26, జూన్ 2025, గురువారం

జరుగనీ

జరిగేదే జరుగనీ జగదీశ నీమనసు
కరిగినపుడె కరుగనీ కరుణామయుడా

ఇన్ని పాపఫలములును ఇన్ని పుణ్యఫలములును

నన్ను చుట్టుకోనీ నలిపివేయనీ

నిన్ను కదలించవుగా నిరంజనుడ నాతిప్పలు

కన్నులను మూసుకోని కటాక్షములు దాచుకో


నిన్ను పొగడి పెద్దచేయ నేను పుట్టుచుంటినిలే

వెన్నుడ శ్రీరాముడ విసువు చెందక

అన్నన్నా అలసిపోవుచున్నానని తలచవుగా

ఎన్నా ళ్ళిటు లుండెదవో ఈశ్వర నీయిఛ్ఛయే


విన్నవించరాదా

రామునకు విన్నవించరాదా పరం
ధామునకు విన్నవించరాదా

సుమధురమగు నీనామమె చూడ నాకు రుచియని

రమణి పైన ధనములపై కొమరులపై తనువుపై

భ్రమలు తొలగిపోయెను నీపాదము లిక విడువనని

సమస్తవిశ్వపోష నీసన్నిధియే చాలునని


తమోగుణము వలన నేను తప్పు లెన్ని చేసినను

క్షమామూర్తి వైన నిన్ను శరణు జొచ్చి యుంటినని

యమదూతలు వచ్చుచున్న యలికిడి యగుచున్నదని

కమలాప్తకులసంభవ కటాక్షించవయ్యా యని


మారుమ్రోగ వలయును

మంత్రము నీమనసులోన మారుమ్రోగ వలయును రామ
మంత్రము నీమనసులోన మారుమ్రోగ వలయును 

అందమైన మంత్రము రెండక్షరముల మంత్రము మరి
మందునకును తెలివినిచ్చు మంత్రము తగు
మందై భవరోగంబును మాన్పునట్టి మంత్రము ఒక
పందకును ధైర్యమిచ్చు మంత్రము ఈ మంత్రము

అందరును చేయదగిన హాయిగొలుపు మంత్రము మన
కందరాని మోక్షపదను నందించెడు మంత్రము శివు
డందించిన బహుసులభమైన దివ్యమంత్రము గో
విందుని శుభనామమైన మంత్రము ఈ మంత్రము



నీనామము చాలునననుచు

నీనామము చాలుననుచు నేనెఱిగితి నయ్యా
దానవారి రామచంద్ర దశరథతనయా

నానాజన్మముల నెత్తి నరజన్మము నకు వచ్చి
ఈనరజన్మములు కూడ నెన్నియో నెత్తి
నానాపాపము చేసి నానాబాధలను పడుచు
నీనాటికి శివకృపచే నెఱిగికొన్న శుభనామము

కామారికి యిష్టమైన కమ్మనైన నామమనుచు
కామాదుల నణచివైచి కాపాడెడు నామమనుచు
భూమిని భవతారకమను భూరికీర్తి గలనామము
ప్రేమ మీఱ మోక్షమిచ్చి స్వామి నన్ను బ్రోచుటకు




25, జూన్ 2025, బుధవారం

బంగారుతండ్రి రారా

బంగారుతండ్రి రారా సీ
తాంగన తోడ రారా

హరిదశ్వకులపవిత్ర సురనాయకనుతచరిత్ర
దరహాసపూర్ణవదన పరిపాలితాఖిలభువన
నిరవద్య సుగుణసాంద్ర నరనాయక రామచంద్ర
సరిలేని వాడ రార సరగున నేలగ రారా

వాగీశవినుత రార బ్రహ్మాండనాయక రార
యోగీంద్రవినుత రార నాగారివాహన రార
భోగీంద్రశయన రార వేగ నన్నేలగ రార
బాగొప్పు విక్రమమున వరలు నాతండ్రి రారా



రామహరే యనరే

రామహరే యనరే సీతా
రామహరే యనరే

కరుణాకర హరి కమలదళేక్షణ
నరనాయకకులనాథ విరాధాది
సురవిరోధిగణసూదన సురలోక
పరితోషణ భవబంధవిమోచన

యోగిరాజహృదయోల్లాస మునివర
యాగసంరక్షక హరచాపభంజన
భోగీంద్రశయన పురుషోత్తమ హరి
సాగరగర్వాతిశయసంశోషణ

వనజనయన హరి బ్రహ్మాండాధిప
వినయగుణాన్విత మునిమోక్షవితరణ
వనజాసనశివవినుతపరాక్రమ
అనిమిషగణపత్యర్చితశుభమూర్తి


24, జూన్ 2025, మంగళవారం

శ్రీపతినామస్మరణ

శ్రీపతినామస్మరణ చేయువారు ధన్యులు
శ్రీపతికృపామృతసంసిధ్ధిగల భక్తులు 

శ్రీపతినామస్మరణ పాపములను కరగించును
శ్రీపతినామస్మరణ  శాపములను తొలగించును
శ్రీపతినామస్మరణ  చింత లన్నిటిని బాపును
శ్రీపతినామస్మరణ  శీఘ్రముగా రక్షించును

శ్రీపతినామస్మరణ తాపములను హరియించును
శ్రీపతినామస్మరణ లోపములను సరిదిద్దును
శ్రీపతినామస్మరణ చేసి నరుడు తరియించును
శ్రీపతినామస్మరణ చేయుటయే కర్తవ్యము

శ్రీపతియే రాముడనుచు శ్రీపతియే కృష్ణుడనుచు
శ్రీపతియే భువనములను కాపాడెడు దేవుడనుచు
శ్రీపతియే యోగులెల్ల చింతించెడు బ్రహ్మమనుచు
శ్రీపతినామమును సతము చేయువారు ముక్తులు
 

గోవిందా

ఒప్పులకుప్పవో గోవిందా మా
తప్పుల నెంచకో గోవిందా

దేవుడ వెంచకు గోవిందా యీ
జీవుల తప్పులు గోవిందా 
దేవాదధిదేవుడ గోవిందా మము
దీవించరావయ్య గోవిందా

లప్పలు సొమ్ములు గోవిందా మే
మెప్పుడు కోరము గోవిందా
తిప్పలు పెట్టక గోవిందా మము
చప్పున బ్రోవర గోవిందా

గొప్పవాడవుగా గోవిందా మా
తిప్పలు చూడర గోవిందా
గొప్పగ చాటేము గోవిందా రా
మప్పా నీ గొప్పను  గోవిందా


రామ రామ యని

రామ రామ జయ రామ రామ యని
రామ నామమే నాలుకరా

గోముగ పలుకర గోవిందా శ్రీ
రామ రామ యని రమ్యముగా
ప్రేమగ నిలుపర రామ రామ యని
నామము నీరసనాగ్రమున

ఈమహి జీవుల కెల్లరి కా శ్రీ
రాముడె భవతారకడని తెలిసిన
ధీమంతుల కా క్షేమకరం బగు
నామము పైననె నమ్మకము

నిజమైన భక్తుడు

నిజమైన భక్తు డెపుడు నిన్నే భజించును
విజయరామ మిక్కిలి వేడుకతో

సుజనావనుం డగుచు సూర్యకులమునకు

కుజనులనణగించెడు గోవిందు డడిగో

విజయము చేసెనని వేడుకతో నిన్ను

విజయరామ కొలుచును నిజముగ నీ భక్తుడు


నిజరసనాగ్రంబున నీ నామమును నిలిపి

నిజహృదంతరమున నీ రూపమే నిలిపి

నిజకరకమలముల నీ సేవలో నిలుపు

విజయరామ సతతము నిజముగ నీ భక్తుడు


నిజమైన భక్తునకు నీ నగవులే చాలు

నిజమైన భక్తునకు నీ కరుణయే చాలు

నిజమైన భక్తునకు నీ విచ్చునది చాలు

నిజమైన భక్తుడిక నీ పదమునే చేరు

23, జూన్ 2025, సోమవారం

నన్నేల రారా

రామ నన్నేల రారా సీతా
రామ నన్నేల రారా

రామ రవికులాబ్ధిసోమ బ్రహ్మాదికవినుతమూర్తి
రామ నీలగగనవపుష సోమసూర్యదివ్యనేత్ర
రామ సకలలోకసేవ్యరమ్యశుభదపాదయుగళ
రామ నిత్యసత్యవ్రత పరంతప సమరైకశూర

రామ సకలసుజనవినుతరమ్యసర్వసుగుణధామ
రామ రావణాదిదనుజప్రాణాపహరణనిపుణ
రామ మునిమనోభీష్టకామవరదదైవరాయ
రామ సర్వలోకవినుతనామ వలదురా పరాకు




22, జూన్ 2025, ఆదివారం

ఎవరికి మోక్షము కలదో

ఎవరికి మోక్షము కలదో మదిలో నెంచి చూడరా నరుడా
తరచిచూచితే సత్యము నీకే తలకెక్కునురా నరుడా

హరి హరి యనుటే లగ్గని తలచే నరునకు మోక్షము కలదో 
హరి హరి యనుటకు సిగ్గున చితికే నరునకు మోక్షము కలదో

హరినామము విని పరవశమందే నరునకు మోక్షము కలదో
తరుణి మాటలకు పరవశమందే నరునకు మోక్షము కలదో

హరిపదస్పర్శకు పరవశమందే  నరునకు మోక్షము కలదో
తరుణీస్పర్శకు పరవశమందే నరునకు మోక్షము కలదో

హరిని తలపక సిరులను తలచే నరునకు మోక్షము కలదో
సిరులను కాదని హరినే తలచెడు నరునకు మోక్షము కలదో

స్మరహరవినుతుని గొప్పగ పొగడే నరునకు మోక్షము కలదో
స్మరునే గొప్పగ పొగడుచు నుండే నరునకు మోక్షము కలదో

హరినే కొలుచుచు కాలము గడిపే నరునకు మోక్షము కలదో
నరులను కొలుచుచు కాలము గడిపే నరునకు మోక్షము కలదో

విన్నావా

అన్నాన్నా యిది విన్నావా
విన్నావా యిది విన్నావా

వింతగ కొందరు హరినామంబును
    విన నొల్లరని విన్నావా
వింతగ కొందరు హరిప్రసాదము
    విసరికొట్టుదురు విన్నావా
వింతగ కొందరు హరియే లేడని
    వివరించెదరని విన్నావా
వింతగ కొందరు హరి దుష్టుడని
    గంతులు వేయుట విన్నావా

వింతగ కొందరు శివకేశవులను
    వేరువేరనుట విన్నావా
వింతగ కొందరు రాముని తప్పులు
    వెదకుచు మురియుట విన్నావా
వింతగ కొందరు రావణు గొప్పలు
     వివరించుటను విన్నావా
వింతగ కొందరి కద్వైతామృత
    మంతయు విషమే విన్నావా

వింతగ కొందరు కల్లగురువులను
    పిచ్చిగ నమ్ముట విన్నావా 
వింతగ కొందరు కల్లదైవముల
     వేడుచు చెడుటను విన్నావా 
వింతగ కొందరు భూతప్రేతముల 
    వెర్రిగ కొలుచుట విన్నావా 
ఎంతో భక్తిగా విబుధులు రాముని
    చింతించెదరని విన్నావా 
     

నీనామ మున్నది

శ్రీరామ నీనామ మున్నది మము
తీరము చేర్చుచు నున్నది

శ్రీరామ యనగానే చిదిమి పాపము లెల్ల
ధారాళముగ కృపాధారలు కురిపించి
గోరంతపుణ్యాల కొండంతలుగ జేసి
ధీరులముగ జేసి దీవించుచున్నది

తిలకించ భవవార్ధి మొలబంటి లోతే
వలదింక భయమని వారించుచున్నది
సులువుగ తొల్లిటి సుస్థితి సమకూర్చి
నిలుపుచున్నది దేవ నీమ్రోలసర్వేశ

శ్రీరామ గుణధామ కారుణ్య నిలయ సం
సార సముద్రంపు తీర మింకొక రీతి
చేరగలిగిన వారు లేరయ్య సృష్టిని
నారాయణా జగన్నాథ నిక్కువ మిది

20, జూన్ 2025, శుక్రవారం

రామ రామ

రామ రామ రాజారామ
రామ రామ సీతారామ 

రామ రామ మధురనామ
రామ రామ శుభదనామ
రామ రామ సుగుణధామ
రామ రామ విజయరామ

రామ రామ జగదధీశ 
రామ రామ పాపనాశ 
రామ రామ శాపనాశ 
రామ రామ భవవినాశ 

రామ రామ సమరభీమ 
రామ రామ అరివిరామ
రామ రామ కృపాధామ
రామ రామ పరంధామ

17, జూన్ 2025, మంగళవారం

చెడినది బ్రతుకు


చెడినది బ్రతుకు చెడినది తనువు

చెడక నిలిచెను చిత్తమిదే


అప్పులు చేయకు మను నుపదేశము

తప్పక నిలిచి సదా నేను

యిప్పుడు నా గేహిని దుస్థితిచే

తప్ఫి నిలచితి నప్పులపాలై


చెడినవి ధనములు చెడితే చెడనీ

చెడు నన్నియు నీ పుడమిని

చెడక నిలిచినది చిత్తము భక్తిని

విడువను విడువను విడువను నేనని


చెడెను గౌరవము చెడితే చెడనీ

చెడదా యశమును శ్రీవలెనె

చెడనీ యన్నియు శ్రీరామా నిను

విడువనురా యిని నుడువును చిత్తము 



 

ఏమి జన్మము


రామ రామ యదేమి జన్మము నరు 

డేమి చేయు నా హీనజన్మము 


రామ రామ రామ యనని దేమి జన్మము శ్రీ

రామునిపై భక్తి లేని దేమి జన్మము 


రాముని లోనెరుగకున్న నేమి జన్మము శ్రీ

రాముని సేవింపకున్న నేమి జన్మము 


రామనామరుచి నెరుగని దేమి జన్మము శ్రీ

రామభజన రుచిమరుగని దేమి జన్మము 


రామచింతన లేక యున్న లేమి జన్మము శ్రీ

రామునికై తపియింపని దేమి జన్మము 


రామునిదే కాక యున్న దేమి జన్మము శ్రీ

రామునికృప లేక యున్న లేమి జన్మము 


రామచంద్ర పాహి యనని దేమి జన్మము శ్రీ

రామునికై కరగిపోని దేమి జన్మము 

15, జూన్ 2025, ఆదివారం

రామరామ హరి

రామరామ జయరామరామ హరి రామరామ శుభనామ రామహరి

రామరామ శ్రీరామరామ హరి రమ్యగుణాకర రామరామ హరి 
పరమపురుష శ్రీరామరామ హరి బ్రహ్మాండాధిప రామరామ హరి
నాగశయానా రామరామ హరి నారదసన్నుత రామరామ హరి
దశరథనందన రామరామ హరి  దనుజవిమర్ధన రామరామ హరి 

ఘనపాపాంతక రామరామ హరి ఘనశాపాంతక రామరామ హరి 
సీతానాయక రామరామ హరి శ్రితజనవత్సల రామరామ హరి 
కామితవరదా రామరామ హరి కమలదళేక్షణ రామరామ హరి 
భావజజనకా రామరామ హరి  రావణసంహర రామరామ హరి 

భావవైరినుత రామరామ హరి పరమపావనా రామరామ హరి 
మునిజన కామిత రామరామ హరి మొక్షప్రదాయక రామరామ హరి
వనమాలాధర రామరామ హరి హనుమత్సేవిత రామరామ హరి
సర్వమనోహర రామరామ హరి సాకేతాధిప రామరామ హరి

సురగణవందిత రామరామ హరి నరపతివందిత రామరామ హరి
విమలయశోధన రామరామ హరి వీరాగ్రేసర రామరామ హరి 
పతితజనోధ్దర రామరామ హరి భక్తజనాశ్రయ రామరామ హరి
బ్రహ్మాద్యర్చిత రామరామ హరి బ్రహ్మస్వరూపా రామరామ హరి


గట్టిగా నమ్మండి

రమ్యగుణోపేతుడైన రాముడే దేవుడని
గమ్యము వైకుంఠమని గట్టిగా నమ్మండి

పట్టుపీతాంబరమును కట్టి సింహాసనమున
పట్టాభిరాముడైన వాడెపో బ్రహ్మమని
గట్టిగా నమ్మండి కమలాక్షుని పాదములు
పట్టుకొన్న తరింతుము భవవారాన్నిధి నని

కరుణాసముద్రుడైన హరియే శ్రీరాముడని
పరమాత్ముడు వాని దివ్యపాదములను పట్టిన
నరులకెల్ల మోక్షంబని నమ్మండీ నమ్మండి
పరమభాగవతుల దారి పట్టండీ పట్టండి

సొమ్ములను నమ్మకండి సుతుల సతుల నమ్మకండి
నమ్ముకోండి రామునొకని నారాయణు డతడండి
నమ్మి చెడినవారు లేరు నమ్మండీ నమ్మండి
నమ్మని వారికి వైకుంఠమ్మెక్కడి మాటండి


12, జూన్ 2025, గురువారం

రండు రండు


రండు రండు సుజనులార రాముని సభకు ఉ
ద్ధండులైన హనుమదాదు లుండెడు సభకు

భువనైకమాతయైన పుణ్యశీల యైన
అవనిజాత పతితో సింహాసనాసీనయై
వివిధరీతులుగ తనను విబుధులు పొగడ
నవుమోమున వినుట నానందింతము

జగదేకవీరుడైన జానకినాథు డైన
మగరాయడు సతితో మణిమకుటధారియై
సొగసుకాడు సురలు తన శోభను పొగడ
నగుమోమున వినుట నానందింతము

జయజయ శ్రీరామ యని జానకిరామ యని
వియచ్చరులు పౌరులును వేనోళ్ళ పొగడగ
జయశీలు డైన రామచంద్రుడు సభను
నయమొప్ప తీర్చుట నానందింతము


వదలకుము


వదలకుము వదలకుము భవతారకనామమును

వదలకుము వదలకుము ప్రభువు హరి నామమును 


దిశలన్నిట కీర్తిగలిగి తేజరిల్లెడు నామమును

పశుపక్ష్యుల కైన ముక్తి పంచినట్టి నామమును

దశరథాత్మజుని మధురతరమగు శుభనామమును

నిశావేళలందు గూడ నీ వెన్నడు వదలకుము


పురాంతకుని దయవలన పొందిన యీ నామమును 

హరినామము లందు శ్రేష్ఠమైన యీ నామమును 

పురాకృతము పండి నీవు పొందిన యీ నామమును 

పరాకున నైన గాని వదలకుము వదలకుము


అవలీలగ పాపసమితి నణచివేయు నామమును

భవమును దాటించు నౌకవంటి దివ్య నామమును

ఎవరు హరేరామ యనిన నెంచి కాచు నామమును

చివరి శ్వాస యందు గూడ జీవుడా వదలకుము



తొలగనీ నాదైన్యము


నీదయచే తొలగనీ నాదైన్యము రామా

వేదవేద్య వేరేమి వేడెద నేడు


సురలు కోర కదలి వచ్చి చొచ్చి నరజాతిలో 

సురవైరుల పీచమడచి చూపితివే కరుణను

మరి యట్టి దయ నేడును మన్నించి నాపైన

కురిపించి నన్నేల కూడదా నేడు


కరి నాడు మొరలు పెట్ట కరుణించి వేగముగా

తరలివచ్చి మొసలి గొంతు తరిగితివే నీవు

మరి యిన్ని మొరలు పెట్టు మనుజుడ నాపైన

కురిపించ వేల దయను గోవింద నేడు


మరవనే భవతారకమంత్ర మొక్క నాడును

మరవనే మదిని నీదు మహిమ నేనాడును

మరవక నిను గొల్చు చుండు పరమభక్తుని నన్ను

పరాత్పరా కరుణ నేలవలె గదా నేడు



7, జూన్ 2025, శనివారం

మనసిజజనక

మనసిజజనక నీదు మహిమ తెలియగ
మనుజడ నగు నాకు వశమె మాధవదేవ  

నిను వేడిన సురవరులకు మనసిజజనక  నీవు
మనసుదీర్చి పంపినావు మనసిజజనక 
దనుజపతిని జంపుటకై మనసిజజనక నీవు
మనుజడవై జనించితివి మనసిజజనక

మనుజుడైన దశరథునకు మనసిజజనక నీవు
తనయుడవై కలిగితివి మనసిజజనక 
ఘనుతనొప్పు మునివరులకు మనసిజజనక నీవు
మనసిజుడవుగా నైతివి మనసిజజనక 

మనసిజునకు దాసుండని మనసిజజనక నీవు
కనుగొవి రావణుని తీరు మనసిజజనక 
వనితసిరిని సీత జేసి మనసిజజనక నీవు
ఘనుడు రాముడనగ నొప్పి మనసిజజనక 

గొనిపోయెను సీత నతడు మనసిజజనక నీవు
ఘనరణమున వానినణచి మనసిజజనక 
కొనియాడగ సురలు నరులు మనసిజజనక నీవు
ఘనకీర్తిని పొందినావు మనసిజజనక 


కిమ్మనవేరా


నమ్మితిరా నీవే దిక్కంటే

కిమ్మనవేరా రామయ్యా


ఇమ్మహి నా గజరాజు నేలినది నమ్మదగిన కథ యందువా

నమ్మిన యా ధృవబాలు నేలినది నమ్మదగిన కథ యందువా

అమ్మగువను సంరక్షించినదియు నమ్మదగిన కథ యందువా

నమ్మిన భక్తుని యుమ్మలికమ్ముల నవ్వుచు వీక్షీంచేవే


ఏమయ్యా కరణాంబురాశివని ఎందుకు నిను కీర్తింతురో

భూమిని యుగయుగములుగా భక్తులు పొంగుచు నెందుకు పొగడేరో

రామరామ యది యంతయు దబ్బరరా యని తోచును పోరా

ఏమో ఏకారణమో నన్నొక హీనునిగా నెంచేవే


శ్రీకృష్ణా


సంసారబాధావిదారా కృష్ణా సర్వేశ్వర శ్రీకృష్ణా 


సుమధురసుందరహాసా కృష్ణా శుధ్ధపరబ్రహ్మ కృష్ణా 

కమలాయతేక్షణ కమలామనోహర ఘనపీతాంబర కృష్ణా


గోపగోపికాజీవన కృష్ణా గోకులసుందర కృష్ణా 

పాపతిమిరభాస్కర శ్రీకృష్ణా పరమేశ్వర శ్రీకృష్ణా 


కంసాదిదానవసంహార కృష్ణా కలుషాంతక శ్రీకృష్ణా 

హింసావిదూరా కృష్ణా పరమహంసార్చిత శ్రీకృష్ణా 


పాలితాఖిలజగజ్జాలా కృష్ణా పరమపావనా కృష్ణా 

నీలమేఘసుశ్యామా కృష్ణా నిరుపమసుందర కృష్ణా 


కురుకులవనదావానల కృష్ణా నరసఖ హరి శ్రీకృష్ణా 

నరసింహాచ్యుత నారాయణ హరి కరుణాంతరంగ కృష్ణా 


భక్తవత్సలబిరుదాంకిత కృష్ణా పతితపావనా కృష్ణా 

ముక్తివితరణశుభశీలా కృష్ణా భూభారాంతక కృష్ణా 



3, జూన్ 2025, మంగళవారం

జానకిమగడు


మాటలలోన చేతలలోన 

    సాటిలేని వాడు మా జానకిమగడు

ధాటిగ నసురకోటిని దునిమే 

    సూటిబాణాల మా జానకిమగడు


పూవింటివాడు నివ్వెర

    పోవు నంత సౌందర్యము

యీవి జూడ ముక్తినే 

    యిచ్చుచుండు నౌదార్యము

ఠీవి జూడ మహావిష్ణు

    దేవున కది సరిసమము

భావింపగ తనకు సాటి 

    వాడు లేనే లేడు నిజము


మాట యిచ్చెనేని దాని 

    దాటకుండు తన సత్యము

ఓటమియే లేని విజయ

    దాటిగల ప్రతాపము

నేటికి యేనాటికిని అ

    నింద్యమైన మహాయశము

సాటిలేని రాముని ప్రభ 

    సర్వసుజన సంపూజ్యము