30, ఏప్రిల్ 2020, గురువారం

ఎందుకు దయరాదురా యేమందురా


ఎందుకు దయరాదురా యేమందురా

అందరు కరుణాబ్ధి వందురు గద రామ



మందరధర జగద్వందితపాదార

వింద గోవింద సానంద ముకుంద నీకు



నందివాహన వినుత నారాయణా సుర

సందోహసేవిత చరణారవింద నీకు



బృందారకరిపుబృందఖండన ముని

బృందసంరక్షణానంద నాయందు నీకు



ఎందరెందరో భక్తు లందరు నీదయ

నంది తరింప నే నేనెందుకు వెలి నీకు



వందారు సద్భక్తమందార నాయందు

ముందటి దొసగుల నెందుకెంచుట నీకు



ఇందీవరశ్యామసుందర శశికోటి

సుందరవదనారవింద నాయందు నీకు

29, ఏప్రిల్ 2020, బుధవారం

ఏమయ్య రామయ్యా యేమి చేయుదును


ఏమయ్య రామయ్యా యేమి చేయుదును

కామారి సన్నుత కావుము నన్ను



గురువు లెవరును వచ్చి కోదండపాణి యీ

నరునకు నిను గూర్చి నాలుగు మాటలు

సరియైనవి చెప్పి చక్కగ నీపైన

గురికుదుర జేయని దెఱుగవో దేవా



ఏనాటి పున్నెమో ఇంచుక సద్భక్తి

యీ నాటికి కలిగె నీశ్వర నీపైన

కాని సదసద్వివేకంబు చాలమి జేసి

నేను నిన్నెఱుగ లేనుగ దేవా



నీ నామమే పట్టి నిలిపితి మనసున

దాని కన్య మెఱుగను దయచూడవయ్య

నీ నామరూపగుణగానము చేయుదు

దానినే సేవగ తలచవే దేవా


27, ఏప్రిల్ 2020, సోమవారం

ఈ దేహము పడిపోతే నింకొక్కటి వచ్చురా


ఈ దేహము పడిపోతే  నింకొక్కటి వచ్చురా

ఆ దేహమును పడితే నావల నింకొకటి



నా దేహమె సుఖనిదానంబని నమ్మితివా

నీ దేహము నిత్యమై నీదిగా నున్నదో

ఆ దేవుడు నిర్ణయించి నన్నాళ్ళే నిలకడ

కాదటరా దీనిపై గాఢానురక్తి యేల



నీదు దుష్కర్మలను నీదు సత్కర్మలనే

ఆ దేవు డెంచి యిచ్చి నట్టిదీ దేహము

ఆ దేవుని పాల్జేసి యఖిల కర్మములను

యే దేహమును వల దీశ్వరా యనరా



ఆ దేవుడు రాముడై యవతరించి భూమిపై

నే దారి మంచిదో యెఱుగ జెప్పడే

నా దారియె నాదనకు ఆ దేవుని కాదనకు

కాదంటే చావుపుట్టుకల కంతు లేదురా



ఈ దేవుని వలదంటె నింకెవ్వరు కలరురా

ఈ దేవుడే దిక్కెల్లవారలకు

ఈ దేవుడు నీవాడని యికనైన నెఱుగరా

వాదములు మాని రామపాదముల నుండరా


22, ఏప్రిల్ 2020, బుధవారం

రామరామ యనలేవా

రామరామ యనలేవా రాయివా నీవు
రామరామ యనరాదా రాక్షసుడవా నీవు

తరుణి తపము చేసెను తపము నింద్రుడు చెరచెను
పరమసాధ్వి భ్రమపడె బడసె ఘోర శాపము
తరుణి రాయిగ మారెను తపము హరికై చేసెను
పరమపురుషుడు రాముడై వచ్చి దరిశన మిచ్చెను

తప్పు తప్పని పలికెను గొప్ప భయమును పొందెను
తప్పక స్వస్థానమునకు తాను దూరమాయెను
ముప్పు నెరిగి రామపాదములను శరణు పొందెను
గొప్ప దయతో రాజుగా కోసలేంద్రుడు చేసెను

రాయివోలె నున్నను రాముడు కరుణించునే
చేయి జాచి పుణ్యజనుని చేరదీసి కాచెనే
రాయివో రాకాసివో రామకృప కది పట్టునా
హాయిహాయిగ రాముని యమృతనామము చేయుమా


21, ఏప్రిల్ 2020, మంగళవారం

మంచివాడు కదటయ్యా మన రాముడు


మంచివాడు కదటయ్యా మన రాముడు వాడు

మంచి మంచి వరములనే యెంచి యిచ్చేను



కొంచెపువా డన డొక్కని గొప్పవా డన డొక్కని

యంచితముగ నందరిని యాదరించేను

మంచివారి చెడ్డవారి మహితభాగ్యుల విధి

వంచితుల కందరకు వరదు డీతడు



రాముడే లేదను నొక రాలుగాయి వానిని

ప్రేమతో దరిజేర్చి వేదవేద్యుడు

కామితము లిచ్చు గాని కసరుకొన డయ్య

సామాన్యుడు సామవేది స్వామి కొక్కటే



తారకనామంబు నెపుడు తలచి మురియు వాడు

శ్రీరామ యనుటకే సిగ్గుపడు వాడు

ధారుణి నిర్వురును తనబిడ్ద లేనని

చేరిదీసి యాదరించి కోరిన విచ్చేను


20, ఏప్రిల్ 2020, సోమవారం

ఏమయ్యా రామనామ మెంతరుచో తెలిసినా


ఏమయ్యా రామనామ మెంతరుచో తెలిసినా

యేమి కర్మమో కాని యీ నాల్కను నిలువదే



ఎల్ల వేళల నితరుల నెన్ని తిట్టు నోటను

కల్లలాడు టందు చాల గడితేరిన నోటను

పుల్లవిరుపు మాటలను పోచికోలు కబురుల

చిల్లికుండ వంటి నోట చిక్కటెట్లా నామము



నిలుచు టెట్లు హరినామము నీవు హరిభక్తుల

కలిసి తిరిగి వారి సేవ కడు శ్రధ్ధగ చేయక

వలచి హరి నామము పరవశించి పలుకుట

తెలిసి కొనక నీ నోట నిలుచు టెట్లు నామము



పనికి రాని వాదముల వలన నుండు నోటను

పనికి రాని మంత్రముల పలుకుచుండు నోటను

పనికిరాని వారి నెపుడు ప్రశంశించు నోటను

వినవయ్యా నిలుప లేవు విభుని దివ్యనామము


నిన్ను పొగడక దినము గడిపినది


నిన్ను పొగడక దినము గడిపిన దెన్న డున్నది చెప్పుమా

నిన్ను పొగడక నిదురబోయిన దెన్న డున్నది చెప్పుమా



వనజభవుడు పొగడు నంత బాగుగ కాకున్నను

అనిమిషేంద్ర హరులు పొగుడు నంతగ కాకున్నను

మునుపు రామదాసు నిన్ను పొగిడుగతి కాకున్నను

జనజకజావర సన్నుతాంగ మనసుదీర పొగడనా



ఇన్ని యుగములుగ మహాత్మ ఎందరో నిను పొగడినారు

ఎన్ని యుగముల కైన నిన్ను సన్నుతింతు రాత్మవిదులు

ఎన్ని భవముల నుండి నేను నిన్ను పొగడుచు నుంటినో

యన్నది నాకన్న నీకే యన్నివిధముల తెలియును



వేలు లక్షలు కోట్లు నిన్ను వేదవేద్య పొగడువారు

నేల నాలుగు చెరగు లందు నిలచి పాడుచు నున్నారు

చాల తెలిసిన వాడ గాను నీలమేఘశ్యామ రామ

మేలుగ నే నెరిగినటుల మిగుల పొగడుచు నుందును


17, ఏప్రిల్ 2020, శుక్రవారం

దయగల శ్రీరామచంద్ర జయములే కాక


దయగల శ్రీరామచంద్ర జయములే కాక

భయములు నపజయములు నీ భక్తులకు గలవా



భక్తుడై దరిజేరి భరతుడు బడసెగా నీ పాదుకలను

భక్తితో సేవించి గృధ్ధ మపవర్గమును సాధించెను

భక్తుడై సుగ్రీవుడు హరివల్లభత్వము పొందెను

భక్తుడై శతయోజనములను పావని లంఘించెను



భక్తుడగు వీరాంజనేయుడు పడతి సీతను గాంచెను

భక్తుడై  నీలుండు జడధికి వారధిని సంధించెను

భక్తుడై కపివల్లభుడు రావణుని తన్ని వచ్చెను

భక్తుడై యంగదుడు రావణుని సౌధము విరచెను



భక్తులు నీనామ మహిమ వలన నవని నద్భుత

శక్తులు గలవారలై జయశాలురై విలసిల్లిరి

ముక్తులై నీభక్తులు మాబోంట్లను ప్రేరేచి నీ

భక్తపరమాణువులను చేసి పరమగురువు లైరయా


15, ఏప్రిల్ 2020, బుధవారం

రాముని రవికులసోముని


రాముని రవికులసోముని సుగుణ

ధాముని పొగడెద దశరథసుతుని



కామితవరదుని కరుణానిలయుని

భూమినాయకుని పురుషోత్తముని

శ్యామలగాత్రుని సరసిజనేత్రుని

వేమరు పొగడెద వేదవేద్యుని



మునిజనవినుతుని భూమిజావరుని

దినమణిసత్కులసందీపనుని

దనుజదుష్కులవనదహనకారణుని

అనయము పొగడెన నంబుజాక్షుని



తారకరాముని ధర్మస్వరూపుని

శ్రీరఘురాముని సీతాపతిని

కోరిన మోక్షము కొసరు దేవుని

చేరి నే పొగడెద చిత్తమలరగ


అయోధ్యానాథునకు అఖిలజగన్నాథునకు


అయోధ్యానాథునకు అఖిలజగన్నాథునకు

జయశీలుడు రామునకు జయము జయము జయము



సురగణాధ్యక్షునకు సురగణానందునకు

వరదయాశీలునకు సురవిరోధికాలునకు

నరనాథకులపతికి తరణికులోత్తంశునకు

హరికి పరమాత్మునకు ఆశ్రితమందారునకు



శివధనుర్విఛ్ఛేత్తకు జీవలోకశరణునకు

అవనిజారమణునకు అఖిలాత్మునకు

వివిధవేదవేద్యునకు విజ్ఞానసారునకు

భవరుజాశమనునకు పౌలస్త్యదమనునకు



మధురమందహాసునకు మంగళాకారునకు

మధురవాగ్విలాసునకు మహితకీర్తియుతునకు

బుధజనానందునకు పూర్ణచంద్రవదనునకు

విధిశంకరవినుతునకు విశ్వవంద్యచరితునకు


9, ఏప్రిల్ 2020, గురువారం

జయ హనుమంత


పాకారివైరిపుర బాధక హనుమంత

శోకకారణహరణ శ్రీకర హనుమంత



జ్ఞానసాగరరూప జయ హనుమంత

మానితాఖిలగుణమణి హనుమంత

దానవనికురంబ మర్దన హనుమంత

జానకీ శోకసంక్షయ హనుమంత



పవనాత్మజ రామభక్త హనుమంత

రవిపుత్రముఖ్యసచివ హనుమంత

రవికులేశనుత విక్రమ హనుమంత

స్తవనీయచారిత్ర్య జయ హనుమంత



రామభక్త్యమృతార్ణవ హనుమంత

రామభక్త సుఖకారక హనుమంత

రామేష్ట బ్రహ్మచర్యరత హనుమంత

మామీద దయచూపుమా హనుమంత


8, ఏప్రిల్ 2020, బుధవారం

నిన్ను విడిచి యుందునా..


నిన్ను విడిచి యుందునా నే నొక్క నాడైన

సన్నుతాంగ శ్రీరామ జానకీ రమణ



విడువనేర్తు నినుతెలుపని విద్యల నన్నింటిని

విడువనేర్తు ధనములపై వెల్లువెత్తు మోహమును

విడువనేర్తు మిత్రబంధువితతి పైని ప్రేముడిని

విడువనేర్తు నిజశరీరస్పృహనైన నిశ్చయముగ



నిన్ను విడిచి యుందునా నేను నీ భక్తుడనై

అన్నిటికిని నీవుంటి వనుచు నుందుగాని

యెన్నడేని యేదేని యెటులైన విడువనో

కన్నతండ్రి నీకొరకై కరుణారస వార్నిధి



పాపబుధ్ధులను కలిసి పకపకలు వికవికలు

నే పగిది నేని విడువ నిచ్చగింతు గాని

తేప కీరీతి తోలుతిత్తులలో దూరుబుధ్ధి

నేపగిది నేని విడువ నిచ్చగింతు గాని

రామరామ రామరామ...


రామరామ రామరామ రామ సుగుణధామ రామ

రామరామ రామరామ రామ సీతారామ రామ



రామరామ రామరామ రఘుకులేశ్వర రామ

రామరామ రామరామ రాజీవనయన రామ

రామరామ రామరామ లక్ష్మణాగ్రజ రామ

రామరామ రామరామ శ్యామలాంగ రామ



రామరామ రామరామ భూమిజావర రామ

రామరామ రామరామ రాక్షసాంతక రామ

రామరామ రామరామ రావణాంతక రామ

రామరామ రామరామ రామ పట్టాభిరామ



రామరామ రామరామ రాజచంద్రమ రామ

రామరామ రామరామ రమ్యచారిత్ర్య రామ

రామరామ రామరామ కామితార్ధద రామ

రామరామ రామరామ మాముధ్ధర శ్రీరామ


7, ఏప్రిల్ 2020, మంగళవారం

ఏమని రాముని నామమును..


ఏమని రాముని నామమును నీ

వేమరచితివే ఓమనసా



కామితఫలదుని నామము కన్నను

భూమిని రుచికర మేమున్నదనే

పామరత్వమున పడిపోయితివి

స్వామిని శరణము వేడగదే



ప్రేమగ శ్రీరఘురాముని నామము

గోముగ నిచ్చలు కొలిచితరించక

రాముని మెచ్చని రాకాసులతో

నేమిటికే పొందేమిటికే



రాముని దశరథరాముని సీతా

రాముని దనుజవిరాముని సద్గుణ

ధాముని రాజారాముని నామము

నేమరి యెటు తరించెదవే


2, ఏప్రిల్ 2020, గురువారం

అపరాధా లెందు కెంచే వది సబబు కాదు


అపరాధా లెందు కెంచే వది సబబు కాదు

అపవర్గము నడిగినా నంతే కాదా



వాడెవడో అశ్వథ్థామ వలెవచ్చి నీ చక్రము

వేడితినా యిమ్మనుచు వెన్నుడా చెప్పరా

కోడిగమే చేసితినా కువలయాన బంగారపు

లేడి యుండదనుచు తెలియ లేకపోతి వైతివని



తెలివిలేని యొకడేదో పలికినంత నంతగా

కలగి నీ విల్లాలిని కారడవుల కంపినందు

కలిగి నిన్ను తిట్టితినా కాదే  రామయ్యా

కలిని కొట్ట వేమనుచు కసురుకొంటిని కాని



అపరాథులె యైన గాని యమితకరుణ జూపితివే

అపరాథము లెంచనేల నమితభక్తి పరునిలో

విపరీతము లేల రామ వేగమే బ్రోవవే

నృపశేఖర రామచంద్ర నీవాడ నేగదా

జయశీలుడు శ్రీరామచంద్రుని యిల్లాల


జయశీలుడు శ్రీరామచంద్రుని యిల్లాల

దయగల సీతమ్మతల్లి దండాలమ్మా



ముక్కంటి వింటిని మొదట నీవెత్తగ

చక్కజేసెను రామచంద్రు డద్దాని

బెదిరించు రావణు వెఱ్ఱివేషంబుల

నెదిరించి గెలిచిన దీవే గదమ్మా



మదినిన్ను నమ్మితి మహిళాశిరోమణి

ముదమున బ్రోవవె పుత్రుడ నమ్మా

తలయెత్తి చురచుర తరుణి నీ వరసిన

నిలువున నాతడే నీఱగు నమ్మా



కలికిరో రావణు కులమును సొదబెట్ట

తలచి పతికి పేరు వలచితి వమ్మా

నిలువెత్తు దయవు నీయోర్మి జనులకు

కలతలు తొలగించి కాచిన దమ్మా


అన్నిటికిని నాకు నీవున్నా వను నమ్మకము


అన్నిటికిని నాకు నీవున్నా వను నమ్మకము

నన్ను సదా రక్షించుచున్నా వను నమ్మకము



ఈనాటిది కాదు కదా యేనాడీ భూమికి

నేను నేననుచు దిగినానో ఆనాటిది

నానాటికి బలపడినది నన్నెపుడు వీడనిది

నా నమ్మిక  యిది మంచిది నాకు రూఢియైనది



పదునాలుగు లోకములను పాలించు విభుడవే

యిదిగో యొక ప్రాణి నేలుటెంత మాట

మది నొక్కి ఘడియయేని మరువకుండు నన్నును

వదిలి యుందువా నీవు భక్తరక్షణాచణ



అనవరతము నీసేవ నమరుట నావంతు

నను దయతో నేలుట యనునది నీవంతు

వినుతశీల వంతులిట్లు విశదముగ నుండగ

నినునమ్మి భక్తుడనై నిలువనే నిచ్చలును


1, ఏప్రిల్ 2020, బుధవారం

రామ రామ నారాయణ రక్తి ముక్తి దాయక


రామ రామ నారాయణ రక్తి ముక్తి దాయక

రామ రామ రామాయణ రమ్యకథానాయక


రామ రామ నారాయణ రమ్యశేష తల్పగ

రామ రామ నారాయణ రవికులాభ్దిసోమ

రామ రామ నారాయణ రాజీవ లోచన

రామ రామ నారాయణ ధీమతాంవర



రామ రామ నారాయణ భూమిజానాయక

రామ రామ నారాయణ రణరంగభీషణ

రామ రామ నారాయణ రాజ్యప్రదాయక

రామ రామ నారాయణ రావణాంతక



రామ రామ నారాయణ రమ్యసద్గుణార్ణవ

రామ రామ నారాయణ కామితార్ధదాయక

రామ రామ నారాయణ ప్రేమస్వరూప

రామ రామ నారాయణ రక్షమాం హరే