23, అక్టోబర్ 2025, గురువారం

చాల మంచివాడనో

చాల మంచివాడనో చాల చెడ్డవాడనో
కాలమునకు వదిలి నీ కడ నుండనీ

నీ పాదముల నంటి నేను నిలచి యున్నచో
ఏ పాపమును లేదు ఏ పుణ్యమును లేదు 
ఏ పుట్టువులు లేవు ఏ చావులును లేవు
ఏ పాడు భయహేతువు నెప్పుడు లేదు

నీ కాలి యందియలో నేనొక్క మువ్వ నైన
ఏ కర్మమును లేదు ఏ ధర్మమును లేదు
ఏ కిల్బిషము లేదు ఏ కష్టమును లేదు
నాకింక వేరేమి లోకమును లేదు

రామయ్య నీపాదరాజీవములను నేను
ప్రేమతో నిత్యము సేవించుచు నే యుండుట
నేనేమో కోరగ నేమంత వెంగళిని
స్వామి నీచరణమే శరణమందు నయ్య

22, అక్టోబర్ 2025, బుధవారం

శారద

రాముడు నాప్రాణమైతే రమణి నీవే నేను
కోమలి నీ వెట కేగిన నామది నున్నావు

నాకు సత్కీర్తిగ నలుగురితో పలికితి వని

నాకు నేడు తెలియవవ్చె నారీశిరోమణి

నీకు వందనములను నేను చేయరాదు

నీ కీర్తిని చాటుటకై నేను పలుకవచ్చు


పూను కొని నాచేతను పుణ్యకార్యమ్ములు 

మానిని చేయించితివి మాయింటి వెలుగ

నేను నీవు లేక నేడు నిస్తేజుడ నైతిని

నీ నిజతేజ మింక నిలుచు గాక నాలో


ఓ సుశీల శారదా యొక్క సారి నిన్ను

చూసుకొన రాదాయెను సుదతి కలలలోన

నీ సుమనోహరాకృతిని చూచుభాగ్యమ్మును

గాసిపడిన మనసునకు కలిగించును నీవు

ఎంత తెలిసిన గాని

ఎంత తెలిసిన గాని యించుకంతయు రామ
చింతనము లేనట్టి జీవులున్నారు

హరిశాస్త్రములు దక్క నన్యంబు లెన్నియో
కరతలామలకమౌ ఘను లెందరో
ధరమీద నున్నారు తరచుగా తమ సాటి
నరు లెవ్వరనుకొనుచు తిరుగుచున్నారు

హరినామములు దక్క నన్యదైవంబుల
స్మరియించు కొనుచుంచు జడులెందరో
తరియించు తున్నాము తామన్న భ్రమలోన
పరమునకు కాకుండ బ్రతుకుచున్నారు


హరిగతి

ఇంతకు నేవిధి చింతించుటయో
    యెంతగ తరిచిన తెలియక యున్నది
అంతే తెలియని తనం తత్త్వంబును
     చింతించుట నావశమెటులగును

కొందరు నీలశరీరుం డందురు 
    కొందరు నీలగ్రీవుం డందురు
కొందరు నాగశయనానుం డందురు 
    కొందరు నాగాభరణుం డందురు
కొంద రలంకారప్రియు డందురు 
    కొంద రభిషేక ప్రియుడని యందురు
కొందరు చక్రాయుధు డని యందురు 
    కొందరు శూలాయుధు డని యందురు
కొందరు తాను సురాశ్రయు డందురు 
    కొంద తాన సురాశ్రయు డందురు
కొందరు గంగాజనకుం డందురు 
    కొందరు గంగాధరు డని యందురు
కొందరు మదనుని జనకుం డందురు 
    కొందరు మదనవిరోధి సుమందురు
కొందరు స్థితికారకు డని యందురు 
    కొందరు లయకారకు డని యందురు
కొందరు దుర్గకు సోదరు డందురు 
    కొందరు దుర్గానాథుం డందురు
కొందరు హరిహరి యనుచు నుతింతురు 
    కొందరు హరహర యనుచు నుతింతురు
కొందరు రామబ్రహ్మం బందురు 
    కొందరు రామోపాసకు డందురు
కొందరు హరిహరు లొక్కటి యందురు 
    కొందరు తెలియక ముక్తికి చెడుదురు

బ్రతికి యున్నందు కేమి ఫలము


బ్రతికి యున్నందు కేమి ఫలము మనకు సీతా
పతిని కొలువకున్న నేమి ఫలము మనకు

చీమ లెన్ని పుట్టవు చిలువ లెన్ని పుట్టవు
దోమ లెన్ని పుట్టవు భూమి నెల్ల వేళల
భూమి మీద నరునిగ పుట్టి లాభ మున్నదా
రామనామ మెన్నని బ్రతుకొకటి బ్రతికిన

ఘనత కాదు కాదని కాసు లిన్ని కలుగుట
వనిత సర్వ మనుకొని ఫలిత మేమి లేదని
మనసు కెఱుక కానిది మనిషి ప్రీతిమీఱగ
ఇనకులపతి నామమే యెన్నకను బ్రతికిన

అతులితమై సిరియున్న నది యుధ్ధరించునా
వ్రతము లెన్ని చేసిన ఫలిత మెంత కలుగును
శ్రుతులు కంఠగతమై సొరిది మోక్షమబ్బునా
సతతము రామనామస్మరణ లేక బ్రతికిన


హరి నీనామమె

హరి నీనామమె యమృతము నీ
కరుణయె నాకు ఘనవరము

వచ్చును పోవు నుపాధులు హరి నా
కిచ్చట ధరపై నెన్నెన్నో
యెచ్చట నున్నను యెటులున్నను  బహు
ముచ్చట నీదయ వచ్చుట యేరా

సురలకు చిక్కిన సురతో వారికి
దొరికిన భాగ్యం చెందాక
పొరి కల్పాంతము వరకే నాకో
సరిసరి పుట్టుట చచ్చుట కలదా

ఇమ్మహి పుట్టువు లిక చాలును రా
రమ్మని నీవను నందాక 
గుమ్ముగ నీనామమ్మును పలుకుచు
గ్రుమ్మరు భాగ్యమె కోరెద దేవా

పరమపురుష


పరమపురుష రఘువర శ్రీరామా
హరి నిను కొలిచెద నయ్యా దేవా 

మునిజనసన్నుత మోహనాంగ హరి

జనకసుతాప్రియ సారసాక్ష హరి

దనుజనాథఘనదర్పాంతక హరి

మనుజేశ్వరకులమాన్య శ్రీహరి


భువనము లన్నియు పోషించెడు హరి

పవనసుతార్చిత పాదపద్మ హరి

వివరముగా నా వెత లెరిగిన హరి

భవదుర్భరభయవారణ శ్రీహరి


సురవైరి కొడుకును కరుణించిన హరి

కరి మొర విని వెస పరువులిడిన హరి

తరచుగ భక్తుల దరిజేర్చెడు హరి

నిరతము నను దయ నేలెడు శ్రీహరి



18, అక్టోబర్ 2025, శనివారం

వేడరె వేడరె రాముని

వేడరె వేడరె రాముని మీరు వేడరె రాజారాముని
వాడవాడలను వెలసిన సీతాపతిని మన శ్రీరాముని

వేడుక మీఱగ పడతులందరును వివిధరాగముల పాటల
పాడుచు కోలాహలముగ నాడుచు వేడుచున్న శ్రీరాముని
చేడియలందరు వేడుక చేయగ చేరి యానందించు పౌరుల
కూడిరమ్మనుచు సైగలు చేసెడు కుందరదనలను కూడి

మున్ను పెద్దలు చేసిన కీర్తన లెన్నో చక్కగ పాడుచు
పిన్నలు పెద్దలు చల్లని వేళల వీధివీధిని సందడి
మిన్ను ముట్టగను రాముని కీర్తిని మిక్కిలి ముదమున చాటుచు
తిన్నగ వరముల నిచ్చెడు రాముని సన్నిధి నందరు చేరి

10, అక్టోబర్ 2025, శుక్రవారం

శ్రీరామనామం శ్రీరామనామం

కోరినవన్నీ యిచ్చే నామం శ్రీరామనామం శ్రీరామనామం
ధారాళముగ సిరులిచ్చే నామం శ్రీరామనామం శ్రీరామనామం

చిత్తశాంతి నీకొసగే నామం శ్రీరామనామం శ్రీరామనామం
చిత్తుగ యమునే మొత్తే నామం శ్రీరామనామం శ్రీరామనామం

ఘోరకష్టముల తిగిచే నామం శ్రీరామనామం శ్రీరామనామం
దారుణశోకము లణచే నామం శ్రీరామనామం శ్రీరామనామం

ఆరాకాసులు భయపడు నామం శ్రీరామనామం శ్రీరామనామం
చేరి సత్పురుషులు పొగడే నామం శ్రీరామనామం శ్రీరామనామం

మారుని పరుగెత్తించే నామం శ్రీరామనామం శ్రీరామనామం
మారవైరి కతి ప్రియమగు నామం శ్రీరామనామం శ్రీరామనామం

శ్రీరమారమణు సుమధురనామం శ్రీరామనామం శ్రీరామనామం
సారెకు కరుణను జూపే నామం శ్రీరామనామం శ్రీరామనామం

ప్రీతిగ భక్తుల నేలే నామం శ్రీరామనామం శ్రీరామనామం
సీతామాతకు ప్రియమగు నామం శ్రీరామనామం శ్రీరామనామం

భూరిశుభంబుల నొసగే నామం శ్రీరామనామం శ్రీరామనామం
ఆరయ మోక్షము నిచ్చే నామం శ్రీరామనామం శ్రీరామనామం



3, అక్టోబర్ 2025, శుక్రవారం

విన్నపము


విన్నప మాలించుమా‌ పన్నగశయన నా
విన్నపము వినకున్న నిన్ను తిట్టనా

విన్నపములు విని కరిని వేవేగ బ్రోచిన హరి
విన్నపములు విని సతిని తిన్నగ నేలిన హరి
విన్నపములు చేయు నన్ను తిన్నగ రక్షించవో
అన్నన్నా ఆకథనము లన్నియు దబ్బర లందు

విన్నపమును చేసినంత విభీషణు నేలిన హరి
విన్నపములు నేను చేయ వినకుండు టేమిరా
విన్నవించి విన్నవించి విసిగి యూరుకోనురా
తిన్నగ శ్రీరామచంద్ర తిట్టుదురా పదుగురిలో

గిరి నెత్తిన కథ తప్పని కరి నేలిన కథ తప్పని
హరిభక్తుల వెంట నుందు వన్నమాట తప్పని
తరుణి కసలు నీవు వస్త్రదాన మీయ లేదని
పరమకఠినచిత్తుడ వని పదుగురు విన తిట్టుదురా

పోరా

పోయేను పోయేను రామనామంబున పోయేను చెడుగెల్ల పోరా
పోయేను పోయేను రామనామంబున పోదగిన వన్నియును పోరా

పాపరాశులెల్ల రామనామంబున భస్మమయ్యేనురా పోరా
తాపాలు కోపాలు రామనామంబున తగ్గిపోయేనురా పోరా

శాపాల తీక్ష్ణత రామనామంబున సమసిపోయేనురా పోరా
లోపాలు నీయందు రామనామంబున లుప్తమయ్యేనురా పోరా

లావైన కష్టాలు రామనామంబున రాలిపోయేనురా పోరా
భావజుని గడబిడలు రామనామంబున వదలిపోయేనురా పోరా

కనకంబుపై నాశ రామనామంబున కరిగిపోయేనురా పోరా
తనువుపై మోహంబు రామనామంబున తరగిపోయేనురా పోరా

దుర్మదుల గోలెల్ల రామనామంబున తొలగిపోయేనురా పోరా
కర్మశేషంబెల్ల రామనామంబున కాలిపోయేనురా పోరా

ధర్మదేవతమెప్పు రామనామంబున తప్పక లభియించె పోరా
నిర్మలత్వము నీకు రామనామంబున నేడె సిధ్ధించెను పోరా

మోక్షాని కడ్డంకి రామనామంబున ముగిసిపోయేనురా పోరా
మోక్ష ద్వారము వద్ద దేవతలు నీపైన పూలుజల్లేరురా పోరా

చిల్లరదైవము

చిల్లరదైవము లెందరగొలిచిన చిక్కే దేముంది ఆ
అల్లరి మానుక రాముని గొలిచిన నందని దేముంది

చిల్లరసుఖముల నాశించినచో చెడిపోదుము కాదా

చల్లని హరిపాదము లాశించిన సంతోషము రాదా

కొల్లగ మంచివరంబుల నిచ్చే గోవిందుడు లేడా

వల్లమాలిన యాతన లెందుకు పడుదురు మీరంతా


పరమానందము నిచ్చే రాముని భావించక మీరు

పరమమూర్ఖులై వారిని వీరిని పదేపదే కొలిచి

తరచు నిరాశకు గురియౌ టెందుకు దాశరథిని కొలిచి

నిరుపమాన సంపదలు మోక్షమును నిక్కముగా గొనుడీ



2, అక్టోబర్ 2025, గురువారం

హరిని పొగడవే

హరిని పొగడవే నీవు హరిని పొగడవే
మరి యొకరిని పొగడనేల మనసా నీకు

భగవంతుండైన హరిని బ్రహ్మాదులు పొగడు హరిని
నిగమవేద్యుడైన హరిని నిరుపమానుడైన హరిని 
జగములేలుచుండు హరిని సర్వేశ్వరుడైన హరిని
తగినరీతి పొగడవే తరచుగాను పొగడవే

పొగడి బక్కదైవములను పొందునట్టి ఫలమేమే
పొగడి నరాధముల నీవు పొందునట్టి సుఖమేమే
పొగడ దగిన హరినొక్కని పొగిడితే మోక్షమే
తగునని శ్రీహరిని నీవు తరచుగాను పొగడవే

హరేరామ హరేకృష్ణ హరేవాసుదేవ యనుచు
హరేపుండరీకనయన హరేపన్నగేంద్రశయన
హరేభక్తజనావన హరేపతితజనపావన
హరే హరే శరణమనుచు తరచుగాను పొగడవే


నమ్మితి

రామ నిన్ను నమ్మితి ఘనశ్యామ నిన్ను నమ్మితి
కామవైరివినుత చాల గట్టిగ నిను నమ్మితి

చక్కగ కరుణించు దయాశాలి వనుచు నమ్మితి

బక్క ప్రాణులకు నీవే దిక్కు వనుచు నమ్మితి 

మక్కువతో నిను కొలుచుట మంచిదనుచు నమ్మితి 

నిక్కువముగ దైవమనగ నీవే నని నమ్మితి 


వక్రబుద్ధి చూపువారి వలన చిక్కు కలిగితే 

చక్ర మడ్డువేయుదు వని చక్కగ నే నమ్మితి 

అక్రమముగ నన్ను తిట్టు నట్టి వారి పైనను

చక్రంబును పంపుదువని చక్కగాను నమ్మితి 


శక్తికొలది నిను కొలిచిన చాలు ననుచు నమ్మితి 

భక్తజనావనుడ వనుచు బాగుగ నే నమ్మితి 

వ్యక్తమైన యవ్యక్తబ్రహ్మమ వని నమ్మితి 

ముక్తి నొసగు దేవుడవని పురుషోత్తమ నమ్మితి

నారాము డనును

నారాము డనును కైక నారాము డను సుమిత్ర 
నారాముడు కాడా యని నవ్వును కౌసల్య 

వీరి తగవు నవ్వుచు విని మీరాముడు కాడు వాడు

నారాముడు పొండనుచు నరపతి తీర్పరియై 

ఆరాముని చేయిజాచి నారామా రారా యన

శ్రీరాముడు జనకుని దెస చిట్టి పాదములు కదిపె


గోరుముద్ద జూపించుచు కొసరుచు కైకమ్మ పిలువ

బారజాపి సుమిత్రమ్మ వానిని యూరించగ

గారముగా కౌసల్య బంగారు తండ్రి రారా యన

శ్రీరాము డిటునటు జన చిట్టిపాదముల కదిపె


భలే మంచి సమయమునకు వచ్చినాడు సుమంత్రుడు

నలుగురకును మధ్య నిలిచి నా రామచంద్రా యనె

కులుకుచు శ్రీరాము డంత గొబ్బున నా తాత వంక

నలుగురు గొల్లున నవ్వగ నడిచి వాని కౌగలించె




1, అక్టోబర్ 2025, బుధవారం

చాలును

నీవున్నా వది చాలును నాకు
నీవాడ నగుట చాలును

భావజజనక నిన్ను పదేపదే చిత్తమున
భావించి మురియుటే పరమపూరుష
కావలయును గాక యీ భూవలయమందు
కావలసిన దేమి నాకు కమలాయతలోచన

ఎవరెవరో యున్నారని యెట్టి భ్రమలును లేవు
భువి నిది నది నాదనెడు మోహంబును లేదు
వివరింప నీవు దక్క వేరు దిక్కెవరు నాకు
అవధారు రామచంద్ర హరి నీవే చాలు నాకు

ఏమి యేకపత్నీవ్రతమే

ఏమి యేకపత్నీవ్రతమే యెపుడొ దాటిపోయెను గదే 
రామరామ యెంత యపచారమ్మే చెంపలు వేసుకోవే

ఏమే సౌందర్య లక్ష్మి యెంచి యీతని వరియించ
రామవిభునకు సీతమ్మతో నేమి యేకపత్నీవ్రతమే
భామరో నీ వెర్రి గూల శ్రీమహాలక్ష్మమ్మయె సీత
శ్రీమహాలక్ష్మమ్మకు కళయె చెలియా సౌందర్యలక్ష్మి

ఏమే ఆశౌర్యలక్ష్మి యెంచి యీతని వరియించ
రామవిభునకు సీతమ్మతో నేమి యేకపత్నీవ్రతమే
భామరో నీ వెర్రి గూల శ్రీమహాలక్ష్మమ్మయె సీత
శ్రీమహాలక్ష్మమ్మకు కళయె చెలియా ఆశౌర్యలక్ష్మి

ఏమే ఆధైర్యలక్ష్మి యెంచి యీతని వరియించ
రామవిభునకు సీతమ్మతో నేమి యేకపత్నీవ్రతమే
భామరో నీ వెర్రి గూల శ్రీమహాలక్ష్మమ్మయె సీత
శ్రీమహాలక్ష్మమ్మకు కళయె చెలియా యా ఆధైర్యలక్ష్మి

ఏమే దిగ్విజయలక్ష్మి యెంచి యీతని వరియించ
రామవిభునకు సీతమ్మతో నేమి యేకపత్నీవ్రతమే
భామరో నీ వెర్రి గూల శ్రీమహాలక్ష్మమ్మయె సీత
శ్రీమహాలక్ష్మమ్మకు కళయె చెలియా యా విజయలక్ష్మి

ఏమే సామ్రాజ్యలక్ష్మి యెంచి యీతని వరియించ
రామవిభునకు సీతమ్మతో నేమి యేకపత్నీవ్రతమే
భామరో నీ వెర్రి గూల శ్రీమహాలక్ష్మమ్మయె సీత
శ్రీమహాలక్ష్మమ్మకు కళయె చెలియా సామ్రాజ్యలక్ష్మి

ఏమే సత్కీర్తిలక్ష్మి యెంచి యీతని వరియించ
రామవిభునకు సీతమ్మతో నేమి యేకపత్నీవ్రతమే
భామరో నీ వెర్రి గూల శ్రీమహాలక్ష్మమ్మయె సీత
శ్రీమహాలక్ష్మమ్మకు కళయె చెలియా సత్కీర్తిలక్ష్మి

అంగనలారా

అంగనలారా హరినర్చించరె

బంగరుపూవుల బాగుగను


మారము సేయక మనకెల్లపుడును

కోరిన విచ్చెడు గోవిందు డని

తీరుగ ననిశము తీయనిమాటల

సారెకు పలికెడు చక్కని సామిని


నిండుమనసుతో నేరములెంచక

దండిగ వరముల దయచేయుచును

చెండుచు మన సంచితకర్మంబుల

నండగ నుండెడి యద్భుతచరితుని


దుష్ట దానవుల దునుముచు నిత్యము

శిష్టుల బ్రోచుచు చెలగెడు రామున

కిష్టముగను సంగీతము పాడుచు

స్పష్టముగను మోక్షమునే వేడుచు


సమయమిదే

సమయమిదే నను బ్రోవగ చప్పున రారా బహు
విమలకీర్తిప్రభల వెలుగు వీరరాఘవా హరి

తరుణమెరిగి నీవు వచ్చి తగిన రీతిగా మంచి
కరుణ జూపి కావ కున్న కరుగును నీ కీర్తి ప్రభలు 
మరి యట్టిది నేటి దనుక మహినెన్నడు కలుగలేదు
సరి సరి నావలన రామచంద్ర యపఖ్యాతి యేల

సమయ మెరిగి  వచ్చి కరిని చక్కగ కాపాడినావు
సమయమునకు చీరనిచ్చి సాధ్విని కాపాడినావు
సమయమిది కాదా నన్ను చక్కగ కాపాడ రావు
కమలదళాయతేక్షణ కరుణ జూపి కాపాడగ