29, ఆగస్టు 2017, మంగళవారం

తెలుగో యమ్మ తెలుగు!


సుమశీ యస్వీర్ గారి బ్లాగులో‌ ఈరోజున మాతృభాషను సేవించి మనగదయ్య అన్న సందర్భోచితమైన వ్యాసం చూసాను.

ఆయన ఒక పద్యం ముగింపులో 'దేవభాషాపుత్రి తెలుగుభాష' అన్నారు. అలా అనటం అంత సముచితం‌ కాదేమో‌నని నా సందేహం. ఈ విషయం లో‌ ఒక వ్యాఖ్య వ్రాద్దామని మొదలు పెడితే, ఇదిగో‌ ఇలా ఒక టపాగా తయారై కూర్చుంది.

తెలుగునిండా సంస్కృతం మమేకం‌ కావటానికి అప్పటి దేశకాలపరిస్థితులు కారణభూతం అయ్యాయి. అందుకు మనం‌ సంతోషిస్తున్నాం. తెలుగు స్వయం‌ప్రతిపత్తి కల భాష. ఇలా సంస్కృతమయం‌ కావటం వలన ఎంత లాభం‌ కలిగిందీ‌ అని కొందరూ ఎంతో‌నష్టం‌ జరిగిందని కొందరూ అంటూ ఉంటారు.

తెలుగు నిండా ఇప్పుడు ఇంగ్లీషు నిర్ధాక్షిణ్యంగా దూరిపోతోంది. ఒకప్పుడు, ఎంత నిర్ధాక్షిణ్యంగా అనండి ఎంత దయతో‌ అనండి ఎలా సంస్కృతం మన తెలుగును ఆవరించుకుందో అచ్చం అలాగే. ఈ రోజున మన పలుకబడులన్నీ ఆంగ్లీకరించబడుతున్నాయి. 

అన్నం‌ అనటం బదులు హోటళ్ళవాళ్ళు రైస్ అంటారు చూసారూ. అది ఇప్పుడు అందరి ఇళ్ళల్లోనూ‌ జోరుగా ఉంది. మంచినీళ్ళు అనటం‌ బదులు పిల్లామేకా అంతా ఇంట్లో కూడా వాటర్ అనేస్తున్నారు అలవోకగా. పాఠశాల అన్న మాటనో లేదా బడి అన్న మాటనో మీరు విని ఎన్నాళ్ళైనదో‌ తెలియదు - నేను ఈమధ్య ఎప్పుడూ వినలేదా మాటలు - అందరూ‌ స్కూల్ అనటమేను.

ఇలా తెలుగు ఆంగ్లీకరణకు లోను కావటం తెలుగువాళ్ళకు పెద్దగా మనస్సుకు పట్టటం‌ లేదనే చెప్పాలి. ఐతే నాబోటి ఛాందసులం‌ బాధపడుతూ అందుకు తీవ్రంగా కలత చెందుతున్న మాట మాత్రం కఠిన వాస్తం. దానికి ఋజువు ఏమిటంటే ఈ మాటలు వ్రాస్తున్న సమయానికి కొద్ది నిముషాల ముందే నేను లోలకం బ్లాగులో వ్రాసిన ఒక వ్యాఖ్యయే.  అది ఇలా ఉంది.

మిత్రులు వేమూరి వారూ, మీ సుదీర్ఘమైన ఈ టపాను చదివిన తరువాత కన్నీళ్ళు వచ్చాయి. ఏం చేస్తాం ప్రస్తుతం తెలుగు దశాదిశా ఏమీ బాగో లేవు. రేపోమాపో మరోసారి దేవుడు భూమ్మీదకు పంపేటప్పుడు, తెలుగువాడిగా పుట్టే అవకాశం గురించి ఆలోచిస్తే, ఇద్దామన్నా ఆయనకూ, అడుగుదామన్నా నాకూ, అది ఉండే అవకాశం ఉండదనే బెంగగా ఉంది. ఇకొంచెం కాలానికే తెలుగు అనే భాష ఉండేది అని వేరే భాషల్లో పుణ్యాత్ములు జాలిగా తలచుకొనే పరిస్తితి కదా. మీరు పోతన అంటున్నారు - ఈ కాలం పిల్లలకు అల్పుడెపుడూ పల్కు అంటూ వేమనపద్యం చెప్పినా ఒక్కముక్కా అర్థం కాదు! నా చిన్నతమ్ముడి కూతురు ఇంకా చిన్నపిల్ల - ఆమధ్య ఏనుగంటావేం ఎలిఫెంట్ అని చెప్పొచ్చు కదా అంది ఒక సందర్భంలో. ఇంకేం తెలుగు! ఇంక మనమే మన తెలుగును మర్చిపోకుండా వీలైనంతగా మననం చేసుకొని (మనలో మనమే మాట్లాడుకొని) సంతోషించాలి. కొబ్బరినీళ్ళు ఎవడిక్కావాలీ కోకాకోలా తప్ప, అమృతం ఎవడిక్కావాలి అరకప్పు కాఫీ తప్ప!
-తాడిగడప శ్యామలరావు.

చూసారు కదా నాకెంతగా ఈ ఆంగ్లీకరణం క్షోభను కలిగిస్తోందో. వేమూరి వారి వ్యాసం‌ కూడా చదవండి మా బాధ మరింతగా అవగతం అవుతుంది.

విషయానికి వస్తే తెలుగును ఆంగ్లం విజృంభించి ఆక్రమించటం కనీసం‌ మాబోటి గాళ్ళకు నచ్చటం లేదు.

అలాగే ఒకప్పుడు తెలుగులో‌ సంస్కృతం  ప్రవేశించి ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా త్రివిక్రమావతారం ఎత్తి చివరకు తెలుగుకు సంస్కృతమే తల్లిభాష అనే నమ్మిక రూఢి అయింది. చివరికి అంతా జనని సంస్కృతంబు సకలభాషలకును అనటం మొదలెట్టారు.

శ్రీనాథమహాకవి నిర్మితిగా ప్రసిధ్ధిలో‌ఉన్న క్రీడాభిరామంలో

జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలుకాదె

అని ఒక పద్యం‌ఉంది. నిజానికి క్రీడాభిరామం వ్రాసింది వినుకొండ వల్లభ రాయడు. అది వేరే‌ సంగతి.

ఈ‌ప్రద్యం విశేషప్రచారంలోనికి తెచ్చిన వ్యవహారం ఈ జనని సంస్కృతంబు సకలభాషలకును అన్నది.

అందరమూ‌ తెలుగుకు సంస్కృతం మాతృభాష అని దాదాపు గుడ్డిగా నమ్మే పరిస్థితి.

ఏమో మరొక వందేళ్ళు పోతే ఆ జనని స్థానం నుండి సంస్కృతాన్ని గెంటివేసి ఆంగ్లభాష తిష్ఠవేస్తుంది. తస్మాత్ జాగ్రత.

తెలుగు కూడా పూర్తిస్థాయి భాషయే. దాని నెత్తిమీదకు మరొక భాషను - అదెంత గొప్పదైనా - అదెంత పరమపవిత్రదేవభాషయైనా సరే కూర్చో  బెట్టటం అవసరం కాదు. అలా కూర్చోబెట్టి అదే తెలుగుకు తల్లి అనటం ఒప్పుకోను.

సంస్కృతంవలన తెలుగు పరిపుష్టం కావటం గురించి చర్చించటం లేదు. రేపు ఇంగ్లీషు పదాలవరద వలన తెలుగుకు అంతర్జాతీయస్థాయి వచ్చిందన్న ఉపన్యాసాలు భావితరాలు చేస్తాయేమో అన్నదీ ఆలోచించమంటున్నాను.

నాకు తెలుగుఛందస్సులు ఇష్టం అంటే ఒక ప్రముఖుడు నాతో అవంత బాగుండవండీ, సంస్కృతవృత్తాల్లో వ్రాస్తేనే తెలుగు కవిత్వం‌బాగుంటుంది' అన్నారు.

సంస్కృతం‌పొందిన స్థితినో  ఇంగ్లీషుపొందబోతున్న స్థితినో‌ ద్వేషించమని నేను చెప్పటం లేదు.

తెలుగు అనేది స్వయంగా ఒక భాష. అది మన అమ్మభాష. ఆసంగతిని మాత్రం మరవకండి ప్లీజ్ అంటున్నాను. అమ్మభాషను బ్రతికించి ఉంచుకుందుకు మీరు ఏమిచేయగలరో ఉడతా భక్తిగా అది చేయటాని ప్రయత్నించండని బ్రతిమాలుతున్నాను. నాకైతే ఆట్టే అశల్లేవనుకోండి. ఐనా అడగటంలో తప్పులేదు కదా.



xxxxxx

26, ఆగస్టు 2017, శనివారం

మన వెంకయ్యకు కూనలమ్మ నవరత్న సన్మానం.


ఇప్పటి ఉపరాష్ట్రపతికి
ముప్పవరపు వెంకయ్యకు
తప్పనిసరి సన్మానం
ఓ‌ కూనలమ్మా

తెలుగు గడ్డ పగులగొట్టి
వెలుగుతున్న భాజపాకు
కలిమి వెంకయ్య కదా
ఓ కూనలమ్మా

మాటకారి వెంకయ్యకు
మాటతప్పు వెంకయ్యకు
వాటమైన సన్మానం
ఓ కూనలమ్మా

కూటనీతి వెంకయ్యకు
ఏటి కంట సన్మానం
నేటి తెలుగు రాష్ట్రాల్లో
ఓ‌ కూనలమ్మా

వద్దు వద్దంటూనే
పెద్దపదవి కెక్కాడని
పెద్ద సన్మాన మంట
ఓ కూనలమ్మా

మన కన్నే పొడిచినా
మన తెలుగు వాడుకదా
మన వాడని సన్మానం
ఓ‌ కూనలమ్మా

ఆదుకొనక పోతాడా
ఏదో‌ ఒకనాటి కని
ఏదో‌ ఒక వెఱ్ఱి ఆశ
ఓ కూనలమ్మా

చేదు దిగమింగికొని
ఆదరించు దేవుడవని
చాదవ సన్మానమంట
ఓ కూనలమ్మా

ఈ పదనవరత్నాల్తో
ఓపికగా నేను కూడ
కాపించితి సన్మానం
ఓ కూనలమ్మా

25, ఆగస్టు 2017, శుక్రవారం

ఓ కూనలమ్మా!



వాదవివాదాలు
చేదుజ్ఞాపకాలు
వేదనాజనకాలు
ఓ కూనలమ్మా

తప్పులెన్నెడు చోట
ఒప్పు చూడని చోట
తిప్పలు పడనేల
ఓ కూనలమ్మా

అక్షరాలను తెచ్చి
లక్షణాలను కుక్కి
శిక్షించుటొక పిచ్చి
ఓ కూనలమ్మా

ఉరక వాదున జొచ్చి
కరకు మాటకు నొచ్చి
పరుగెత్త్తు టొకపిచ్చి
ఓ కూనలమ్మా

తనకేమి రాదాయె
పనిమాలి వాదాయె
జనులు నవ్వగ నాయె
ఓ కూనలమ్మా

పండగ పూటాయె
దండుగ వాదాయె
దండిగ బుధ్ధొచ్చె
ఓ కూనలమ్మా

14, ఆగస్టు 2017, సోమవారం

నల్లని వాడవని నవ్వేరా



అందచందాలవాడా అందరివాడా
నందునింటి పిల్లగాడా నావాడా

అల్లరి వాడవని నవ్వేరా జనులు
నల్లని వాడవని నవ్వేరా
పిల్లనగ్రోవి పాట మెచ్చేరా జనులు
చల్లని నవ్వులను మెచ్చేరా

మోజుపడి గొల్లతలు వచ్చేరా గో
రోజనాల రాకాసులు చచ్చేరా
రాజులంత నీతెలివి మెచ్చేరా యోగి
రాజులెల్ల నీమహిమ మెచ్చేరా

వేయినోళ్ళ సురలెల్ల పొగడేరా నా
రాయణుడం వీ వని మ్రొక్కేరా
నీయంత వాడ వీవె నినుచేర యీ
మాయతెర తొలగించి బ్రోవవేరా



మంచి బహుమానమిచ్చి మన్నించితివి


మంచి బహుమానమిచ్చి మన్నించితివి నా
కొంచెపుదన మెంచక కూరిమితో రామ

ఇదిగో యీ తనువేనా యిదికాదు యిదికాదు
ఇదిగో యీ మనికియా యిదికాదు యిది కాదు
చెదరని సాన్నిధ్యమా చెప్పుకొంటి విదే యిదే
యిదే యిదే నీవు నా కిచ్చిన బహుమానము

నీ సన్నిధి లేకున్న నేనొక్క తరువు నేమొ
నీ సన్నిధి లేకున్న నేనొక పెనుశిల నేమో 
నీ సన్నిధి లేకున్న నేనొక్క జడుడ నేమొ
నీ సన్నిధి దొరకినది నీవాడ నైతి నిదే

చింతలేక నీసన్నిధి చేరియుంటినయ్యా
ఇంతకన్న బహుమానం బేముండు నయ్యా
అంతకంత కథికమై యనుభవైకవేద్య మైన
అంతులేని నీ ప్రేముడి యపురూప మయ్యా


13, ఆగస్టు 2017, ఆదివారం

నినుగూర్చి ననుగూర్చి కనుగొన్న వారెవరు

నినుగూర్చి ననుగూర్చి కనుగొన్న వారెవరు
వెనుక నేనాడైన వేడుకగ నేడైన

తనుమాత్రునిగ నన్ను తలచువారే కాని
కనుగొంటిరా నాదు కలరూపు నొకరు
నినునమ్మి యుందునని ననునమ్మ లేని
మనుజులెన్నడు నన్ను మది నెంచగలరు

అటనున్న దిటనున్న దంతయు నొకటన్న
స్ఫుటమైన సత్యమును జూచు వా రెందరు
కుటిలతర్కములందు కూలబడి నట్టి జను
లటమటముననైన తత్త్వార్థవేత్త లగుదురె

ఏవారలు మనల మెత్తు రేవారలు మెచ్చలే
రీవివరముల చింత లెందుకు మనకు
నీవునాకు నీకునేను కావలసిన దిది రామ
పైవారి తోడ మనకు పంతము లేల


11, ఆగస్టు 2017, శుక్రవారం

నీవే నేనుగ నేనే నీవుగ



నీవే నేనుగ నేనే నీవుగ
భావించిన శుభపక్షంబున నిక

బంధము కలదా బాధలు కలవా
సంధించగ ప్రశ్నావళి కలదా
గ్రంథము కలదా గాథలు కలవా
అంధలోక మే మనునో యననీ

లోకము కలదా శోకము కలదా
చీకటి కలదా వేకువ కలదా
యేకత్వము గా కితరము కలదా
ఈ‌ కాలం‌ బిక లేక పోవు కద

నేనుండెదనా నీవుండెదవా
ఈ‌ నేనును నీ వేమి పదములు
తానై నిండిన తత్త్వం బొకటే
జ్ఞానత్రిపుటియు లేనిదె రామ


9, ఆగస్టు 2017, బుధవారం

జగ మిది కలయా ఒక చక్కని నిజమా


జగ మిది కలయా ఒక చక్కని నిజమా
తగు సమాధానము దయచేయ వయ్య

కలయైనచో మరి కనులు తెరచి నేనేడ
కలగానిచో రేపు కనులు మూసి నేనేడ
విలువైన వివరము వినిపించవే
చెలుడా యిది నీవు కాక చెప్పేదెవరయ్యా

కలలలో పలుతావుల పలురూపుల నుందునే
అలలవలె మంచిచెడులు కలిగి మలగుచుండునే
చెలికాడ తెలుపవే యిలపై నాకు
కలుగు జన్మములు పెద్ద కలలోని సంగతులా

కలయందువా ఈ కల నీదో నాదేనో
కలకానిచో నా కలరూపు కథయేదో
చెలికాడ యికనైన దయచూపవే
తెలుపవే కల్లనిజము తీయతీయగ రామ

1, ఆగస్టు 2017, మంగళవారం

నను నేను తెలియుదాక

నను నేను తెలియుదాక నిను నేను తెలియలేను
నిను నేను తెలిసితినా నేనేలేను

వెనుక నేను లేనే లేనని విని యుంటి నీవలన
కనుక నేను కలిగిన దెపుడో కనుగొన వలయును
మునుముందు నేనేమై పోవుదునో యెఱుగనయా
నను నేను తెలియలేని మనుజవేష మెందుకయా

ఇదిగో యీ‌యాట నీవే మొదలు పెట్టినావు కాదా
మొదలు తుది లేని యాట వదిలేది లేదు కాదా
అదనుచూచి యాట కీలక మంతా పసిగట్టాలంటే
అది నన్ను నేను తెలియునంత దాక కుదరదయా

తగ్గని పంతాలవాడా నెగ్గిన పందాలవాడా
సిగ్గరివలె దాగ నేలా ముగ్గులోకి  నీవూ రారా
లగ్గుగ నను నేను తెలిసి యొగ్గెద నన్నే రారా
నెగ్గే నీలోన కలిసి నెగ్గువాడ నగుదును రామ