14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

జగడపాటి



లగడపాటి అనటం కన్నా ఆయనను జగడపాటి అనటమే సముచితంగా ఉంటుందేమో! 

ఏదో ఒకటి లెండి.  విషయం ఆయన ఇంటిపేరు గురించి కాదు.

లగడపాటిని ఉరితీయాలన్న మాటకూడా అన్నారు కొంతమంది.

లగడపాటి లాంటి వారిని అసలు చట్టసభలకు పోటీ చేయటానికి అనర్హులుగా ప్రకటించాలన్న మరింత సబబైన వాదనా వినిపించింది.

లగడపాటి పార్లమెంటు నిండుసభలో చేసిన దుశ్చర్య కారణంగా భారతప్రజాస్వామ్యం పరువుపోయిందనీ వాపోతున్నారు కొందరు.

అన్నట్లు ఈ రోజు మన (అ)మిత్రదేశం ఐన చైనా వారి అమూల్యాభిప్రాయం ఒకటి పత్రికల్లో వచ్చింది.  మన ఘనతవహించిన భారతదేశంలో ఉన్నది అపరిపక్వమైన ప్రజాస్వామ్యం అని వారు భావిస్తున్నారట.  అక్కడికి వారి దేశంలో ఏదో గొప్పగా ప్రజాస్వామ్యం వెలిగిపోతున్నట్లు.  బహుశః ప్రజాస్వామ్యం పరిపక్వస్థితికి చేరుకున్నాక అది పార్టీస్వామ్యం అవుతుందని వారి పార్టీ వారి సిధ్ధాంతగ్రంథంలో ఉందేమో.  నాకైతే తెలియదు.   తియాన్మన్ స్క్వేర్‌లో ఆందోళన చేస్తున్న వేలాదిమంది స్కూలు పిల్లలను ఈ పరిపక్వరాజ్యవ్యవస్థ నల్లుల్ని చంపినట్లు చంపిపారేసింది.   ఆ తరువాత రోజుల్లో ఏదో కాన్ఫరెన్సులో తటస్థపడిన చైనాదేశపు ప్రొఫెసరుగారిని ఈ విషయం గురించి అడిగితే  ఆయన చాలా గాభరాపడిపోయాడు.  చుట్టూ పరిశీలించి చూసి ఎవరూ తనని గమనించటం లేదని నమ్మాక ఒక్క ముక్క అన్నాడు.  "ఈ విషయంలో నేను నోరువిప్పి ఒక్క ముక్క మాట్లాడినా నాకూ నా కుటుంబానికీ నూకలు చెల్లినట్లే."  ఈ‌ మాటలు అనేసి ఆయన వేగంగా అక్కడినుండి జారుకున్నాడు.  సర్లెండి శాఖాచంక్రమణం అవసరమా ఇప్పుడు?  మళ్ళీ జ(ల)గడపాటి గారి దగ్గరకే వద్దాం.

ఇంతకీ ఆయన వాదన ఏమిటీ అంటే, "ఆత్మరక్షణ" కోసం తప్పని సరైన పరిస్థితిలో నిత్యం తనజేబులో ఉండే పెప్పర్ స్ప్రేని బయటకు తీసి ప్రయోగించాడట.  

ఆయన ఆత్మరక్షణకోసమే అలా చేసాడనీ, ఒక్కో సీమాంద్ర నాయకుడికీ నలుగురైదుగురు చొప్పున కట్టడిదారులని దొరతనం వారు బిగించారనీ,  ఆ సందర్భంలో సీమాంధ్ర నాయకులను తన్నేవారిని మాత్రం అడ్డుకోలేదనీ, దరిమిలా మోదుగులను చితగ్గొడుతుంటే అటుదూకి, తప్పని సరైన స్థితి వచ్చేసరికి స్ప్రేని వాడానని ల(జ)గడపాటి వాంగ్మూలం.  నిన్న ఒక ఛానెల్లో ఒకాయన లోక్ సభ వీడియోలు చూస్తే సీమాంధ్రవారిపైన జరిగిన దౌర్జన్యమూ స్ప్రే జల్లిన సంఘటన పూర్వాపరాలు తెలుస్తాయని ఛాలెంజ్ చేసాడు.

అసలు అదును చూసి కెమేరాలు అవుట్ ఆఫ్ ఫోకస్ ఎందుకు చేసారో? ఎవరు చేసారో?  సభలో అసలు ప్రధాని (సోనీయమ్మ) కాని ఆక్టింగ్ ప్రధాని (సింగినాదం సింగు) కాని ఎందుకు లేరో కూడా అని ఆశ్చర్యం కలుగుతుంది.  సభసభ్యుల్నే మార్షల్స్‌లాగా వాడుకోవాలన్న అద్భుతమైన ఆలోచనకు గాని ఆ ఇద్దరు ప్రధానులకూ అభినందనలు తెలియజేయాలి!   ఇంకా నయం, ఇలా స్ప్రే చేసే హడావుడి జరుగుతుందని వాళ్ళిద్దరూ ముందే తెలిసి ఆత్మరక్షణ చేసేసుకున్నారని ఎవరూ అనలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ.

ఐనా తెలియక అడుగుతాను.  ఆత్మత్యాగాలకూ సిధ్ధపడి బిల్లుకు అడ్డం నుంచుంటామని భీషణప్రతిజ్ఞలు చేసిన వీరులు ఆత్మరక్షణ చర్యలకు ఎందుకు పూనుకోవాలీ అంట? 

ఒక వేళ చంపేసేరే అనుకోండి.  లగడపాటో జగడపాటో అయన అమరవీరుడు ఐపోయి ఉండేవాడు కదా ఇంచక్కా?  

ఆ దెబ్బతో బిల్లు ఆగిపోయేదేమీ కాదనుకోండి.  ఓ‌ రెండు నిముషాలు మౌనం పాటించి. ఎవరైనా నోరు విప్పే లోగానే బిల్లు పాసయిందని ప్రకటించే వారే.

చంపేస్తే చావాలి కాని తోటి సభ్యుల మానప్రాణాలకు హాని కలిగే విధంగా ప్రవర్తించటం క్షంతవ్యం కాని నేరం.  

ల(జ)గడపాటి తొందరపడ్డారు.  మహా ఐతే నిజంగా మెత్తగా తన్నే వారు.  (పైగా యథాప్రకారం ల(జ)గడపాటి దౌర్జన్యం నశించాలీ అని నినాదాలూ మిన్నుముట్టించే వారు.) ఆ పైన సభనుండి బహిష్కరించే వారు.  అంత మాత్రానికి అదేదో ప్రాణహాని వచ్చేస్తోందని భ్రమించి స్ప్రే చేయటం తప్పా తప్పున్నరా?

అందుచేత ల(జ)గడపాటి పైన సానుభూతి చూపటం సాధ్యం కాదు.