ప్రేమమీఱ నీవిజయగాథలను పేర్కొని పాడెదము సీతా
రామ నీకు సరిసాటిలే రనుచు భూమిని చాటెదము
కరుణారససుధాంబుధి వని శ్రీకర నీదరిజేరి సదా
సురనరవరులును సిధ్ధసాధ్యకింపురుషాదులు నిదే
కరమనురక్తిని నిరంతరమును పరిచర్యలు సలుప
విరాజిల్లు శుభమంగళ మూర్తివి వేడుక నిను గనుచు
నిగమంబులు నిను ప్రస్తుతించగను నెగడు రామచంద్రా
యుగయుగంబులుగ భూమిని నెలకొని యున్నది నీ సత్కీర్తి
జగములన్నిటను విస్తరించినది చక్కగ నీ సత్కీర్తి
పగలురేలు నిను పొగడుచు మిక్కిలి భక్తితోడ మేము
జయజయ జానకిరమణా యంటే చాలును మాకికపై
భయహేతువులు నశియించునని బాగుగ లోనెఱిగి
రయమున భవబంధములు తొలగునని రామచంద్ర నిన్నే
దయజూపుమని వేడెదమయ్యా జయశీలా సతము