22, జూన్ 2025, ఆదివారం

నీనామ మున్నది

శ్రీరామ నీనామ మున్నది మము
తీరము చేర్చుచు నున్నది

శ్రీరామ యనగానే చిదిమి పాపము లెల్ల
ధారాళముగ కృపాధారలు కురిపించి
గోరంతపుణ్యాల కొండంతలుగ జేసి
ధీరులముగ జేసి దీవించుచున్నది

తిలకించ భవవార్ధి మొలబంటి లోతే
వలదింక భయమని వారించుచున్నది
సులువుగ తొల్లిటి సుస్థితి సమకూర్చి
నిలుపుచున్నది దేవ నీమ్రోలసర్వేశ

శ్రీరామ గుణధామ కారుణ్య నిలయ సం
సార సముద్రంపు తీర మింకొక రీతి
చేరగలిగిన వారు లేరయ్య సృష్టిని
నారాయణా జగన్నాథ నిక్కువ మిది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.