యొక్కనాడు లేచి అదేపోత పోయేరు
 
ఏమేమో రాళ్ళు తెచ్చి రత్నములని మురిసేరు
రామనామ మనే దివ్య రత్నమునే మరచేరు
ధీమంతులకే యెరుక రామనామరత్న మొకటె
భూమిజనుల వెంబడించి పోవునట్టి సంపదయని

బందుగులను సంపాదించి వదలిపెట్టి పోయేరే
అందమైన యిళ్ళుకట్టి అవియు వదలి పోయేరే
బందువొకడు రాముడనే వాడున్నా డతని దయే
యిందు నందు సంపదయని యెరుగలేక పోయేరే 

1, జులై 2023, శనివారం

రాముని కిచ్చిన దినమే

కం. రాముని కిచ్చిన దినమే
భూమిని సుదినం బటండ్రు బుధవరు లటులే
రాముని గొలిచిన బ్రతుకే
భూమిని బ్రతుకనుచు మనకు బోధింతురయా

ఓప్రజలారా సత్పురుషులు ఒకమాట అంటూ ఉంటారు.  ఏరోజును ఐతే మనం రాముడి సేవకోసం వినియోగిస్తామో అదే సుదినం అని.

అలాగే వాళ్ళు మనకు మరొక మాటనూ తరచుగా బోధిస్తూ ఉంటారు. రాముణ్ణి సేవించిన జీవితమే జీవితం అని.