నా సంగతి చక్కగ నెఱుగుదువు నీ సంగతి కొధ్దిగ నెఱుగుదును ఈ సంగతి జగ మేమెఱుగునయా ఓ కోసలరాజసుతాతనయా |
|
నను పట్టిన మాయను వదలించి చనవిచ్చి మహాధ్భుత సత్పథము కనజేసిన స్నేహితుడవు నీవు నిను జేరి ప్రశాంతుడ నైతిని లే |
నా సంగతి |
నను లోకము మెచ్చును మెచ్చదుపో తనియంగను క్రుంగను పనిగలదే నను నీ పదసన్నిధి చేర్చితివి నిను జేరి ప్రశాంతుడ నైతిని లే |
నా సంగతి |
శరణాగతుడగు జీవుడ నేను కరుణామయుడవు దేవుడ వీవు అరుదైనది మన యీ చుట్టరికం తిరమైనదిలే నీ పెద్దరికం |
నా సంగతి |
23, ఆగస్టు 2015, ఆదివారం
ఓ కోసలరాజసుతాతనయా
19, ఆగస్టు 2015, బుధవారం
ఆహా ఓహో అననే అనను
ఆహా ఓహో అననే అనను అందరి మాటలకు బాహాబాహీలకు నే దిగను వలనుపదదు నాకు |
|||
నాలో నేనే రామరామయని నాదుభక్తి కొలది వీలుచేసుకొని తలచుకొందును వెఱ్ఱిప్రేమ నాది ఈ లోకములో ఎవరికి నచ్చును ఎవరికి నచ్చదిది ఏల గణింతును నా మనసున కిది మేలని తోచినది |
ఆహా | ||
నా జీవితమిది నా భాగ్యమిది నా సంతోషమిది రోజురోజునకు పెరుగుచున్నది లోకము చూడనిది నా జన్మంబును ధన్యము చేయుచు నాదగు పుణ్యనిధి నా జీవనము రామార్పణము నాదు బుధ్ధి నాది |
ఆహా | ||
కొందరు హరిభక్తులుకని మెచ్చెద రందు వింతలేదు కొందరు రామవిరోధులు తిట్టెద రందు వింత లేదు అందరు జీవులు కర్మబంధముల కనుగుణమగు బుధ్ధి పొంది రాముని పొగడుట తెగడుట యందు వింతలేదు |
ఆహా | ||
18, ఆగస్టు 2015, మంగళవారం
నేలపై పుట్టినందు కేలా విచారము
నేలపై పుట్టినందు కేలా విచారము మేలైన రామభక్తి మెత్తె పుణ్యము |
|||
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మన సార గడపుకొన్న జన్మము లెన్నింట సారెకును నేను ప్రియము మీర పాడితి గాన జారకుండ నిలచితిని చక్కని భక్తి |
నేలపై | ||
వెలివిద్య లేల నేర్వ విలువైన రామవిద్య తలలోన నాటుకొన్న తరువాతను కలి యంటుకొనబోదు కలుషమెల్ల వీగు వెలలేని రామవిద్య వెలసియున్నను |
నేలపై | ||
కాలాంతరమున మోక్షగామిని కానుంటిని ఈ లోన తన సేవ నిచ్చి ప్రేమతో నీలమేఘశ్యాము డేలెడు జన్మములు మేలే వేలైన గాని యేల దుఃఖము |
నేలపై | ||
17, ఆగస్టు 2015, సోమవారం
కలలన్నీ నీ కొఱకే కలిగినవి
కలలన్నీ నీ కొఱకే కలిగినవని తెలిసెను కలరాని నాడు నీ వలిగితివని తెలిసెను |
|||
తీయని నీ పలుకు తేనెలతో ముఱిపించి హాయిగా నా తోడ ఆడిపాడి వలపించి వేయేల నేను నీ వేనని కడు రెట్టించి పోయెదవు తెలవారిపోవులోన నమ్మించి |
కలలన్నీ | ||
కలలలో నీ తోడ కలిసియాడుదును నేను కలిసి యాడుటే కాదు కడకు నీ యింటికి పిలిచెద వొక నాడని తెలిసియింటిని నేను నిలిపి నీ మీద యాశ నిలచియుంటిని నేను |
కలలన్నీ | ||
నీకొఱకే నాయాట నీకొఱకే నాపాట నీకొఱకే నేలమీద నిలచి నడయాడుట నీకొఱకే నా నిదుర నీకొఱకే నా కలలు నాకు ప్రసన్నుడవు కమ్ము నా రామచంద్రుడ |
కలలన్నీ | ||
16, ఆగస్టు 2015, ఆదివారం
ఎందుజూచిన హరిగలడు
అందరికి హరిగలడు మరి యన్నిటికి హరిగలడు ఎందుజూచిన హరిగల డానందరాముడై హరిగలడు |
|||
ఇవల నవల గల యన్నిటిని సృష్టించినవాడై హరిగలడు స్థావరజంగమప్రవితతమగు నీ సర్వసృష్టియై హరిగలడు కేవల నిర్గుణుడయ్యును గుణముల క్రీడ సల్పుచు హరిగలడు జీవకోటిహృత్సరసిజములలో చిద్విలాసుడై హరిగలడు |
అందరికి | ||
అర్తితోడ తనపదముల బడువా రందరి కెప్పుడు హరిగలడు నేర్తుము ప్రీతిని నినుగూర్చియని నిలచిన వారికి హరిగలడు కీర్తి నర్థమును కోరి గొలువ పరికించి యిచ్చుటకు హరిగలడు వర్తింతుము నీ వారలమై యను భక్తుల బ్రోచుచు హరిగలడు |
అందరికి | ||
నిరుపమతత్త్వఙ్ఞానము గలిగిన నిశ్చలమతులకు హరిగలడు పరమయోగులను పరిపరివిధముల పరిపాలించుచు హరిగలడు హరిపారమ్యము నెఱిగినవారికి యన్ని విధముల హరిగలడు స్థిరముగ నమ్మిన వారికి భవవిఛ్ఛేదనపరుడై హరిగలడు |
అందరికి | ||
12, ఆగస్టు 2015, బుధవారం
తన రాకపోకలు తా నెఱుగడు
తన రాకపోకలు తా నెఱుగడు తన కర్మఫలములు తా నెఱుగడు |
|||
తనను నడపు శక్తి తా నొక టున్నదని తన బుధ్ధి నెన్నడు తలపోయడు తనచుట్టు బలవత్తరమైన ప్రకృతి తనకు పరిమితి యని తా నెఱుగడు |
తన రాక | ||
హృదయస్థుడై యున్న యీశ్వరు నెఱుగడు సదయుడు వాడని మది నెఱుగడు వదలక వేదాంతవిదుల సేవింపడు తుదకు తనగతి యేమొ యది యెఱుగడు |
తన రాక | ||
అటులయ్యు హరికృప యెటునుండి వచ్చునో మటుమాయ మగు లెల్ల మాయావరోధము చటుకున శ్రీరామచంద్రుని పైభక్తి పొటమరించును బుధ్ధిపుట్టి తరించును |
తన రాక | ||
తానెవరో తా నెఱుగదయా
నీ నామమకరందపానవిలోల మైనాచిత్తము మైమరచి తానెవరో తా నెఱుగదయా తానున్న గదా తన్నెఱుగ |
|||
తనలో నీ వుండ తాను నీలో నుండ తనకు నీకును బేధమనునది లేకుండ ఘనమైన యీ సృష్టి కరిగిపోవుచు నుండ తనకేమి యునికి తనకేడ యునికి తనకేల యునికి |
నీ నామ | ||
మనసున ప్రకృతిమాయ జొచ్చిన వేళ గుణముల నెన్ని తాను తనువున జొచ్చు తనను నీమ్రోల నుంచుకొని మురిసిన వేళ గుణముల కేయునికి తనువున కేయునికి తనకేమి యునికి |
నీ నామ | ||
మనసు శ్రీరామతత్త్వ మందు లీనమైనది మనోలయము తారకమంత్రముచే గలిగినది మనసులేక లేదు జననమరణచక్ర మన్నది యునికి యనగ పరబ్రహ్మమునకు మాత్రమున్నది |
నీ నామ | ||
3, ఆగస్టు 2015, సోమవారం
భగవంతుడా నీకు పదివేల దండాలు
భగవంతుడా నీకు పదివేల దండాలు తగని తంపులు నాకు తలగట్టకు |
|||
నీయందు మనసు తానై నిలచి యున్న వేళ మాయలు పన్ని దాని మరలించకు నా యందు పగ నీకేల నమ్మిన భక్తుడ గాన హాయిగ ధ్యానమ్ము చేయించుకో |
భగవంతుడా | ||
ఒగి నీకు మ్రొక్కగ నుద్యమించెడు వేళ తగని తలపులతోడ తలనింపకు పగవాడనా నీకు పరమభక్తుడ గాన జగదీశ మ్రొక్కులు జరిపించుకో |
భగవంతుడా | ||
బందాలన్నిటి ద్రెంచి బయటపడెడు వేళ అందాలవలలతోడ అలరింపకు ఎందుకు పగ నీకు ఎంతైన భక్తుడ గాన అందుకోవయ్య సేవలందుకోవయ్య |
భగవంతుడా | ||
బృందారకాబృందవందితచరణార వింద గోవింద ముకుంద సానంద వందనములు రామచందురుడా నా యందు నీ దయను చూపి అరసి రక్షించవె |
భగవంతుడా | ||
2, ఆగస్టు 2015, ఆదివారం
ఈ మహితసృష్టి యంతా రామనాటకము
ఈ మహితసృష్టి యంతా రామనాటకము శ్యామసుందరదేవుని ఆరామనాటకము |
|||
అందరూ అందరితో ఆడే నాటకము అందరూ దొంగాటలు ఆడే నాటకము సుందరతర రంగస్థలి చొచ్చి ప్రతిజీవి అందమంతా నాదే అనుకొనే నాటకము |
ఈ మహిత | ||
ఆడించేవాడి నెరుగ నట్లుండే నాటకము ఆడే ఆట తనయిఛ్ఛ అనుకొనే నాటకము అడే ఆట అతనిదే అని మరచి ప్రతిజీవి గోడగించి ఆడిఆడి కూలబడే నాటకము |
ఈ మహిత | ||
ఆద్యంతములులేని అందమైన నాటకము హృద్యమైన కథలతో ఎసగు మంచి నాటకము చోద్యమైన ఆటలో చొక్కి ఆడి ప్రతిజీవి విద్యలెన్నొ చూపించి వెడలిపోవు నాటకము |
ఈ మహిత | ||
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)