పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారు శంకరాభరణం బ్లాగులో 2013-03-10 నాడు మహాశివరాత్రి సందర్భంగా ప్రకటించిన శివస్తుతి దండకం.
శంభో మహాదేవ! శంభో మహాదేవ! శంభో మహాదేవ! దేవా! దయాపూర్ణభావా! నగేంద్రాత్మజా
హృన్నివాసా! మహా దివ్య కైలాసవాసా! సదానంద! విశ్వేశ్వరా! సర్వలోకేశ్వరా!
సర్వయోగేశ్వరా! సర్వభూతేశ్వరా! నందివాహా! భుజంగేశభూషా! త్రిశూలాయుధా!
చంద్రచూడాన్వితా! పంచవక్త్రా! జటాజూట సంస్థాభ్రగంగాపగా! దేవదేవా! మహా భక్తి
భావంబుతో నీదు తత్త్వంబు ధ్యానించెదన్.
సహస్రార్కకోటి ప్రభా
భాసురంబై యనాద్యంత వైశిష్ట్యమున్ బొల్చు లింగాకృతిన్ దాల్చి లోకంబులన్నింట
వ్యాపించి యున్నట్టి నీ దివ్య తత్త్వంబు లోకైక రక్షాకరంబై మహానందధామంబునై
జ్ఞానసారంబునై సర్వదా శాంతమై వేదసంస్తుత్యమై యోగి సంసేవ్యమై యొప్పు నో
దేవ!దేవా! అచింత్యప్రభావా!
సురల్ రాక్షసుల్ గూడి
క్షీరాంబుధిన్ ద్రచ్చుచుండంగ నందుండి ఘోరాగ్ని కీలాన్వితంబైన హాలాహలాభీల
మొక్కుమ్మడిన్ బుట్టి లోకంబులన్నింట వ్యాపించుచున్ ఘోర నాశంబు
గావించుచుండంగ నా యాపదన్ బాపి లోకంబులన్నింటికిన్ రక్షవై నీవె యా ఘోర కాకోల
హాలాహలంబంతయున్ నీదు కంఠంబునన్ నిల్పుకొన్నాడవో దేవదేవా! త్రిలోకైక
రక్షాకరా! దుఃఖనాశంకరా! శంకరా!
ఆదిదేవుండవై, జ్ఞానసారంబవై,
భద్రరూపుండవై, కాలకాలుండవై, త్రాతవై, నేతవై, దేశికస్వామివై,
దక్షిణామూర్తివై, యొప్పు సర్వజ్ఞ! సర్వేశ! సత్యప్రకాశా! చిదాకార! నీ తత్త్వ
వైశిష్ట్యమున్ నేను ధ్యానించెదన్ నీదు పాదమ్ములన్ గొల్చెదన్, నిన్ను
కీర్తించుచున్ నీదు సేవానురక్తుండనై జన్మవారాశినిం దాటి యానంద
సాంద్రాకృతిన్ గాంతు నో దేవదేవా! మహాదేవ శంభో! మహాదేవ శంభో! మహాదేవ శంభో!
నమస్తే నమస్తే నమః