నినుగూర్చి పలికితే విను వారు లేరే
యను చింత వినవయ్య మనసంత నిండె
జనులకు చవులూర స్వల్పవిషయములపై
పనిగొని పలుకుట నా వలన కానే కాదు
యనునిత్యమును నిన్ను గొనియాడు వాడ నే
మునుకొని దుర్విషయముల నెట్లు తడవుదు
పదుగురి మధ్య నిలచి పరమాప్త నినుగూర్చి
ముదమున పలుక నేల ముందు చూపే లేక
మదిలో శ్రద్ధ లేని మనుజుల కాధ్యాత్మ
విదులకు హితమైన విషయము లెటు సొక్కు
జగ మొల్లని విషయసంచయ మేమని నేను
తగునని వివరింపగ తహతహ లాడుదును
మొగము మొత్తెను జనుల మూఢతను గమనించి
జగమేలు రామయ్య తగు దారి చూపుమా