28, ఫిబ్రవరి 2020, శుక్రవారం
ఎవరో వారెవరో నా చెవిలో నిటు లూదిరి
ఎవరో వారెవరో నా చెవిలో నిటు లూదిరి
అవు నతడే హరి యతని నాశ్రయించు మనిరి
అది కలయో మరి నిజమో యని తెలియని దాయెను
ఇదియది యని తెలియని స్థితి యుదితమాయె నంతట
ఎదుటనె గని శుభమూర్తిని యెఱిగితి భువనేశుని
మది నేలెడు రాముని తిరుమల వేంకటేశ్వరుని
సదయుని చిన్మూర్తిని గని చాల సంభ్రమించితిని
హృదయ ముప్పొంగ నతని పదములపై వ్రాలితిని
పదునాలుగు భువనములకు ప్రభువును చిరునగవుల
పెదవి విప్పి పలికె కొన్ని మధురమధుర వాక్యములు
అతివత్సలు డగు శేషుడు నంతట నా కగుపడగ
అతని తోడ తిరిగి కొన్ని యపురూపము లరసితిని
అతడు చెప్ప నెఱిగికొంటి నవి నాకు తొల్లిటివని
హితవు లతని వలన విని స్మృతి నెఱిగితి నపుడు
తెలిసికొనిన సంగతులను తలచుకొనిన సుఖమగు
పలుకుల నీ సంఘటనను తెలుపనగు నటు లయ్యు
తెలుప లేను విశదముగను తెలుపెద నొక మాటను
తెలిపెదను సుజనులార మలు పొకటి రానున్నది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)