1, ఫిబ్రవరి 2023, బుధవారం

హరికథకు పద్మశ్రీ

ఈ రోజున భండారు శ్రీనివాస రావు గారు హరికథకు దక్కిన పద్మశ్రీ అని ఒక టపా వేసారు. అది చదివిన తరువాత వ్రాస్తున్న నా వ్యాసం ఇది.

హరికథలు వినటం నాచిన్నతనంలో ఒక మంచి అభిరుచిగా ఉండేది. ఇప్పుడు విందామన్నా సరిగా కథ చెప్పే వారు ఉన్నారో లేదో తెలియదు. దూరదర్శన్ ఛానెళ్ళ వారు ప్రసారం చేస్తున్న హరికథలు అప్పుడప్పుడు వింటున్నా అవేవీ నన్ను అకట్టుకోవటం లేదు. నా చిన్నతనంలో మానాన్నగారు హరికథలను బాగా యిష్టపడటం వలన వారి నుండి ఆ అభిరుచి నాకబ్బింది. రేడియోలో వచ్చే‌ హరికథలను తప్పకుండా ఇద్దరమూ విని ఆనందించే వాళ్ళము.

అప్పట్లో ఆకాశవాణి వారు హరికథలనూ విరివిగా ప్రసారం చేసేవారు. నాటకాలనూ విరివిగా ప్రసారం చేసేవారు. తరచూ రేడియో‌నాటక సప్తాహాల్లాంటివి కూడా వచ్చేవి. అలాగే సంగీతకచ్చేరీలూ తరచుగ వచ్చేవి. మానాన్నగారూ నేనూ అవన్నీ వినేవాళ్ళం శ్రధ్ధగా. ఏడాది కొకసారి ఉగాది సందర్భంగా పండుగనాటి ఉదయం ఆకాశవాణి వారి కవిసమ్మేళనం ఉండేది. ఇద్దరం తప్పకుండా ఉత్సాహంగా వినేవాళ్ళం. మానాన్నగారు పద్యాలంటే ఎంతో ఇష్టపడే వారు. చాలా శ్రావ్యంగా పద్యాలను గానం చేసే వారు కూడా. ఆయనకు ముఖ్యంగా వడ్డాది సుబ్బారాయ కవి గారి భక్తచింతామణీ శతకం లోని పద్యాలంటే ప్రాణప్రదంగా ఉండేది. తరచూ వాటిని గొంతెత్తి మహాశ్రావ్యంగా పాడేవారు. ఉగాది కవిసమ్మేళనంలో విశ్వనాథ వంటి ఉద్దండుల కవిత్వాలను విని ఆనందించే వాళ్ళం. రాను రానూ పద్యాలను త్రోసిరాజని ఆకవిసమ్మేళనంలో వచనకవిత్వాలకు పెద్దపీట వేయటం మొదలయ్యింది. ఆధోరణి మానాన్నగారికి నిరుత్సాహం కలిగించేది. ఒకసారి ఐతే అందరూ వచనకవితలే చదివారు. ఒక్కరూ శ్రావ్యంగా ఒక్కపద్యమూ చదవకపోవటమూ - ఆవచనకవిత్వం ఏమిటో ప్రతిలైనూ రెండేసి సార్లు చదవటం ఏమిటో - ఆయనకు అస్సలు నచ్చలేదు. ఇంక మనం ఈకవిసమ్మేళనం వినక్కర్లేదు అనేసారు! అలాగే నాటకం ఐనా హరికథ ఐనా కూడా అది నచ్చితే దాని గురించి కొంచెం నాతో చర్చించే వారు.

అప్పట్లో మేము కొత్తపేట (తూ-గో-జి) గ్రామంలో ఉండే వాళ్ళం. ఆఊళ్ళొ వినాయకచవితి, శరన్నవరత్రాలూ చక్కగా జరిపేవారు. చవితికి ఊరినిండా వెలిసిన పెద్దపెద్దపందిళ్ళలోనూ నవరాత్రాలకు రాజరాజేశ్వరీ అమ్మవారి గుడిలోనూ హరికథాకాలక్షేపాలు తప్పనిసరిగా ఉండేవి.

కొత్తపేటను ఆనుకొని పలివెల పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ శివుడు కొప్పులింగేశ్వరస్వామి వారు. ప్రాచీనాలయం. కాకతీయుల నాటి శాసనాలు అప్పటికి ఇంకా కొన్ని గుడి స్థంభాలపైన ఉండేవి. వాటికి నకళ్ళు తీసి మనవాళ్ళు భద్రపరచారో లేదో తెలియదు. అవి ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో ఆధునికీకరణలో కొట్టుకుపోయాయో తెలియదు. ఆగుళ్ళో కూడా మహాశివరాత్రి గొప్పగా జరిగేది. ఇద్దరమూ తప్పక ప్రతి మహాశివరాత్రికీ పలివెల వెళ్ళే వారం. ప్రసక్తి వచ్చింది కాబట్టి మరొక మాట. మందపల్లి పుణ్యక్షేత్రం కూడా కొత్తపేటను ఆనుకొనే ఉంటుంది.

శివరాత్రి సందర్భంగానే కాక ఇతర సందర్భాల్లో కూడా పలివెల వెళ్తూ ఉండే వారం. అటువంటిదే ఒక సందర్భం పలివెల శివాలయంలో జరిగిన ఒక హరికథా కాలక్షేపం. కథకులు ఎవరో ఇప్పుడు గుర్తులేదు. మార్కండేయ చరిత్రం చెప్పారు. హరికథా గానం అంతా సంస్కృతంలో జరిగింది. రాత్రి తొందరగా భోజనాలు ముగించుకొని మానాన్నగారూ, ఆయనతో మరికొందరు ఉపాధ్యాయులూ, వారి వెంట నేనూ ఆ హరికథకు వెళ్ళాం. తిరిగి వచ్చేసరికి తెల్లవారుజాము ఐనది.చాలా గొప్పగా చెప్పారు హరికథను.

నాచిన్నతనంలో కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథను కూడా విన్నాను. స్థలం కొత్తపేట. సందర్భం ఎన్జీవో భవనం ప్రారంభోత్సవం ఆవిష్కర్త జిల్లా కలక్టర్ గారు. సభలో వినోద కార్యక్రమం శాస్త్రిగారి హరికథ. కథాంశం విరాటపర్వం.  అసలు ఆభవనం పైన ఎన్.జీ.వో భవనం అని ఉండవలసి ఉంటే ఎందుకో అందరూ ఆశ్చర్యపోయేలా ఎవరో కాని ఎన్.జి.జి.వో భవనం అని చెక్కించారు. మానాన్నగారూ మరికొంత మందీ అది చూసి బాధపడ్డారు.

హరికథను సచ్చిదానంద శాస్త్రి గారు ఎంతో అసహ్యంగా చెప్పారు ఆనాడు. స్టేజి మీదే వెకిలి రికార్డింగు డాన్స్ చేసారు. అసలు కథను మాత్రం నామమాత్రంగా చెప్పారు. అప్పట్లో నర్తనశాల సినిమా వచ్చి బాగా అడింది. అందులో పాటలు జగత్ప్రసిధ్ధం అయ్యాయి. జననీశివకామినీ అన్న భక్తి గీతం ఎంత గొప్పగా ఉందీ అంటే అందరికీ అది కంఠస్థం ఐపోయింది. శాఖాచంక్రమణంగా ఒక మాట చెప్పాలిక్కడ. మాశ్రీమతి అక్కగారు ఒకరు నిత్యం పూజలో ఈ జననీశివకామినీ అన్న పాటను పాడుతూ ఉంటారు! సరే శాస్త్రి గారు ఈపాటనూ పాడారు. జనరంజకత్వం కొసం అన్నట్లుగా ఆ నర్తనశాల లోనిదే ఐన దరికి రాబోకు రాబోకు రాజా అన్న పాటను పాడారు - అదీ పరమ వెకిలి చేష్ఠలతో.

ఆయన తన హరికథలో తప్పకుండా ఓం హరా శంకరా అన్నపాట పాడతారు. ఆనాడూ పాడారు. పాడిన తరువాత ఈ నాపాటను మెచ్చుకొని జమున గారు నాకు పదివేలు చదివించారు అని అన్నారు. అంతకు పూర్వమూ ఆతరువాత కూడా సచ్చిదానంద శాస్త్రి గారి హరికథను విన్నాను నేను. ఆయన తప్పని సరిగా ఓం హరా శంకరా అన్నపాట పాడారు అన్ని కథల్లోనూ సందర్భం చూసుకొని.

ఆరోజు ఆయన చెప్పిన నానాకంగాళీ హరికథ సభలో ఉన్న ఎవ్వరికీ అస్సలు నచ్చలేదు. అస్సలు హుందాగా లేదని చాలా బాధపడిన వాళ్ళెందరో.

ఐతే ఇలాంటి హరికథలతో జనాకర్షణ బాగానే చేసి సచ్చిదానంద శాస్త్రిగారు బాగానే సంపాదన చేసారని చాలామంది చెప్పగా విన్నాను.

కొత్తపేటలో మేము గర్ల్స్ హైస్కూలు ఎదురుగా ఉన్న తాడిగడప వారి ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళం. సందుకు ఈపెడగా మాయిల్లు ఉంటే ఆపెడగా కరణంగారు సరస్వతుల వారి ఇల్లు ఉండేది. ఒక సారి శరన్నవరాత్రుల సందర్భంగా ఒక భాగవతార్ గారు వచ్చి సరస్వతుల వారి ఇంట్లో మకాం చేసారు బంధుత్వాన్ని పురస్కరించుకొని. ఆయన కథ కూడా చాలా బాగా చెప్పారు ఆరాత్రి. అప్పట్లో నవరాత్రులకు తొమ్మిది రోజులూ గుళ్ళో హరికథాకాలక్షేపం ఉండేది కదా, ఈయనది ఆరవరోజున జరిగింది అని ఇప్పటికీ‌ గుర్తే.

నేను ఉద్యోగార్ధం హైదరాబాదుకు రావటం జరిగింది. (తెరాస/భారాస వారు అప్పట్లో ఆరోపించినట్లుగా తెలంగాణాను దోపిడీ చేసేద్దాం అని రాలేదు లెండి). అక్షరాలా పొట్ట చేత్తో పట్టుకొని వచ్చాను. అప్పటికి మేము రంపచోడవరంలో ఉన్నాం. మొదటిసారి హైదరాబాదు నుండి ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక ట్రాన్సిష్టర్ రేడియో పట్టుకొని వెళ్ళాను మానాన్నగారి కోసం. అది ఎప్పుడూ ఆయన చేతుల్లోనే ఉండేదని మా అమ్మగారు అంటూ ఉండే వారు. ఎప్పుడన్నా ఒక్క మంచి రేడియో ప్రోగ్రాం మిస్ కాకుండా అది ఆయనకు కూడా ఉండి ఆనందాన్ని ఇచ్చేదట.

హైదరాబాదు వచ్చేసాక కూడా, రేడియో లోనూ ప్రత్యేకం గానూ నేను చాలానే గొప్ప హరికథా గానాలను విన్నాను. కొత్తపేట వదిలిన తరువాత కూడా హరికథలపై ఆసక్తి అలాగే ఉండేది. మానాన్నగారి నిర్యాణం అనంతరం కూడా ఇంకా కొన్నాళ్ళు రేడియో ప్రభ నడిచింది. అన్నాళ్ళూ‌ అంటే టీవీ వచ్చి రేడియోను మూలకు నెట్టేసే దాకా నేను రేడియోలో హరికథలను వినే వాడిని. నాటకాలనూ వినే వాడిని. కచ్చేరీలనూ వినేవాడిని.

ఇంతకీ సచ్చిదానంద శాస్త్రిగారికి పద్మశ్రీ అంటే అది అయన కథకు మెచ్చి ఇచ్చినది అనుకోవాలా? ఆయన జనాకర్షణ కల కళాకారుడు కాబట్టి ఇచ్చారని అనుకోవాలా? లేదా అయనకు ఏమన్నా మంచి పలుకుబడి కూడా ఉంది కాబట్టి వచ్చిందా? నాకు తెలియదు. ఈపద్మశ్రీ బిరుదులకు ఆట్టే విలువ ఇవ్వనక్కరలేదని నా అభిప్రాయం. 

ఈమధ్య నేను ఈపద్మ అవార్డుల గురించి చేసిన ఒక వ్యాఖ్యలో ఈఅభిప్రాయాన్నే వ్యక్తపరిచాను నెమలికన్ను బ్లాగులో .

అన్నట్లు హరికథకూ నాకు ఒక బాదరాయణ సంబంధం కూడా ఏర్పడింది! నా మామగారు స్వర్గీయ పోణంగి శరభరాజు గారు స్వయంగా హరికథా భాగవతార్. ఆయన హరికథా పితామహ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారికి నేరుగా శిష్యులు.