శతవసంతాలనీ ఒక క్షణంగా గడిపేసాను
అప్పుడొచ్చింది యుగాంతపర్యంతగ్రీష్మం
ఈ క్రూరత్వం ప్రకృతిసహజం అనుకోనా
నిర్వాజపరోపకారసుకృతి వంటారే నిన్ను
ఈ గ్రీష్మాతపాన్నుండి కాపాడేదెవరయ్యా
కనీసం నువ్వైనా పూనుకోకపోతే నాకోసం
వేదాంతం ప్రకారం ప్రకృతిపై నీదే పెత్తనం
నాకర్మం ప్రకారం ప్రకృతిదే పూర్తి పెత్తనం
ఇప్పుడేం చేయాలో పాలుపోకుందే మరి
నీకోసం ప్రకృతిని కొలవటం మానేసాను
అందుకే ఇప్పుడది పగతీర్చుకుంటోంది
నువ్వా యోగనిద్ర నుండి లేస్తావా లేదా
ఇంతకన్నా ఇంకెలా చెప్పాలో తెలియదు
ఎంతచెప్పినా నీకు వినిపించటమే లేదు
నువ్వూడిపడేలోగా నేను పడేలాగున్నాను