శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామా
నారాయణా నీవు శ్రీరాముడను పేర ధారుణిం బ్రభవించి నావయ్యా
వారిజాసను దొట్టి సురముఖ్య లర్ధింప వసుధపై ప్రభవించి నావయ్యా
కారుణ్యమూర్తివై మునియాగమును గావ ఘోరాటవుల జొచ్చినావయ్యా
ఘోరాకృతులు పాడు రాకాసు లట మూగ నారాచముల ద్రోలినావయ్యా
ఆపైన మిథిలలో హరుని వింటిని ద్రుంచి అవనిజాతను పొందినావయ్యా
కోపించి దుమికిన పరశురాము నెదిర్చి గొప్పపేరును పొందినావయ్యా
పిన్నమ్మ కైకమ్మ పొమ్మంచు సెలవీయ విపినభూముల కేగి నావయ్యా
వెన్నంటి యవనిజయు తమ్ముడౌ సౌమిత్రి వెంటరా నీవేగి నావయ్యా
అచట రావణు డనెడి రాక్షసేశ్వరుడు నీయతివనే గొనిపోయినాడయ్యా
విచలించి రామయ్య సీతమ్మకై నీవు బిట్టుగా శోకించి నావయ్యా
నీబలం బెఱిగి సుగ్రీవుడను కపిరాజు నీకాప్తుడై నిలచినాడయ్యా
నీబంటు హనుమన్న చేరి లంకాపురి నీతన్వికై వెదకి నాడయ్యా
కపిసేనతో గూడి కడలినే కట్టి లంకాద్వీపమును బట్టి నావయ్యా
విపరీత బుధ్ధి రావణుని యుధ్ధమ్మునను విరచి యతివను కాచి నావయ్యా
ఆరావణుని చావు కెదురుచూచెడి సురల యానంద మింతింత కాదయ్యా
నారాయణా నీవు శ్రీరామ రూపమున నడిపించివి లీల యనిరయ్యా
శ్రీరాముడను నేను దశరథసుతుడను చిత్రంబు మీమాట లన్నావయా
చేరి సాకేతంబు లోకేశులు నుతింప సింహాసనం బెక్కి నావయ్యా
నీదివ్యచరితంబు పాడువా రందరకు నిత్యంబు శుభములే కలిగేను
నీదివ్యనామంబు నిత్యంబు స్మరియింప నిక్కముగ మోక్షమే కలిగేను