ఈమధ్యన నేను ఎక్కువగా వ్రాయటం లేదు.
కారణం నాకు కూడా స్పష్టంగా తెలియదు.
నాకు ముఖ్యవ్యాపకం రాములవారి గురించి సంకీర్తనం చేయటం. అది తెలుగుబ్లాగులోకంలో అందరికీ తెలిసిన సంగతే కాబట్టి దాని గురించి విస్తరించి చెప్పనవసరం లేదనుకుంటాను.
ఒక్కొక్కసారి ఒకే రోజున ఏకంగా అరడజను దాకా రామకీర్తనలు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఐతే ఒకటి రెండు వస్తే గొప్పవిషయం.
ఒక్కొక్కసారి రోజుల తరబడి ఒక్క కీర్తన కూడా ఊడిపడదు.
ఈవిషయంలో నాప్రమేయం ఆట్టే లేదు. అయన స్ఫురింపజేయకుండా నేను స్వకపోలకల్పనగా వ్రాసేదీ వ్రాయగలిగినదీ ఏమీ ఉండదు.
ఈస్ఫురణ కలగటం అన్నదానికి వేళాపాళా ఏమీ ఉండదు. అది ఏదైనా ప్రయాణసమయంలో కావచ్చును, భోజనసమయంలో కావచ్చును. తరచుగా నేను నిద్రపోతుండగా కూడా ఇలా కీర్తన స్ఫురించి లేచి వ్రాయటం కద్దు.
రామనామం మాత్రం నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది.
ఏకీర్తనా స్ఫురించక, వ్రాయలేకపోవటం విచారం కలిగిస్తుంది. కాని నేను చేయగలిగినది ఏమీ లేదు. ఆవిచారంలో ఒక్కొక్క సారి ఎన్నో రోజులూ వారాలూ కూడా గడచిపోతూ ఉంటాయి. ఈసారి జనవరి 15నుండీ నేటి వరకూ విరామం వచ్చింది. మళ్ళీ ఈరోజున ఒక కీర్తన వెలువడింది. జనవరి నెలలో కేవలం అరడజను కీర్తనలే వెలువడ్డాయి.
రాములవారి మీద కీర్తనలేనా, ఇంకా ఏమన్నా వ్రాయవచ్చును కదా అనవచ్చును. కాని నాకుఇతరవిషయాల మీద అభిరుచి అట్టే లేదు. అందుచేత ఇతరాలు వ్రాయటం మీద అసక్తి కలగటం లేదు.
ఒకప్పుడు పద్యకవిత్వం వ్రాయటం మీద ఆసక్తి ఉండేది. కానీ ఆ ఆసక్తి కూడా తగ్గింది కాబట్టి అవీ వ్రాయటం లేదు కొన్నేళ్ళుగా.
ఒకప్పుడు మాలికలో నాటపాలే కాక నా వ్యాఖ్యలు కూడా తరచుగానే వచ్చేవి. కాని ప్రస్తుతం ఇతరవిషయాలను చదవటం పైన కూడా అసక్తి తక్కువగా ఉండబట్టి నా వ్యాఖ్యలూ తగ్గాయి.
ఈవిధంగా తెలుగుబ్లాగుల్లో నేను కనిపించటం బాగా తగ్గింది.
వృధ్ధాప్యం అనేది ఒకటి ముదురుతున్నది కదా. అందుచేత మనస్సులో ఆశ ఉత్సాహం ఉన్నా సరే శరీరం అంత సుముఖంగా స్పందించక ఎక్కువగా ఏదీ వ్రాయలేకపోవటం కూడా జరుగుతున్నదేమో.
నేనిలా నిర్లిప్తంగా ఉండటం గమనికకు వచ్చి ఇంచుమించు నెలరోజుల క్రిందట మిత్రులు
కష్టేఫలీ బ్లాగు శర్మ గారు వాట్సాప్ ద్వారా పలకరించారు ఎలా ఉన్నానా అని.
నేను కుశలం గానే ఉన్నాను, సకుటుంబంగా కుశలంగానే ఉన్నాను. మొన్న' రిపబ్లిక్ డే' నాడు మేమిద్దరమూ వెళ్ళి కోవిషీల్డ్ బూష్టర్ డోస్ వాక్సీన్ వేయించుకొని వచ్చాం. ఏమీ సైడ్ ఎఫెక్ట్ రాలేదు మాయిద్దరికీ.
వ్రాస్తూనే ఉండాలని ఉంది. పరాత్పరుడు వ్రాయిస్తే తప్పక వ్రాస్తాను.
నా వ్రాతలు చదివే వారికీ చదువని వారికీ కూడా, తెలుగుబ్లాగర్లూ, తెలుగుబ్లాగు చదువరులూ అందరికీ నా శుభకామనలు.