3, ఆగస్టు 2015, సోమవారం

భగవంతుడా నీకు పదివేల దండాలు


భగవంతుడా నీకు పదివేల దండాలు
తగని తంపులు నాకు తలగట్టకునీయందు మనసు తానై నిలచి యున్న వేళ
మాయలు పన్ని దాని మరలించకు
నా యందు పగ నీకేల నమ్మిన భక్తుడ గాన
హాయిగ ధ్యానమ్ము చేయించుకో
భగవంతుడా

ఒగి నీకు మ్రొక్కగ నుద్యమించెడు వేళ
తగని తలపులతోడ తలనింపకు
పగవాడనా నీకు పరమభక్తుడ గాన
జగదీశ మ్రొక్కులు జరిపించుకో
భగవంతుడా

బందాలన్నిటి ద్రెంచి బయటపడెడు వేళ
అందాలవలలతోడ అలరింపకు
ఎందుకు పగ నీకు ఎంతైన భక్తుడ గాన
అందుకోవయ్య సేవలందుకోవయ్య
భగవంతుడా

బృందారకాబృందవందితచరణార
వింద గోవింద ముకుంద సానంద
వందనములు రామచందురుడా నా
యందు నీ దయను చూపి అరసి రక్షించవె
భగవంతుడా


2 వ్యాఖ్యలు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.