పల్లవి.
పాడెద నేను హరినామమును వేడుక మీఱగ వేయినోళులను
ఆడుచుపాడుచు అన్ని వీధుల తిరుగాడెద హరిదయ వేడుకొనుచును
ఇది నేను సంకల్పించి వ్రాసినది కాదు. చిత్రంగా నేటి ఉదయం వేకువఝామున ఈ పల్లవిని పాడుతూ వీధుల్లో తిరుగుతున్నట్లుగా స్వప్నం కలిగింది. అందు చేత, ఆ పల్లవితో కీర్తనను పూర్తిచేసి బ్లాగులో ఉంచుతున్నాను. అదృష్టవశాత్తు ఈ పల్లవిని హిందోళంలో గానం చేసిన విధానం దాని ఆలాపనతో సహా మనస్సులో సుస్థిరంగానే ఉంది. ఐతే మరొక్క మాట. ఇటువంటి విషయాలు బ్లాగులో ఉంచితే కొందరి అపనమ్మకం కారణంగా అక్షేపణలు వచ్చే అవకాశమూ ఉంది కాబట్టి ఈ విధంగా ప్రకటించుకోవటం అంత మంచిది కాదన్న సలహా ఒకటి గతంలో ప్రకటించిన ఒక కీర్తన సందర్భంలో కొందరు విజ్ఞులనుండి అందిన సంగతి నేను మరువలేదు. కాని ఈ సంగతిని లిఖితపూర్వకంగా పదిలపరచుకొనని పక్షంలో అది మరుగున పడిపోతుంది కదా? అందుకని విషయం వెల్లడించుకొని వ్రాయటమే ఉచితం అన్న నిర్ణయానికి వచ్చి, కీర్తనతో పాటే సంగతి సందర్భాలనూ వివరిస్తున్నాను.
పాడెద నేను హరినామమును వేడుక మీఱగ వేయినోళులను
ఆడుచుపాడుచు అన్ని వీధుల తిరుగాడెద హరిని వేడుకొనుచును
ఇచ్చగించి ముల్లోకములు లచ్చిమగడు కలిగించి
ముచ్చటగ వేయికనులతో నిచ్చలు సంరక్షించు
అచ్చమైన సత్యమిది మెచ్చక తృణీకరించి
మచ్చరించు వారలకు హెచ్చరిక కలుగునటుల ॥పాడెద నేను॥
రేయి లేదు పవలు లేదు రేపు బుధ్ధి తెలియుట లేదు
మాయలోన మునిగియున్న మనిషికొక్క మెలకువ లేదు
మాయదారి కలి నణచ మరియొండు దారియె లేదు
వాయివిడచి హరిని వేడగ వలెనని జనులకు తెలియగ ॥పాడెద నేను॥
భక్తులైన వారలకు కలి భయ మెన్నటికిని లేదు
శక్తికొలది చేసిన రామజపము వృధాయగుట లేదు
ముక్తి నిచ్చు రామ మంత్రమునకు సాటి వేరు లేదు
యుక్తి తెలిసి జనులు రామ భక్తులై తరించునటుల ॥పాడెద నేను॥