6, మార్చి 2014, గురువారం

స్వతంత్రభారతంలో రాజకీయపార్టీలు - 1


మన ప్రియతమ భారతదేశంలో ఎన్ని రాజకీయపార్టీ లున్నాయి?

ఈ ప్రశ్నకు సమాధానం కొరకు మనం భారత ఎలక్షన్ కమీషన్‌వారి వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.

మన ఎలక్షన్ కమీషన్ సమాచార పత్రం ప్రకారం 18-జనవరి-2013నాటికి మనదేశంలో ఆరు జాతీయస్థాయి రాజకీయపార్టీలూ, 54 రాష్ట్రస్థాయిపార్టీలూ‌ ఉన్నాయి.  ఇవి కాక మరొక 1392 పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు ఇంకా పొందని పార్టీలు కూడా ఉన్నాయి.

జాతీయస్థాయి రాజకీయపార్టీలు

1. బహుజన్ సమాజ్ పార్టీ.
2. భారతీయ జనతా పార్టీ.
3. కమ్యూనిష్ట్ పార్టీ ఆఫ్ ఇండియా.
4. కమ్యూనిష్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిష్ట్)
5. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6. నేషనలిష్ట్ కాంగ్రెస్ పార్టీ


గుర్తింపుపొందిన రాష్ట్రస్థాయి రాజకీయపార్టీల సంఖ్య

 1. ఆంధ్రప్రదేశ్ 2 12. మణిపూర్ 7
 2. అరుణాచల ప్రదేశ్ 2 13. మేఘాలయ 2
 3. అస్సాం 3 14. మిజోరాం 3
 4. బీహార్ 3 15.  నాగాలేండ్ 1
 5. గోవా 1 16. ఒరిస్సా 1
 6. హర్యానా 2 17. పాండిచ్చేరి 4
 7. జమ్మూ - కాశ్మీర్ 3 18. పంజాబ్ 1
 8. జార్ఖండ్ 4 19. సిక్కిం 1
 9. కర్నాటక 1 20. తమిళనాడు 3
10.  కేరళ 3 21. ఉత్తరప్రదేశ్ 2
11. మహారాష్ట్ర 2 22. పశ్చిమ బెంగాల్ 3

ఈ వివరాలకు ఆధారమైన ఎలక్షన్ కమీషన్ సమాచార పత్రం  తరువాత కాలంలో మూడు సార్లు  9-4-201315-10-2013, 4-11-2013 నాటి పత్రాల్లో సవరించబడింది.

పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు ఇంకా పొందని పార్టీల సంఖ్య 9-4-2013 నాటికి 1415 కు చేరింది.

అక్టోబరు 15, 2013 నాటికి కర్నాటకలో‌ మరి రెండు ప్రాంతీయపార్టీలు పుట్టుకొచ్చాయి. పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు ఇంకా పొందని పార్టీల సంఖ్య 1508కు చేరింది.

పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు ఇంకా పొందని పార్టీల సంఖ్య  4-11-2013 నాటికి 1534కు చేరుకుంది.

జనవరి 18, 2013 నాటికి  YSR Congress పార్టీ కాని, దాని గుర్తు సీలింగ్ ఫాన్ కాని ఎలక్షన్ కమీషన్ సమాచార పత్రం లో కానితదుపరి కమిషన్ వారు వెలువరించిన సవరణ పత్రాల్లో కాని అదే పేరుతో కనిపించటం‌ లేదు!  ఈ YSR Congressను 2009లో శివకుమార్ అనే లాయరుగారు రిజిష్టరు చేసుకున్నట్లుగానూ, దానిని 2011 మార్చి నెలలో జగన్మోహనరెడ్డి హస్తగతం చేసుకున్నట్లుగానూ వికీపీడియావారి సమాచారం.  అది  ఎలక్షన్ కమీషన్ వారి వెబ్‌సైట్లో 1392వ గుర్తింపు లేని పార్టీగా Yuvajana Sramika Rythu Congress Pary అనే పేరుతో కనిపిస్తోంది.  ఈ‌విషయాన్ని సదరు పార్టీవారి 2012 ఎలక్షన్ ఖర్చుల వివరాల పత్రం ఋజువుచేస్తోంది కూడా.  ఐతే సీలింగ్ ఫాన్ గుర్తును ఇప్పటికీ ఆ పార్టీకి శాశ్వతంగా కేటాయించినట్లు కనబడటం లేదు.

పైన ఇచ్చిన ప్రాంతీయపార్టీల పట్టికలో చిన్నరాష్ట్రాలైన మణీపూర్ పాండిచ్చేరిల్లో ఎన్నేసి ప్రాంతీయపార్టీలున్నాయో గమనించితే ఆశ్చర్యం‌ కలుగుతుంది.

అలాగే మన స్వతంత్రభారతదేశంలో పదిహేనువందలకు పైగా పార్టీలపేర్లు ఇంకా కార్యకలాపాలు కొనసాగించటానికి సిధ్ధంగా ఉన్నాయో గమనిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.

[ కొత్త ఎలక్షన్ షెడ్యూలు వెలువడిందని అందరికీ తెలిసిందే. దాని వివరాలు ఇక్కడ   చూడండి.]