23, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఇల్లు ముక్కలైన తల్లి యేడ్చును గాని...కం. శ్రీరామా యిది మేలా
యీ రీతిని ముక్కలైన యీ గడ్డకు  రే
పే రోజున యే కష్టము
లే  రానుండినవి తండ్రి ఇకపై తఱచై

ఆ.వె. కలసి యుండలేక కలహించుకొని మేము
వేరుపడితి మయ్య విశ్వనాథ
ఇల్లు ముక్కలైన తల్లి యేడ్చును గాని
ఎదుటి ఇంటి వార లేడ్వరుగద

తే. అయ్యవారి నట్టిల్లను నట్టు లున్న
దివల సీమాంధ్ర భాగమే యెంచి చూడ
అల తెలంగాణ భాగమందన్న విజయ
మట్టు లుండగ చిక్కులతుట్ట లుండె

ఆ.వె. తెలుగువాడి నన్న దేశంబు నవ్వగా
శిరము వంచుకొనెడు స్థితికి నేడు
చేరుకొంటి మయ్య యేరీతి  నిక ముందు
జరుగ గలదొ శుభము సారసాక్ష

కం. కాలము చేసిన దానిని
మేలని కీడనుచు నెంచి మేమతి భ్రాంతిన్
దూలిద మిది యెల్లను నీ
లీలయె యను నట్టి యెఱుక లేక మహాత్మా


[ నా శ్యామలీయం బ్లాగులో 500వ టపా ఇలా వ్రాయవలసి వస్తుందని అనుకోలేదు.]

6 వ్యాఖ్యలు:

 1. శ్యామలరావు గారు!
  చివరి పద్యంలో రెండవ పాదంలో "మేము భ్రాంతిన్" అన్న చోట గణభంగమయింది.
  చూసి సరిదిద్దండి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలండీ. సరిజేసాను. చివరిదాక పరుగెత్తి భంగపడిన తెలుగుగణాల్లాగే చివరిపద్యంలోనూ గణం భంగపడిందండి.

   తొలగించు
 2. ఏం భయం లేదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే! 500 వ టపాకి అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మన తరమున తలెత్తుకొనడం కాస్తంత కష్టమైనా విషయమే...
  శేష జీవన పయనం మనమున పూర్తిగ విషాదమే...
  నచ్చిన నచ్చకున్న ఇది మింగవలసిన కషాయమే...
  కనుచూపు మేర కానరాకున్నది మరి దాటుకోను ఏ ఉపాయమే...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సన్నని చామదుంపలా మిగిలిన రాష్ట్రావశేషం ఇంకో రెండు భాగాలయ్యేట్టుంది - రాజధాని నగరం విషయంలో. దానికి అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని ఎటు వంటి ఉద్యమాలూ ఇంత స్థాయిలో నడవ్వని నా అభిప్రాయం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సూర్యగారూ,

   ఒకభాగం చామగడ్డలాగా ఉంది, మరొకభాగం కందగడ్డలాగా ఉంది. పోనీలెండి ఆకారాలు ఏర్పడ్డాయి మన వికారాల పుణ్యాన ఐనా. బాగుంది.

   చామగడ్డ ఐనా కందగడ్డ ఐనా దుంపగడ్డలేకదా, ఏ దుంపగడ్డ ఐనా కోసుకుతినేవాడి కత్తికి బలికావలసిందే కదా. కాలం వీటీని కోసుకు తిటుందా ముందుముందు? ఏమో ఏమి చెప్పగలం! కానున్నది కాక మానదు. ఇంకా ఏఏ ఆత్మాభిమానాలు అభివృధ్ధినినాదాలూ కత్తులందిస్తాయో కాలక్రమంలో దుంపలుతెగటానికి. కాలో దురతిక్రమణీయః.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.