రామా రామా రామా యని శ్రీరామచంద్రుని నామమును
ప్రేమగ నిత్యము పలికెడు వాడే రాముని సన్నిధి చేరునయా
రామ రామ యని ప్రేమగ పలుకగ రాముడు మనసున నిలువవలె
కామవికారము లణగెడు దాక రాముడు మనసున నిలువడుగా
రాముడు మనసున నిలచెడు దాక కామవికారము లణగవుగా
రాముని సత్కృప కలిగిన నాడే యీముడి చక్కగ విడివడుగా
రామ రామ యని చింతన చేయగ రాముని తత్త్వము తెలియవలె
భూమిని సద్గురు బోధకలుగక రాముని తత్వము తెలియదుగా
సామాన్యుల కిల సద్గురుబోధలు చాలదుర్లభం బనదగుగా
రామునిచరితమె సద్గురువగుచును భూమిజనులకు కలదు కదా
రామ రామ యని స్మరణము చేయుట కేమియు సరి కావిల ననుచు
రామున కన్యము తలపక నిత్యము రామస్మరణము చేయుచును
రాముని చరితమె బోధగురువుగా రాముని కృపయే ప్రేరణగా
రామున కంకిత మొనరించవలె ప్రేమమీఱ తన జీవితము