పాలించవయా శ్రీరామా పరిపాలించవయా రఘురామా
త్రిభువనజనకా త్రిభువనపోషక త్రిభువననాయక రఘురామా
త్రిభువనజనసన్నుతశుభనామా దేవదేవ హరి రఘురామా
సరసిజలోచన సురగణనాయక సరసిజోదరా రఘురామా
సరసిసిజాసనశంకరసన్నుత సరసిజముఖ హరి రఘురామా
సురలును మునులును నిరతము పొగడే హరివే నీవని రఘురామా
మరువక నీయెడ భక్తిని విడువని మనుజుడనయ్యా రఘురామా
హింసాలోలుపరాక్షసగణముల ధ్వంసముచేసెడు రఘురామా
సంసారార్ణవ మీదగలేనుర సంరక్షించర రఘురామా
జ్ఞానులు యోగులు సిధ్ధులు పొగడే సర్వాత్మకుడా రఘురామా
నానాలుకపై నిలువగనీరా నీనామంబును రఘురామా
భక్తుల కోర్కెలు తీర్చే తండ్రీ వందనమయ్యా రఘురామా
ముక్తినొసంగే నీచరణములకు మ్రొక్కెదనయ్యా రఘురామా