2, జనవరి 2024, మంగళవారం

హృదయమందిరము నందున


హృదయమందిరము నందున రాముడు 

  ముదమున కొలవై యున్నాడు

ముదమున కొలువై యున్నాడు తన

  ముదిత సీతతో రాముడు


తడయక నిజభక్తుల కనిశంబును

  దండిగ సిరు లిచ్చేవాడు

అడిగిన వారల కభయము నిచ్చే

  అమితదయాపరు డుగువాడు

మిడిసిపడెడు రాకాసుల మూకల

  వడివడిగా ద్రుంచెడు వాడు

కడుగడు ప్రేమను నాహృదయమునే

   విడిదిచేసికొని యున్నాడు


పరమాత్ముండని యెఱిగిన యోగుల

   బహుధా మన్నించే వాడు

పరమాప్తుండని తలచే సుజనుల

   వదలక రక్షించే వాడు

ధరణీతనయను కూడి నిత్యమును

   పరమశోభ నుండెడు వాడు

చిరుచిరునవ్వులు చిందించుచు నా

   చిత్తమునందే యున్నాడు


నిరుపమానుడై నిరంజనుండై

  నిర్మలుడై యుండే వాడు

అరయగ నానా భువనంబులనే

  అమరించిన వేల్పగువాడు

ధరాతలంబున దయతో బొడమి

   దశకంఠుని జంపిన వాడు

నరాధముడగు నాపై దయతో

   నా హృదయములో నున్నాడు