22, ఏప్రిల్ 2020, బుధవారం

రామరామ యనలేవా

రామరామ యనలేవా రాయివా నీవు
రామరామ యనరాదా రాక్షసుడవా నీవు

తరుణి తపము చేసెను తపము నింద్రుడు చెరచెను
పరమసాధ్వి భ్రమపడె బడసె ఘోర శాపము
తరుణి రాయిగ మారెను తపము హరికై చేసెను
పరమపురుషుడు రాముడై వచ్చి దరిశన మిచ్చెను

తప్పు తప్పని పలికెను గొప్ప భయమును పొందెను
తప్పక స్వస్థానమునకు తాను దూరమాయెను
ముప్పు నెరిగి రామపాదములను శరణు పొందెను
గొప్ప దయతో రాజుగా కోసలేంద్రుడు చేసెను

రాయివోలె నున్నను రాముడు కరుణించునే
చేయి జాచి పుణ్యజనుని చేరదీసి కాచెనే
రాయివో రాకాసివో రామకృప కది పట్టునా
హాయిహాయిగ రాముని యమృతనామము చేయుమా