25, డిసెంబర్ 2024, బుధవారం

మనవులు వినవేలరా

 

మనవులు వినవేలరా యినకులతిలకా నీ
మనిషిని నే కానటరా యినకులతిలకా

జనపతి దశరథుని కొడుక యినకులతిలకా నీవు
ఘనుడవు నారాయణుడ వినకులతిలకా
జనకసుతను చేబట్టిన యినకులతిలకా నీవు
వనముల నొక మిష జొచ్చినా వినకులతిలకా

మునిలోకమునకు నీ వినకులతిలకా గొప్ప
ధనముగా దొరికితివో యినకులతిలకా
దనుజలోకమునకు నీ వినకులతిలకా లోక
హననకాల రుద్రుడవే యినకులతిలకా

వనధి దాటి లంక జేరి యినకులతిలకా నీవు
దునిమినావు దశకంథరు నినకులతిలకా
మనసార రామా యన్న నినకులతిలకా నీవు
కనికరమున కాచుచుందు వినకులతిలకా


23, డిసెంబర్ 2024, సోమవారం

హరేరామ హరేరామ


హరేరామ హరేరామ రామరామ హరేహరే

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే


వామన గోవింద వాసుదేవా హరే

కామితవరవితరణ కంజలోచన హరే

శ్రీమానినీప్రియ భీమవిక్రమ హరే

శ్యామలాంగా దైత్యసంహారకా హరే


గోవర్ధనోధ్దార గోవింద హరే హరే

భావజమదసంహారభావిత శ్రీహరే

దేవదేవ సురగణసేవిత హరే హరే

జీవలోకశరణ్య క్షేమకృత్ శ్రీహరే


17, డిసెంబర్ 2024, మంగళవారం

హరహర యంటే నేమిరా


హరహర యంటే నేమిరా
హరిహరి యంటే నేమిరా
అరయగ బేధము లేదురా
ఇరువురు నొకటే చూడరా

నీలకంఠుడై నీవు తలచితే
కైలాసంబున కనబడురా
నీలవర్ణుడని నీవనుకొంటే
ఆలో వైకుంఠాధిపుడౌ

కామవైరియై రామ రామ యని
నామము చేసే స్వామియే
కామజనకుడై కడు భక్తిగ శివ
నామ జపమునే నడపేరా

హరోం హరా యని యరచి పిలచినా
హరే రామ యన నొకటేరా
పరాత్పరుని యెడ భక్తిని జూపుచు
తరించిపోయెడు దారులవే


10, డిసెంబర్ 2024, మంగళవారం

సంగరంబున రామచంద్రుడు

 

సంగరంబున రామచంద్రుడు విజయంబు 

    సాధించినాడిదే చూడండి

అంగనామణిసీత కారావణుని చెఱయు 

    నంతమైనది నేడు చూడండి


వచ్చి సమవర్తి పౌలస్త్యుని జీవుని 

    బంధించి కొనిపోయె చూడండి    

వచ్చి మన శ్రీరామచంద్రుని పొగడిరా 

    బ్రహ్మాదిదేవతలు చూడండి


రావణునికై దొమ్మిచేసి మన్నైనట్టి 

    రాకాసి మూకలను చూడండి

శ్రీవిభునికై యని చేసిన కపులెల్ల 

    జీవించియున్నారు చూడండి


తలబాదుకొనుచు మందోదరి పొలికలని 

    దారిబట్టుట గూడ చూడండి

కలికిసీతమ్మ సింగారించుకొని యిదే 

    కదలె రాముని కడకు చూడండి


9, డిసెంబర్ 2024, సోమవారం

నేనెంత పొగడ నేర్తురా


నేనెంత పొగడ నేర్తురా

నీనామ దివ్యమహిమను


ఎంతో పొంగి పొగడనా సంతోషముగ నామ

చింతనతో తాపత్రయ మంతరించగ

చింతలన్ని యణగారుట చిత్రమేమియు గాదు

అంతరించ తాపంబులు చింతలణగవా


ఎంతగ నిను పొగడినను యీవెఱ్ఱి మనసునకు

సుంతైనను తృప్తిగాదు జూడవయ్య

చింతితార్ధప్రద యయ్యది చిత్రమేమియు గాదు

వంతులుగా పొగడుచు దేవతలు తనిసిరా


శ్రీరామ పొగడలేడు శేషుడంత వాడే

వారిజాక్షపొగడలేడు బ్రహ్మయైనను

చేరి శివుడు పొగడు నది చిత్రమేమియు గాదు

మీరిరువురు గన నొక్కటి కారా యేమి



తెలిసీతెలియక


తెలిసీతెలియక దేవతలను నే 

    కొలిచితినయ్యా కొందరిని

తెలియనైతి శ్రీరఘురామా నీ

    దివ్యతత్త్వమును నేనపుడు


దేవతలిచ్చెడు సిరిసంపదలను 

    తినితిని మిక్కిలి సోమరినై

భూవలయంబున నిక్కుచు తిరుగుచు 

    పొందితి సుఖములు కొన్నిటిని

కోవెలలోపల కొలువైన నిను 

    కొలువగ నెన్నడు రానైతి

దేవదేవ సమవర్తికి చిక్కితి 

     తిప్పలుబడితిని మిక్కిలిగ


కాలక్రమమున నొక జన్మంబున 

    కాశిని దేహము విడచితిని

కాలకంఠుడు మంత్రము చెవిలో 

    కమ్మగ నుపదేశించగను

మేలగు భవతారకమంత్రముచే 

    మెఱసె నాత్మలో సద్భక్తి

ఈలాలగున నీనామము విడువని 

    యీదేహములో చేరితిని


వదలను భవతారకమంత్రంబును 

    వదలను నీపద యుగ్మమును

ముదమున నీశుభతత్త్వము నెఱిగితి 

    మోక్షార్హుడనే నైతినయా

వదలను నిన్ను వదలను నిన్ను

    వదలను నిన్నని యనవయ్యా

ఇది కడజన్మం బిది కడజన్మం 

    బిది కడజన్మం బనవయ్యా


చక్కగ దయజూపే సాకేత రామా


చక్కగ దయజూపే సాకేత రామా

నిక్కంబుగ చాలును నీనామమె మాకు


తక్కిన దేవతల నెపుడు తలపనట్టి వారము

నిక్కు నరాథముల కెపుడు మ్రొక్కనట్టి వారము

చక్కగ నీనామ జపము చేయునట్టివారము

మిక్కిలి భక్తులము నీకు చక్కనయ్యా


ఎక్కడెక్కడి సంపద లాశించనట్టి వారము

చిక్కుపడిన తనువులపై చింతలేని వారము

ప్రక్కదారిపట్టక నిను భజనచేయు వారము

స్రుక్కము యమునకును మేమొక్కనాడును


దిక్కు నీనామమనుచు తెలిసినట్టి వారము

మక్కువతో నీపదముల మసలునట్టి వారము

ఎక్కడిదిక పాపమనుచు నెంచునట్టి వారము

చిక్కెనిదే మోక్షమనుచు నిక్కు వారము



7, డిసెంబర్ 2024, శనివారం

ఇటుప్రక్కన


కం. ఇటుప్రక్కన భూసుతయును

నటుప్రక్కన లక్షణుండు నమరగ రామా

యిట దాసుండని హనుమగ

నిటలాక్షుడు చేరె పాదనీరేజములన్




కాదనవని లేదనవని


కం. కాదనవని లేదనవని 
శ్రీదయితా నిన్ను నేను చేరి యడుగగా
మోదముతో నామోక్షము  
నే దయతో యిత్తు నంటివే రామయ్యా



నా దైవమ నా భాగ్యమ


కం. నా దైవమ నా భాగ్యమ

నీ దయనే నమ్మి నేను నిలచితి నయ్యా 

వేదన లణగించపయా

కాదని కో రామచంద్ర కరుణాజలధీ



నిను శంకించెడు వారును


కం. నిను శంకించెడు వారును

పనిబడి యర్చించు వారు బహుదీనాత్ముల్

కనుగొన జ్ఞానులు నందరు

వినుతదయాశీల నీకు ప్రియులే రామా



నరనాయక సురనాయక

 

కం. నరనాయక సురనాయక

కరుణామయ రామచంద్ర కమలదళాక్షా

వరదాయక శుభదాయక

పరిపాలయ మా మశేషపాపవిదారా


5, డిసెంబర్ 2024, గురువారం

శ్రీరామనామము కన్న మధురము

 

శ్రీరామనామము కన్న మధురము

    వేరొక్క టెందును లేదయ్యా

శ్రీరామచంద్రుని కన్న దైవము 

    వేరొక్క డెవ్వడు లేడయ్యా 


రామనామమును పలికెడు వారికి

    రాదిక జన్మము నిజమయ్యా 

రామచరితమును నుడివెడు వారికి 

    రాదిక జన్మము నిజమయ్యా

రాముని కీర్తన చేసెడు వారికి

    రాదిక జన్మము నిజమయ్యా

రాముని కీర్తిని చాటెడు వారికి

    రాదిక జన్మము నిజమయ్యా


రాముని సేవను మరువని వారికి

    రాదిక జన్మము నిజమయ్యా

రాముని మనసున నిలిపిన వారికి

    రాదిక జన్మము నిజమయ్యా

రామభక్తులై మనియెడు వారికి

    రాదిక జన్మము నిజమయ్యా

రామున కన్యము నెరుగని వారికి

    రాదిక జన్మము నిజమయ్యా


రాముడు నారాయణుడని తెలిసిన 

    రాదిక జన్మము నిజమయ్యా

రాముడు విశ్వాత్మకుడని తెలిసిన 

    రాదిక జన్మము నిజమయ్యా

రామమయం బీజగమని తెలిసిన

    రాదిక జన్మము నిజమయ్యా

రాముని బంటుగ చరియించినచో

    రాదిక జన్మము నిజమయ్యా


చాలదా శ్రీరామచంద్ర యనే నామము


చాలదా శ్రీరామచంద్ర యనే నామము

చాలదా యీజన్మకు చక్కని హరినామము


చాలదా బ్రహ్మాదులు చాలపొగడు నామము

చాలదా సర్వలోకసన్నుతుని నామము

చాలదా సర్వేశుని సకలశుభద నామము

చాలదా జననమరణచక్రాంతకు నామము


చాలదా మనసు నెపుడు చల్లబరచు మంత్రము

చాలదా సర్వలోకశాంతి గూర్చు మంత్రము

చాలదా దీనికన్న చక్కనైన దేమంత్రము

చాలదా యిదిచాలని జనున కేది చాలును


సన్మంత్రము దీనికన్న జగము నందు లేదు

సన్మార్గము రామమంత్ర జపమేనని తెలియుడు

జన్మమెత్తినందుల కిది చాలునని పలుకుడు

తన్మయులై పలికి భవతరణమునే చేయుడు




3, డిసెంబర్ 2024, మంగళవారం

వగచెద నెంతో వగచెద


వగచెద నెంతో వగచెద కాని

    ఫలితమేమియును లేదు కదా

వగచుట కంటెను ముదిమి ప్రాయమున

    మిగిలిన దేమియు లేదుకదా


లక్ష్యముచేయక పెద్దల నుడు లప

    రాధినైతినని వగచెదను

భక్ష్యాభక్ష్యవివేకము నెఱుగక

    భక్షించితినని వగచెదను

సాక్ష్యమెవ్వడని పలికిన వేల య

    సత్యము లెన్నుచు వగచెదను

సాక్ష్యమైన నాయాత్మసాక్షిని

    చక్కగ దలచుచు వగచెదను


ధనమే సర్వస్వంబని తలచెడు

    చెనటినైతినని వగచెదను

తనవారని పగవారని తలచుచు

    ధర్మమెన్ననని వగచెదను

వనితావ్యామోహంబున జిక్కుట

    వలన చెడితినని వగచెదను

తను విది శాశ్వత మన్న విధంబున

     తలచి చెడితినని వగచెదను


చేయరాని పను లెన్నియొ పొగరున

    చేసియుంటినని వగచెదను

మాయలుచేసెడు కలికి లోబడుచు

    మంచినెఱుగనని వగచెదను

చేయిదాటిపోయినది కాల మిక

    చేయున దేమని వగచెదను

ప్రాయము నందున రామనామమును

    చేయనైతినని వగచెదను



నావంటి వానిపైన


నావంటి వానిపైన నీవు దయ చూపుదువని

భావించెడు నంత వెఱ్ఱివాడను కాను


సదాచారమేమి లేదు చట్టుబండయును లేదు

ముదమున నీపూజచేయు ముచ్చటలేదు

కదిలి నీగుడికి వచ్చి ఘడియ యుండుట లేదు

వదలక నీనామమైన పలుకుట లేదు


నీభక్తులసావాసము నేను చేయుట యేడ

శోభనాకార భక్తి సుంతయు లేదు

వైభవముగ నీకు భజన నేనుచేయుట యేడ

నీభజనలు జరుగుచోట నిలుచుట లేదు


ఏముఖమునుపెట్టుకొని యిపుడు నీదయవేడుదు

నీమంచితనము మీద నెపముంచుదును

రామచంద్ర నాకు మంచి లక్షణ మొక్కటి లేదు

ఏమో నాదురాశతప్ప యేమియు లేదు


2, డిసెంబర్ 2024, సోమవారం

ఏల నితరము లందు మేలెంచుట


ఏల నితరము లందు మేలెంచుట

మేలెంచి భంగపడి జాలొందుట


శ్రీరామచంద్రుని నామంబునే గాక  

    జిహ్వ కన్యము పల్క నేల

శ్రీరామచంద్రుని రూపంబునే గాక 

    ప్రీతి నక్షుల జూడ నేల

శ్రీరామచంద్రుని పూజించనే గాక 

    చేతు లీరెండు మన కేల

శ్రీరామచంద్రుని పాదంబులకు గాక 

    శిరసు వంచగ నెంచ నేల


శ్రీరామచంద్రుని సంకీర్తనము గాక 

    చెవిబెట్ట నుంకించ నేల

శ్రీరామచంద్రుని చరితంబునే గాక 

    యారాటముగ చదువ నేల

శ్రీరామచంద్రుని భక్తకోటిని గాక 

    చేరి యన్యుల గొల్వ నేల

శ్రీరామచంద్రుని యశము జాటగ గాక 

    క్షితిపైన నుండగా నేల


శ్రీరామచంద్రుని క్షేత్రంబులను గాక 

    చేరగా కోరగా నేల

శ్రీరామచంద్రుని సేవించనే గాక 

    జీవితం బిది యుండ నేల

శ్రీరామచంద్రుని దివ్యతత్త్వము గాక 

    చిత్తంబు చింతించ నేల

శ్రీరామచంద్రుని చేరుకొనుటయె గాక 

    వేరొండు యాశ లింకేల