1, డిసెంబర్ 2014, సోమవారం

హనుమంతుడి కోరిక




శ్రీరామచంద్రుడు సింహాసనమున
కూర్చుండి యుండగా కొలువుకూటమున
లోకవృత్తము లెల్ల సాకల్యముగను
దక్షులై మంత్రులు తన కెఱిగింప
ఉచితాసనంబుల నున్నట్టి వారు
సామంతరాజులా సరిలేని దొఱను
కొలిచి యాదేశముల్ తెలియు చుండగను
కవులు నట్టువరాండ్రు గాయకు లెల్ల
విద్యల జూపంగ వేచి యుండగను
మునివరేణ్యులు నవ్వుమోముల వారు
తులలేని మహిమలు గలిగిన వారు
సాకేతపురనాథు సభలోని కంత
నాకాశమార్గాన నరుదెంచినారు
వచ్చిన తపసుల వసుధేశు డంత
సింహాసనము డిగ్గి సేవించి తగిన
యాసనంబుల నుంచి యందర కపుడు
ప్రీతిగా నిటుబల్కె వినయంబు మీఱ
మునిసత్తములు మీరు జననాథు నొకని
గనవచ్చు టది వాని ఘనభాగ్య మగును
వాని రాజ్యంబున పాడిపంటలకు
సమృధ్ధి కలుగును సర్వకాలముల
వాని రాజ్యంబున ప్రజల కందరకు
పూర్ణాయువులు గల్గు పొల్పు మీఱగను
వాని రాజ్యంబున ప్రజల కందరకు
ధర్మార్ధకామముల్ తప్పక దొఱకు
మీ రాకయే మాకు మిక్కిలి శుభము
మీ రాకయే మాకు మిక్కిలి జయము
మా పుణ్యములు పండి మాకు మీ దివ్య
దర్శనభాగ్యంబు తాపసులార
కలిగిన దిక మీద తెలుపుడు మాకు
మీ‌ యాజ్ఞ రాముడు మీఱడు దాని
ననవుడు శ్రీరాము గనుగొని మునులు
ఆదినారాయణుండవు నీవు రామ
జానకీహృదయేశ జగదభిరామ
రఘుకులాంబుధిసోమ రాజలలామ
రావణనిర్మూల రణరంగభీమ
కారుణ్యగుణధామ తారకనామ
పరమర్షిగణములు సురలు భూదేవి
ధాతయు నినుజేరి తద్దయు భక్తి
ప్రార్థించి యోదేవ రావణాసురుని
ఆగడంబుల తీరు నణచగా నీవు
నరరూపమును దాల్చు తరుణ మేతెంచె
నని విన్నవించగా నపుడు వారలకు
నభయంబు దయసేసి యవని కౌసల్య
గర్భవాసంబున కడువేడ్క నిట్లు
ప్రభవించితివి శేషఫణి లక్ష్మణుడుగ
చక్రశంఖంబులు చక్కగా భరత
శత్రుఘ్నులను పేర జనియించినారు
రఘువంశమున నీవు రామచంద్రునిగ
అవతరించగ నుంటి వనెడు సత్యమును
చిత్తమం దెఱిగి వశిష్టుండు మున్నె
మీ కులగురువుగా మెలగుచున్నాడు
నిత్యానపాయిని నీకు తోడుగను
శ్రీయాదిలక్ష్మియే శీఘ్రంబుగాను
అవని కడుపునుండి యవతరించినది
రావణు నడగించి దేవాధిదేవ
పట్టాభిషిక్తుండ వగునాడు నీదు
వైభోగమును చూడవచ్చుట కేము
యాగదీక్షితులమై యడవులనుండి
రాలేకపోతిమో రామయ్య తండ్రి
వచ్చితి మీనాడు వనజాక్ష నిన్ను
కనులార చూడ సంకల్పంబు జేసి
మాకు సీతను జూపుమా రామచంద్ర
మాకు లక్ష్మణు జూపుమా రామచంద్ర
మాకు భరతు జూపుమా రామచంద్ర
శత్రుఘ్ను జూపించు సాకేతరామ
సామీరినిం జూపు సాకేతరామ
చూపవె శ్రీరామ సుగ్రీవు నటులె
యందర వీక్షించి ఆశీర్వదించి
స్వస్థానముల కేము చనువార మయ్య
యీ చిన్ని కోరిక నీడేర్ప వలయు
వేఱొండు వలదని వినిపించినంత
నీరేజ నేత్రుండు నెవ్వెరపాటు
చెంది యీ రీతిగ చెచ్చెర బలికె
ఘనులార మునులార వనవాసులార
వినుడయ్య సభ కేను పిలిపింతు నిపుడు
మా తమ్ము లందర మహిత సత్వులను
రాజసభకు వచ్చు రాముడు పిలువ
సీతామహాదేవి శిరసావహించి
మీ‌పాదముల కేము మీఱిన భక్తి
మ్రొక్కువారము గాని తక్కుంగ లట్టి
సామీరి ప్రభృతుల్ సభకు రాలేరు
మునివరేణ్యుల యాన గొని రాముడెట్లు
తప్పి చరించునో తాపసులార
కావున వారికి కబురంపు వాడ
వారెల్ల వచ్చెడు వరకు మా యింట
విడిది చేయుడు మిమ్ము వేడెద నింక
ననవుడు మునులెల్ల రాశ్చర్యపడుచు
రాచనగరుల నుండ రాదు మా కెపుడు
వారు వచ్చెడు దాక వారిజనేత్ర
మీ యింటనే విడిది చేయుట యెట్లు
పోనిమ్ము నినుజూచి పొంగితి మదియె
మాకు చాలని యెంచి మరలి పోయెదము
కలగకు మో రామ కమలాయతాక్ష
యని యూరడించుచు నాడిరి నగుచు
నా మాటలొప్పక నంబుజోదరుడు
శ్రీరామచంద్రుడు చిన్మయు డపుడు
కులగురువుల వంక తిలకించి బలికె
వీరు మహాత్ములు విచ్చేసి నారు
కోరిన కోరిక కోసలరాజు
తీర్చలేదని బల్కి తిరిగిపోయెదరు
కాలంబు నన్ను వెంగళిజేయ నెంచె
నా కీర్తి ప్రభలెల్ల లోకాన నణగ
కాల మొనరించిన గారడీ విద్య
పుణ్యమా యని నేడు పుట్టె నీ చిక్కు
రఘువంశ మర్యాద రక్షించ వలయు
బ్రహ్మర్షి పరమపావనమూర్తి మీరె
యనినంత నా మాట లాలించి మునుల
కనునయంబుగ బల్కె నంత వశిష్ఠ
మౌనీంద్రు డో దయామయులార మీరు
మూడు పవళ్ళును మూడు రాత్రులును
విడిసిన చాలును తడయక నిపుడు
పుష్పకంబును రామభూపాలు డంపు
సౌమిత్రి తానేగి సుగ్రీవ హనుమ
దాదుల గొనివచ్చు నా పైన వారి
నందర వీక్షించి యరుగుట యొప్పు
నని నంత ఋషివరు లట్లు గాదయ్య
వనముల నుండుటే భావ్యంబు మాకు
నొక దినంబున కన్న నొండొక్క చోట
నుండుట మా కెప్పు డుచితంబు గాదు
బ్రహ్మర్షి మము దప్పు పట్టకు మయ్య
యనుచు వాక్రుచ్చగా నాత్మగతమున
శ్రీరామచంద్రుండు చింతించె జొచ్చె
నన్ను నే నెఱిగియు నరుని పధ్ధతిని
వర్తించు చుంటిని పరమర్షు లిపుడు
నన్నుపరీక్షింప నెన్నిన యట్లు
కనుపించు చున్నది కాన వీరలకు
కామితం బొనరించ గడగుదు నింక
నని నిశ్చయంచుచు వనజాక్షుడంత
మంచిది మునులార మహితాత్ములార
దయతోడ దిన మొండు తమరిందు విడిసి
మము కృతార్థుల జేయ మన్నించవలయు
మీరు కోరిన యట్లు పేరోలగమున
పురజనంబుల ముందు భూపుత్రితోడ
మా సోదరులతోడ మారుతితోడ
సూర్యకుమారుడౌ సుగ్రీవుతోడ
నాతని పుత్రుడౌ నంగదుతోడ
వీతరాగుండు విభీషణుతోడ
ఋక్షేశ్వరునితోడ ఋజువుగ మిమ్ము
దర్శించగల నిట్లు దయచేయ వలయు
నని విన్నవింఛిన హర్షించి వారు
విడుదుల కేగిరి విభుని కీర్తించి
రాజేంద్రు డంతఃపురంబున కేగి
సభలోన జరిగిన సంగతు లెల్ల
సీతామహాదేవి చెవులొగ్గి వినగ
విశందబుగను జెప్పి పిదప నిట్లనియె
రేపటి సభలోన తాపసవరులు
నగరవాసులు జూడ నాతోడ నీవు
సింహాసనస్థవై చెన్ను మీఱగను
నా తమ్ములందరు నా ప్రక్కనుండ
మారుతిప్రభృతుల్ మనసమక్షమున
నేత్రోత్సవంబుగా నెలకొని యుండ
రఘువంశమర్యాద రాజిల్లుగాక
ననవిని సీతమ్మ అవనీశ యింత
నవ్యవధిగా నెట్టులా కపివరులు
సభలోని కరుదెంచజాలుదు రనియె
చిరుచిరు నగవుల శ్రీరాముడంత
నింతిరో యిదియెల్ల నెరిగెద వెల్లి
పేరోలగంబున వారల నోట
చింతించవలదని సీత నోదార్చె
నంతట జానకి యగ్నిహోత్రునకు
విన్నపంబులు సేసె వేవేగ నీవు
పవనాత్మజాదుల భావంబులందు
రామదర్శనకాంక్ష రగిలించవయ్య
ఉన్నవా రున్నట్లు తిన్నగా రేపు
రఘునాథు కొలువుకు రావలెనయ్య
అఖిలదేవతలందు నాద్యుండ వగుచు
నాపదలను గాయు నగ్నిహోత్రుండ
మున్ను గాచినయట్లు నన్ను నా పతిని
కావవే యెల్లి యో కరుణాంతరంగ
యని చాలమారులు వినతులు చేసె
అగ్నిహోత్రుని గూర్చి యానాటి రాత్రి
కులగురువులు కూడా కోరిరా రీతి
సామీరిలంకేశజాంబవదాంగ
దాదులు సర్వులు దశరథసుతుని
కొలువున కెల్లి రా గూర్చుమీ వనుచు
నరనాథు డంతట మరుచటిదినము
ఘనముగా నారవకాలంబు నందు
సభదీర్చ జనులెల్ల చనుదెంచినారు
సౌమిత్రులిర్వురు చనుదెంచినారు
పరువున వచ్చెను భరతుడా సభకు
హనుమంతుడంతలో నరుదెంచినాడు
రాక్షసనాథుండు రయమున వచ్చె
జాంబవంతుడు వచ్చె సంతోషమొప్ప
ఘనుడు సుగ్రీవుండు కపిరాజు వచ్చె
నంగదనీలాదు లరుదెంచినారు
ఎక్కెడెక్కడివారు నెక్కటి కపులు
వచ్చిరి శ్రీరామవల్లభుసభకు
నంతలో నరుదెంచె నవనిజ గూడి
విభు డయోధ్యాపతి వేడుక మీఱ
నంతలో ఋషివరు లరుదెంచినారు
కులగురువుల తోడ జలజాక్షుసభకు
సింహాసనంబున సీతమ్మతోడ
నీరేజనేత్రుండు నేత్రపర్వముగ
ఉపవిష్ఠుడై యుండ తపసులెల్లరును
తనివితీరగ గాంచి ధన్యులైనారు
జయరామ శ్రీరామ సాకేతరామ
రావణాంతకరామ రాజలలామ
కళ్యాణగుణధామ కమనీయనామ
అద్భుతదర్శనం బందించినావు
మా కోరికను నీవు మన్నించినావు
షష్టిఘడియలలోన సర్వులం జూపి
కన్నుల పండువ గావించినావు
పోయివచ్చెద మింక భూనాధ నీకు
శుభమగు ననిపల్కి శ్రుతుల వల్లించి
దండిగా దీవించి తాపసోత్తములు
సభ యొల్ల జూడంగ క్షణమాత్రమందె
అంద రంతర్హితులై చనినారు
వచ్చిన సామీరి ప్రభృతులకును
బహుమతు లందించె పార్థివు డపుడు
బహుమతు లొల్లక పలుకాడ దొడగె
సామీరి యంతట స్వామికి మ్రొక్కి
ఏ మయ్య నాకేల నీ బహుమతులు
నిన్న మా నిదురలో నీవు కన్పించి
ఉన్నపాటుగనె రమ్మన్నంత లేచి
ఎగిరివచ్చితి మయ్య యెల్లవారలము
నీకు దూరంబుగ నే నుండజాల
సాకేతరామ నీ చరణారవింద
సేవనాశీలుండ నై వసియింతు
నీ మ్రోలనే యుండి నీ పరిచర్య
చేయుచుండుట చాలు నేయితరములు
నే నొల్లనో తండ్రి నీ చిత్తమనిన
నీ కోర్కి యిదియని నే నెఱుగుదును
కావున నిది యెల్ల కల్పించినాడ
నీవు వేఱొక్కచో నిలువగ నేల
నే రీతి నది నాకు హితమౌను హనుమ
కావున నిది యెల్ల కల్పించినాడ
పుత్రవాత్సల్యంబు పొంగారు చుండ
సీతామహాదేవి చింతించు నిన్ను
కావున నిది యెల్ల కల్పించినాడ
సమ్ముఖంబుననుండి సామీరి నీవు
పరమహర్షమ్మున వర్థిల్లవయ్య
యని స్వామి ప్రియమార హనుమకు నుడివె