సకలసౌఖ్యము లిచ్చు సార్వభౌముని వీని
నకలంక మగు భక్తి నర్చించరో
మదమున మునులను గదుముచు జన్నముల
చిదుము రక్కసుల చెండిన వీరుని
మదియించి పైబడి ముదితల చెఱబట్టు
పదితలల పురుగును పట్టి నలిపిన వాని
శరణన్న వారికి సకలసంపద లిచ్చి
కరుణతో చక్కగ కాపాడు స్వామిని
నిరతము తన నామస్మరణము చేసెడి
నరులకు మోక్షమే వరమను స్వామిని
సుగుణాభిరాముని జగదేకవీరుని
నగజేశసన్నుతుని నారామచంద్రుని
పగలనక రాత్రనక పనివేరు కలదనక
నిగమాంతవేద్యుని నిలిపి హృదయంబుల