22, అక్టోబర్ 2025, బుధవారం

హరిగతి

ఇంతకు నేవిధి చింతించుటయో
    యెంతగ తరిచిన తెలియక యున్నది
అంతే తెలియని తనం తత్త్వంబును
     చింతించుట నావశమెటులగును

కొందరు నీలశరీరుం డందురు 
    కొందరు నీలగ్రీవుం డందురు
కొందరు నాగశయనానుం డందురు 
    కొందరు నాగాభరణుం డందురు
కొంద రలంకారప్రియు డందురు 
    కొంద రభిషేక ప్రియుడని యందురు
కొందరు చక్రాయుధు డని యందురు 
    కొందరు శూలాయుధు డని యందురు
కొందరు తాను సురాశ్రయు డందురు 
    కొంద తాన సురాశ్రయు డందురు
కొందరు గంగాజనకుం డందురు 
    కొందరు గంగాధరు డని యందురు
కొందరు మదనుని జనకుం డందురు 
    కొందరు మదనవిరోధి సుమందురు
కొందరు స్థితికారకు డని యందురు 
    కొందరు లయకారకు డని యందురు
కొందరు దుర్గకు సోదరు డందురు 
    కొందరు దుర్గానాథుం డందురు
కొందరు హరిహరి యనుచు నుతింతురు 
    కొందరు హరహర యనుచు నుతింతురు
కొందరు రామబ్రహ్మం బందురు 
    కొందరు రామోపాసకు డందురు
కొందరు హరిహరు లొక్కటి యందురు 
    కొందరు తెలియక ముక్తికి చెడుదురు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.