అంధ్రయోగులు గ్రంథంలోని మూడవ సంపుటంలో శ్రీ అవధూత వ్యాసమూర్తి సిధ్ధాంతి గారి గురించిన వ్యాసం ఉంది. అది ఆసంపుటిలో24వ వ్యాసంగా ఉంది. 183వ పేజీ నుండి 189వ పేజీ వరకూ ఆ వ్యాసం విస్తరించి కనిపిస్తున్నది. ఈ సంపుటం 2004లో ప్రచురించబడింది.
వ్యాసమూర్తి గారి గురించిన ఆ వ్యాసంలోని ఒక సంగతి శ్యామలీయం పాఠకులతో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ చిరు వ్యాసం వ్రాస్తున్నాను.
వ్యాసమూర్తి గారి 1888 - 1998 మధ్యకాలంలో జీవించిన ఆంధ్రయోగీంద్రులు.
సంపుటిలోని 187వ పేజీలో ఉన్న వాక్యం "క్రీ.శ. 2000 నాటి నుండి ప్రపంచంలోని జనసంఖ్య మూడవవంతు తుడిచిపెట్టుకొని పోతుంది" అని. ప్రస్తుతం ప్రపంచ జనభా 790కోట్లు అంటే అందులో మూడవవంతు 264కోట్లు! చాలా చాలా భయంకరమైన పెద్దసంఖ్య!
విశ్వహిందు మాసపత్రిక భావిభారతభాగ్యోదయం శీర్షికతో జూలై-ఆగష్టు 1999 సంచికలో రావు గారి వ్యాసం అని కుండలీకరణాల్లో పేర్కొన్నారు. రావు గారు ఎవరన్న దానికి సమాధానం వ్యాసంలో 186 వపేజీలోనూ, చివర ఆధారాలలోనూ వివరం ఇచ్చారు - వారు వ్యాసమూర్తి గారి అనుగు శిష్యుడైన వెదురుమూడి వాసి చింతలూరి వేంకట రామమోహన రావు గారు.
ఈ పైన నేను పేర్కొన్న వాక్యం ఉన్న సందర్భంలో వ్యాసమూర్తి గారి కాలజ్ఞానం రావు గారి ప్రసక్తితో మొదలై ఒక దాక్షిణాత్య స్త్రీ సహాయంతో వాజపేయీ గారి ప్రభుత్వం ఏర్పడటమూ అది 11 నెలలకే ఆ దాక్షిణాత్య స్త్రీ సహాయనిరాకరణతో కూలిపోవటమూ తిరిగి అధికారం చేపట్టి 15 సంవత్సరాలు పరిపాలించటమూ అన్న విషయాలను ప్రస్తావించి తరువాత క్రీ.శ. 2000 నాటి నుండి ప్రపంచంలోని జనసంఖ్య మూడవవంతు తుడిచిపెట్టుకొని పోతుంది" అన్న ఆశ్చర్యకరమైన వాక్యం వస్తుంది.
ఇక్కడ ఆలోచనీయమైన అంశం ఏమిటంటే వ్యాసమూర్తి గారు చెప్పిన జోస్యం ఈకరోనా విలయం గురించేనా అన్నది. ఒక వేళ ఈ మహావిలయంలో కరోనా అన్నది మొదటి అధ్యాయం కాదుకదా అన్న శంక కూడా కలుగుతోంది.
ఐతే క్రమంగా ప్రపంచజనభా తగ్గటం 2000 నాటినుండీ మొదలు కావచ్చును కదా అన్న విషయం కూడా మనం ఆలోచించాలి. ఇలా జరగటానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆవిధంగా ఏమీ జనవిలయం ఉండకపోవచ్చును అనుకోవచ్చును.