31, ఆగస్టు 2018, శుక్రవారం

ఎందుకు హరిని మీ రెఱుగరయా


ఎందుకు హరిని మీ రెఱుగరయా వా
డందరి వాడాయె నెందైన కలడాయె

తొందరించ కామాది దుర్వృత్తులు మీ
రందరు తోచినట్లాడుచును
కొందలమందుచు కుమిలేరు గాక గో
విందుని మనసార వేడరు వేడరు

ఇందిరాపతిదయ యించుక కలుగక
ముందువెనుకల శుభముండేనా
చిందులు వేయించు చిక్కులి తీర్చు గో
విందుని మనసార వేడరు వేడరు

ఎందును సుఖములే దీశ్వరు హృదయార
విందములందు గాంచి వేడక వా
డందగాడు రాముడు నల్లరి కృష్ణుడు గో
విందుడు చెంతనుండ వేడరు వేడరు

దాశరథీ మంచివరము దయచేయవే


కౌశికమునివరఛాత్రా కౌసల్యా వరపుత్రా
దాశరథీ మంచివరము దయచేయవే నాకు

రాశులు కాలేదు ధనము రామచంద్ర యేనాటికి
రాశులాయె పాపములు రామరామ నానాటికి
దేశమున పలుచనైతి దీనుడనై నిను జేరితి
ఆశాపాశములు ద్రెంచు నట్టి మంచి వర మీవే

ఏమి కామ మేమి మోహ మేమి క్రోధ మేమి మద
మేమి లోభ మేమి మత్సర మెట్లు వీటి పై గెలుపు
తామసుడ నైతి నన్ను దయజూడుము రామచంద్ర
సామాన్యుడ వీటి నణచ జాలు మంచి వర మీవే

నరజన్మము దుర్లభమని నమ్మి నేను నరుడనైతి
కరమరుదాయె సుఖము పరమార్థము కనరాదు
పరమదీనుడ నైతి కరుణించుము రామచంద్ర
మరల పుట్టుకే లేని మంచి వరము నీయవే


29, ఆగస్టు 2018, బుధవారం

సుందరక్క

"అవును కానీ అమ్మా నాకీ పాత చింతకాయ పచ్చడి పేరు పెట్టారేమిటే" అంది నా కూతురు ఫోనులోనే చిరాకుపడుతూ.

వెంటనే సుందరక్క గుర్తుకు వచ్చింది.

సుందరక్క ఎప్పుడు గుర్తుకు వచ్చినా సరే మనసంతా చేదు తిన్నట్లుగా ఐపోతుంది.

సుందరక్క పుట్టుక ఒక విశేషం.

సుందరక్క బాల్యం ఒక విశేషం.

సుందరక్క పెళ్ళి ఒక విశేషం.

సుందరక్క వెళ్ళిపోవటం ఒక విశేషం.

అసలు సుందరక్కే ఒక పెద్ద విశేషం.

ఇంక పిల్లలు పుట్టరని నిరాశచేసుకున్న తల్లికి ముట్లుడిగిపోతున్న తరుణంలో కడుపున పడిందిట సుందరక్క. ఆ మాట తనతల్లే ఎన్నో మార్లు తనతో అనేదని సుందరక్కే చెప్పింది. ఆ సుందరక్కను ఆమె తల్లీ తండ్రీ కాలు క్రింద పెట్టనివ్వకుండా నెత్తిన పెట్టుకొని పెంచారు. అందుచేత తన చిన్నప్పుడు తనంత పెంకిపిల్ల ఊరుమొత్తంలో మరెవర్తీ లేదటని సుందరక్కే నవ్వుతూ ఒకటి రెండుసార్లు చెప్పింది. అత్యంత సౌమ్యురాలైన సుందరక్కేమిటీ పెంకిపిల్ల యేమిటీ అని తనకు అప్పట్లో భలే ఆశ్చర్యంగా అనిపించింది.

పాపం సుందరక్క పమిటవేయటం మొదలెట్టిన కొత్తలోనే మేనమామ గారింట చేరవలసి వచ్చింది అనాధగా. ఆ మేనమామ గారంటే ఆయనా వరసకు మాకు పెదనాన్న గారేను.

అలా వచ్చి సుందరక్క మావూరి బళ్ళో ఎనిమిదిలో చేరింది.

అప్పుడు నేనేమో ఇంకా రెండో తరగతేను.

సుందరక్క వీలున్నప్పుడల్లా మాయింటికి వస్తూ పోతూ ఉండేది.

నేను మూడులో ఉండగా కాబోలు పక్కింటి యతిరాజ్యం పెళ్ళి జరిగింది. ఆపిల్ల ఎందుకనో మాయింటికి వచ్చి చాలాసేపు ఏడ్చి వెళ్ళింది. తనకు ఆ పెళ్ళి వద్దట. ఏమో మరి ఎందుకో నాకేం తెలుసునూ. అమ్మేమో నన్ను "బయటకు పోయి ఆడుకోవే" అని కసిరి పంపేసిందాయిరి. అప్పుడు సుందరక్క మా యింట్లోనే ఉంది.

సుందరక్క బాగా పాడుతుంది.

ఎప్పుడన్నా హాయిగా పాడుకోవాలనిపిస్తే మా యింటికి వచ్చి బోలెడు పాటలు పాడేది. మా అమ్మకి తన పాటలంటే ఎంతిష్టమో. నాకైతే ఇంకా యిష్టం. ఎందుకంటే నాక్కూడా చిన్నచిన్న పాటలు నేర్పేది కదా మరి.

యతిరాజ్యం వాళ్ళింటి ముందు పెద్దపందిరి వేసారు. అక్క నడిగితే "యతిరాజ్యం పెళ్ళికదా పందిరెయ్యరా" అంది. పెళ్ళంటే అదో పెద్ద పండగనీ యింటి ముందు పందిరేస్తారనీ అర్థమైంది. అసలు పెళ్ళంటే ఏమిటీ అని సందేహం వచ్చింది.

ఆ సందేహం సుందరక్కనే అడిగాను వెంటనే.

అక్క యిచ్చిన జవాబును జన్మజన్మాలకీ మర్చిపోలేను.

"ఆడదానికి పెళ్ళంటే ఒకనరకం నుండి మరొకనరకానికి వెళ్ళటం" అంది.

నాకైతే చచ్చే భయం వేసింది.

"నేను చచ్చినా పెళ్ళిచేసుకోను" అని సుందరక్క దగ్గర శపథం చేసేసాను.

"అంతా నీ చేతులో ఉందటే" అని సుందరక్క నవ్వింది.

ఎందుకో ఆనవ్వు నచ్చలేదు.

ఎందుకుండదూ అని ఉక్రోషం వచ్చిందంతే.

కొన్నేళ్ళయ్యాక సుందరక్కకి పెళ్ళిచూపులయ్యాయి.

అప్పటికి నేనూ కాస్త పెద్దదాన్నయ్యానేమో ఆరిందాలా ఆ పెళ్ళిచూపుల విశేషం చూడ్డానికి నేనూ వెళ్ళాను.

తనకన్నా పది పదిహేనేళ్ళు పెద్ద ఆ పెళ్ళికొడుకు. సుందరక్క ఒప్పుకోదని అనుకున్నాను కాని ఆ పెళ్ళి జరగనే జరిగింది.

"అమ్మా ఏమిటే ఈ అన్యాయం" అన్నాను పెళ్ళికి అమ్మతో కలిసివెడుతూ.

"దాని ప్రాప్తం అలా ఉందే, ఏంచేస్తాం చెప్పు? తల్లీదండ్రీ లేనిపిల్ల. మీ పెదనాన్నదా అంతంత మాత్రం సంసారం. తనకే మరో ఇద్దరాడపిల్లలాయె. పాపం సుందే సర్దుకుపోతోంది. బంగారం లాంటి పిల్ల పాపం" అంది అమ్మ బాధపడుతూ.

సుందరక్క పెళ్ళైన తరువాత సంవత్సరం కాబోలు అత్తారింటి నుండి వచ్చింది. ఉన్న నెల్లాళ్ళలోనూ మాయింటికి మూడు నాలుగు సార్లు వచ్చింది.

అప్పుడు ఒకసారి నేను తెలిసీ తెలియక అన్న ఒక్క ముక్క ఇప్పటికీ నన్ను బాధిస్తూ ఉంటుంది.

"బాగున్నావా సుందరక్కా, అత్తారింట్లో ఐనా సుఖంగా ఉన్నావా" అన్నాను.

"ఆడబతుక్కి సుఖం అన్నది మూడో యింటికి వెళ్ళాకనే లేవే" అంది.

అముక్క నాకు అర్థం కాలేదు ఎంత తన్నుకున్నా.

కాని సుందరక్క ముఖంలో ఉన్న ఉదాసీనతను చూసి "ఆ మాటకి అర్థం ఏమిటీ" అని అడిగే ధైర్యం లేకపోయింది నాకు.

సుందరక్క తిరిగివెళ్ళిపోయాక మళ్ళా ఆమె తిరిగి ఎన్నడూ రాలేదు.

ఓ ఏడాది పోయాక కాబోలు సుందరక్కను గురించిన వర్తమానం ఐతే వచ్చింది.

కాని అది ఎంత చెడ్డ వర్తమానం!

ఇంక సుందరక్కే లేదు.

ఒకరోజు ఏదో పాత సిసిమా వస్తుంటే టీవీలో చూస్తున్నాను.

ఇల్లు యి ల్లనియేవు ఇల్లు నా దనియేవు
నీ యిల్లు యెక్కడే చిలకా
ఊరికీ ఉత్తరాన వలకాటి పురములో
కట్టె యిల్లున్నదే చిలకా

అని ఆ సిసిమా మధ్యలో ఒక పాట వచ్చింది.

ఎందుకో ఆ పాట విన్నాక మమసులో ఎంతో ఆందోళన కలిగింది.

ఆరోజున స్ఫురించింది మూడో యిల్లు అంటే ఏమిటో!

"సుందరక్కా మూడో యింటికి వెళ్ళిపోయావా" అని తలచి తలచి బాగా రోదించాను.

కాని నా సుందరక్క నా నుండి ఎంత దూరంగా పోగలదూ?

నాకూతురికి బాలాత్రిపురసుందరి అన్న పేరు పెట్టుకొన్నప్పుడు అమ్మ కళ్ళొత్తుకుంది.

ఆ పేరు మీద చాలా యుధ్ధమే జరిగింది నాకూ మా ఆయనకూ.

అయన తప్పేం లేదు పాపం.

కొడుకు పుడితే ఏం పేరు పెట్టాలీ, గ్రహపాటున కూతురు పుడితే ఏం పేరు పెట్టాలీ అని ఆయన చాలానే కసరత్తు చేసారు.

ఫైనల్ లిష్టులో అరడజను అబ్బాయిల పేర్లూ మరొక అరడజను అమ్మాయిల పేర్లూ తేలాయి. వాటిలో నుండి మా కుటుంబసభ్యులందరూ కలిసి పాల్గొనే ఎన్నికల్లో చెరొక పేరూ తేలాలి అని నిర్ణయం కూడా జరిగింది.

ఎందుకిందంతా చెబుతున్నానూ అంటే ఆ ఫైనల్ పట్టీ తయారు చేయటంలో నేనూ ఉత్సాహంగానే పాల్గొన్నాను కాబట్టే.

కానీ పుట్టిన ఆ పిల్ల కాస్తా ఆ పట్టీలు రెండింటినీ త్రోసిరాజంది మరి, ఏం చేసేది చెప్పండి?

ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక అత్తయ్య గారితో చెప్పాను.

"మీ మొగుడూ పెళ్ళాల యిష్టమమ్మా. అమ్మవారి పేరు వధ్దనవచ్చునా తప్పుకాదూ? వాడికీ నచ్చితే అలాగేను. నిజానికి మా అత్తగారు మహాలక్ష్మమ్మ గారి పేరు పెట్టమని అడుగుదా మనుకున్నాను. అమ్మవారి పేరు ఏది పెడితేనేమీ. మీ యిద్దరూ ఆలోచించుకొని చేయండి" అంది ఆవిడ.

ఆయనా, మా మరిదులిద్దరూ పడీపడీ నవ్వారు.

"అంత పాచ్చింతకాయపచ్చడి పేరేమి" టొదినా అన్నాడు చిన్నమరిది.

ఆయనకైతే అలక వచ్చేసింది.

కాని చివరికి నా పంతమే నెగ్గింది.

అత్తయ్యగారి సపోర్టుతో నేను గెలిచానని మా మరుదు లనుకున్నారు కాని అది నిజం కాదు. ఆయనకూ చివరికి సమ్మతం ఐనది కాబట్టే బాలాత్రిపురసుందరి మళ్ళా మా యింట వెలిసింది.

ఇదంతా ఒకప్పుడు మా ఆయనకు చెప్పిన కథే.

ఈ రోజున మా అమ్మాయికి చెప్పాను.

"ఓ. మీ అక్క పేరు పెట్టుకున్నావన్న మాట నాకు" అంది అమ్మాయి.

"కాదు సుందరక్కా, నువ్వు నా కడుపున పుట్టబట్టే మళ్ళా నీకు ఆపేరే పెట్టాను" అన్నాను కొంచెం పూడుకుంటున్న గొంతుతో,

"ఊరుకో అమ్మా. అవేం మాటలూ. నేనేమిటీ మీ సుందరక్క నేమిటీ నాన్సెన్స్" అందమ్మాయి.

నేనూ మా సుందరక్కా కలిసి దిగిన ఫోటో అంటూ ఒక్కటైనా లేదు. దానికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలీ?

12, ఆగస్టు 2018, ఆదివారం

పంపకం


అప్పట్లో,  పెద్దబ్బాయీ చిన్నబ్బాయీ కూడా అమెరికా చెక్కేసే సరికి, రాఘవయ్య గారికి పిచ్చెక్కినట్లయింది.

అక్కడికీ చిన్నబ్బాయి విమానాశ్రయానికి పరిగెత్తే హడావుడిలో ఉండగా ఉండబట్ట లేక ఒక ముక్క అననే అన్నారు. "ఒరే చిన్నాడా, ఈ తోటలూ పొలాలూ, ఈ రెండిళ్ళూ అన్నీ ఇంకెవరికోసంరా? నువ్వూ అన్నా కూడా మమ్మల్ని విడిచి ఎగిరిపోతుంటే" అని.

చిన్నోడు పెద్దాడిలా గుంభన మనిషి కాదు. నోటికేదొస్తే అదే అనేస్తాడు. "మరేం జెయ్యమన్నావూ? ఇంత చదువూ చదివి ఇక్కడ ఎడ్లను తోలుకుంటూ వ్యవసాయం చేయమన్నావా?" అని దులిపినట్లుగా ఒక్క ముక్క అనేసి చక్కా పోయాడు.

ఆరాత్రి మాత్రం పెద్దాడు ఫోన్ చేసాడు గొప్పగా ఓదారుస్తూ, "నువ్వేం  బెంగెట్టుకోకు నాన్నా, వస్తూపోతూనే ఉంటాంగా? అమ్మను చూడు ఎంత ధైర్యంగా ఉందో" అని గొప్ప మాటన్నాడు.

అసలు ఆ రాజ్యలక్ష్మమ్మగారు ఎంత బెంగపడుతున్నదీ ఎంత నిరాశపడుతున్నదీ ఈ కుర్రకుంకలిద్దరికీ ఏం తెలుస్తున్నదీ అని రాఘవయ్యగారు నిర్వేదం చెందాడు. తనకైతే ఏదో వ్యవసాయం పనులూ గట్రా ఉంటాయి. ఇంటికే పరిమితం ఐన తన ఇల్లాలు ఒక్కర్తీ కూర్చుని ఈ పిల్లాళ్ళ కోసం ఎలా అంగలారుస్తున్నదీ వీళ్ళకి తెలియటం లేదే అని బాధపడ్డారు.

ఇంక ఇంట్లో మిగిలినది ముసలాళ్ళం ఇద్దరమే అనుకొని ఆయనకు క్రమంగా ఏపని మీదకూ ఆసక్తి కలగటం మానేసింది.

అదీ కాక చిన్నబ్బాయి విమానం ఎక్కివెళ్ళిపోయన ఆర్నెల్లకు పిల్లలమీద బెంగతో రాజ్యలక్ష్మమ్మ మంచం ఎక్కింది.

ఓ ఆర్నెల్లపాటు వైద్యం నడిచింది.

కోలుకుంటున్నట్లే ఉండటం మళ్ళా జబ్బు తిరగబెట్టటమూ జరిగింది.

బాగా ఆలోచించి పొలాలూ తోటలూ కౌళ్ళ కిచ్చి రాఘవయ్యగారూ ఇంటిపట్టునే ఉండసాగారు.

అయన ఉపచారాల పుణ్యమా అనో వైద్యం గొప్పదనమనో చెప్పలేం కాని రాజ్యలక్ష్మమ్మ మరొక ఆర్నెల్ల తరువాత లేచి తిరగటం మొదలు పెట్టింది.

కాని మునుపటి ఉత్సాహం లేదు.

బాగా ఆలోచించి పెద్దాడికి ఫోన్ చేసారు రాఘవయ్య గారు.

కోడలు ఎత్తింది ఫోన్. పుత్రరత్నంగారు ఎక్కడికో కేంపుకు వెళ్ళారట. వచ్చాక చెబుతాను లెండి. ఐనా ఈ సీజనులో టిక్కెట్లు బాగా ఖరీదు. అదీ కాక పిల్లలకీ వీలు కుదరాలిగా. మెల్లగా వీలుచూసుకొని వస్తాం అని పెట్టేసింది.

ఇక చిన్నాడికీ ఫోన్ చేసి చెప్పారు, ఒకసారి వచ్చె వెళ్ళరా అని. వాడు గయ్యిమన్నాడు. నీకే మన్నా పిచ్చానాన్నా. నేను వచ్చి ఏడాది ఐందో లేదో ఇప్పుడే ఎలా వస్తానూ. మళ్ళీ ఏడాది చూదాంలే అని విసుక్కుని పోను ఠపీ మని పెట్టేసాడు.

కోడలి గొంతులోని నిరాసక్తతా చిన్నకొడుకు నిర్లక్ష్యమూ రాఘవయ్యగారికి విరక్తి కలిగించాయి.

ఇంక ఆయన ఎన్నడూ పిల్లలకు ఫోన్ చేయలేదు.

వాళ్ళు ఊరికే కుశలం కనుక్కుందామని అన్నట్లు అరుదుగా చేసే ఫోనులకు ముక్తసరి సమాధానాలు చెప్పి ఊరకుంటున్నారు.

కాలం ఇలాగే గడిచిపోతుందా? మనం ఇలాగే వెళ్ళిపోతామా అని రాఘవయ్యగారు మథనపడుతూ ఉన్న రోజుల్లో - అంటే చిన్నబ్బాయి కూడా తనకు అమెరికా సిటిజెన్ షిప్ వచ్చేసిందని సంబరపడుతూ ఫోన్ చేసిన మర్నాడు వాళ్ళింటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు.

ఆ పిల్లవాడి పేరు వీరేశం. వీరేశం తండ్రి రాఘవయ్యగారి దగ్గరే పాలేరుగా ఉండే వాడు. వీరేశం అన్నగారు పట్నంలో ఒక స్టీలు దుకాణంలో వాటాదారుగా చేరాడు. తండ్రిని పని మానిపించి తీసుకొని పోయాడు. కొన్నాళ్ళు సమాచారం ఏమీ లేదు రాఘవయ్యగారికి. ఇదిగో ఈమధ్యన ఆ కొట్టు ఎత్తేసి వాటాదారు డబ్బుతో సహా మాయం అయ్యాడట. అప్పులవాళ్ళు మీదకు వస్తే వీరేశం అన్న తట్టుకోలేక ఇంట్లో అందరికీ విషం కలిపి పెట్టేసాడు. అన్నా వదినా పోయారు. హాస్పిటల్లో తండ్రికీ వీరేశానికి బాగయ్యింది. కాని దిగులుతో ఆ తండ్రికాస్తా ఎంతో కాలం బ్రతకలేదు. వీరేశం చేతికి ఒక ఉత్తరమ్ముక్క ఇచ్చి, నేను పోయాక, నువ్వు పోయి రాఘవయ్యగారి పంచన బ్రతుకు అని చెప్పాడు.

ఇదంతా విని రాఘవయ్యగారూ రాజ్యలక్ష్మమ్మగారూ ఎంతో బాధపడ్డారు.

పదేళ్ళ పిల్లాడికి వచ్చిన కష్టానికి చలించిన రాజ్యలక్ష్మమ్మగారు, "ఇంక వీడు నా కొడుకే" అని ప్రకటన చేసేసింది.

రాఘవయ్యగారికి మళ్ళా ఉత్సాహం వచ్చింది.  ఇదిగో ఈ పిల్లాడి చదువుసంద్యలని ఏమి, వాడికి వ్యవసాయం పనులు నేర్పటం అని ఏమి మళ్ళా మునపటి మనిషిలా అవటానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు.

ఉన్నట్లుండి ఒకరోజున పెద్దాడూ చిన్నాడూ కలిసి అదేదో కాల్ చేసారు. సారాంశం ఏమిటంటే చిన్నోడికి అక్కడే మంచి అమ్మాయి దొరికిందట ఆరోజునే పెళ్ళి చేసుకున్నాడట.

రాఘవయ్యగారికి కోపం వచ్చి కేకలు వేసారు ఫోనులోనే.

రాజ్యలక్ష్మిగారు కూడా కొంచెం దుఃఖపడి చివరకు "అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడా" పోనివ్వండి. అసలే ఈ మధ్య మీ ఆరోగ్యం బాగోలేదు అని ఊరడించింది రాఘవయ్యగారిని.

ఆ చిన్నాడి పెళ్ళి అంత ముచ్చటగా దేశాంతరంలో కన్నవారిపరోక్షంలో జరిగిన ఐదేళ్ళకు కాబోలు పెద్దాడి ఇంట్లో ఏదో శుభకార్యం సందర్భంగా అందరూ కలిసి జరుపుకున్న సందడి తాలూకు వీడియో ఒకటి రాఘవయ్యగారికి పంపింది చిన్నకోడలు.

దానితో పాటే ఒక ఉత్తరం. తామంతా ఎన్నో తప్పులు చేసామనీ పెద్దమనసుతో మీరు క్షమించి దీవించాలనీ మీదగ్గరకు అందరం ఒకసారి తొందరలో వద్దామనుకుంటున్నామనీ దాని సారాంశం.

ఆ ఉత్తరం చేరిన నాడో మరునాడో చిన్నాడి నుండి ఫోన్. నాన్నా ఈ నెలాఖరుకు అన్నయ్యా నేనూ కుటుంబాలతో వస్తున్నాం అని.

రాఘవయ్యగారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది.
రాజ్యలక్ష్మమ్మ గారికి ఎంతో ఆనందం కలిగింది.

నెలాఖరు కల్లా ఇల్లంతా పిల్లా మేకాతో కళకళలాడి పోయింది.

చెరొక నెలరోజులూ సెలవులు పెట్టుకొని వచ్చారట. పెద్దకోడలు ఎన్నడూ ఎరుగనంత వినయవంతురా లయింది. కొడుకు లిద్దరూ తండ్రిని అరచేతితో ఆకాశానికి ఎత్తుకొంటూ గౌరవించుతున్నారు.

మనవలకైతే ఈ వాతావరణం అంతా చాలా అబ్బురంగా ఉంది. పెద్దాడి ఇద్దరుపిల్లలకీ తెలుగు అర్థమౌతుంది కాని మాట్లాడలేరు. చిన్నాడి కూతురికి తెలుగు అర్థం కూడా కాదు.

కొడుకులిద్దరూ వీరేశాన్ని గమనించుతూనే ఉన్నారు.

ఇంటిపనులన్నీ వాడే చూసుకొంటూన్నాడు. వ్యవసాయం పనులన్నీ వాడే చక్కబెడుతున్నాడు.  అమ్మేమో నాన్నా వీరేశా అంటుంది.  నాన్నైతే అబ్బిగా అంటాడు.

వీడూ మరీ అన్యాయమే, నాన్నగారూ అంటున్నాడు. ఇదిగో ఈముక్క కంపరంగా తోచింది అన్నదమ్ములిద్దరికీ.

ఓరోజున అమ్మకు హితోపదేశం చేసాడు చిన్నబ్బాయి. అమ్మా పాలేరును పాలేరుగానే చూడాలి కాని వీడికి ఈ చనువేమిటమ్మా అని.

రాజ్యలక్ష్మమ్మగ్సారు చర్రుమంది. ఒరే, మీరిద్దరూ దేశాలట్టుకుపోతే మాకు రెక్కాసరా ఇస్తున్నది వీడేరా - వీరేశాన్ని ఎప్పుడూ పరాయి చేసి ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది.

అరోజు రాత్రే ఆస్తిపంపకాల గురించి తండ్రితో మాట్లాడాడు పెద్దబ్బాయి. ఆలోచించి ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు కాని రాఘవయ్య గారు అలాగే అన్నాడు కాదు.

అక్కడే వింటూనే ఉన్న చిన్నబ్బాయి అందుకున్నాడు. అదికాదు నాన్నా, నువ్వా పెద్దాడివి ఐపోయావు - నీ ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. పంపకాలు చేస్తేనే బాగుంటుంది కదా అని.

రాఘవయ్యగారు కంటగించుకొన్నాడు. ఒరే ఎప్పుడేమిచేయాలో నాకు నువ్వు చెప్పాలా గ్రుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు? ఈ ఆస్తి అంతా నాస్వార్జితం. ఇప్పుడు నువ్వూ నీ అన్నా వచ్చి ఆస్తి పంచివ్వూ అంటే కాదు - నాకు తోచినప్పుడే ఆస్తి పంపకాలు చేస్తాను సరా అని ఉరిమాడు.

కొడుకులకు ఇంక మాట్లాడటానికి ఏమీ దారి ఇవ్వలేదు ఆయన.

నెల పూర్తవుతూనే వెళ్ళారిద్దరూ కుటుంబాలతో తమతమ స్వస్థలాలకి.

పోతూపోతే చిన్నబ్బాయి వీరేశాన్ని పిలిచి ఒక్క ముక్కన్నాడు. ఎక్కడుండ వలసిన వాళ్ళు అక్కడుండాలి, నువ్వు మా పాలేరువు కదా మాయింట్లోనే ఉండట మేమిటీ?  లోకంలో ఇలా ఎక్కడన్నా ఉంటుందా? ఇదేమీ బాగోలేదు అని.

వీరేశం ఏమీ సమాధానం చెప్పలేదు.

వాళ్ళు వెళ్ళిపోయిన మర్నాడు చిన్నబ్బాయిగారు ఇలా అన్నారండీ అని రాజ్యలక్ష్మమ్మగారితో చెప్పి పనమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

రాఘవయ్యగారు అగ్గిరాముడై పోయాడు.

ఇదంతా జరిగి మూడేళ్ళు కావస్తున్నది.

ఇప్పుడు మళ్ళా ఇల్లంతా పెద్దబ్బాయీ చిన్నబ్బాయిల కుటుంబాలతో బిలబిలలాడుతూ ఉంది.

కార్యక్రమాలన్నీ ముగిసిన మరునాడు, పెద్దబ్బాయి తల్లిదగ్గర ఆస్తి పంపకాల సంగతి ఎత్తాడు.

రాజ్యలక్ష్మమ్మగారు ఏమీ మాట్లాడలేదు.

నాన్న పంపకాలు చేసి వెళ్ళిపోతే బాగుండేదా. ఇప్పుడు మేమే చేసుకోవాలి అన్నాడు చిన్నబ్బాయి.

ఆవిడ ఏమీ మాట్లాడలేదు.

కొంచెం ఆగి నాన్నా వీరేశా అంది.

వీరేశం వచ్చి పిలిచావా అమ్మా అన్నాడు.

స్టుపిడ్ అమ్మగారూ అనలేవా అమ్మా ఏమిటీ అన్నాడు చిన్నబ్బాయి.

అమ్మని అందరూ అమ్మా అనే పిలుస్తారు అన్నాడు వీరేశం శాంతంగా,

వీరేశా నువ్వెళ్ళి పోష్టుమేష్టార్నీ గవర్రాజుగారిని పిలుచుకురా నాయనా అంది రాజ్యలక్ష్మమ్మ.

గవర్రాజుగారికి చెప్పి పొలం వెళ్తానమ్మా చాలా పనులుండిపోయాయీ అన్నాడు.

సరే నాన్నా అంది రాజ్యలక్ష్మమ్మగారు.

ఓ. నాన్నగారు పంపకాలు చేసారన్న మాట ఐతే అన్నాడు పెద్దాడు,  వీరేశం అటు వెళ్ళగానే

రాజ్యలక్ష్మమ్మగారు ఏమీ మాట్లాడలేదు,

గవర్రాజు గారూ రాఘవయ్యగారూ బావా అంటే బావా అని పిలుచుకొనే వారు - ప్రాణస్నేహితులు. పోష్టుమేష్టారు కూడా రాఘవయ్యగారికి ఒకప్పుడు చదువుచెప్పిన మాష్టారి కొడుకున్నూ రాఘవయ్యగారికి సన్నిహితుడున్నూ. వాళ్ళిద్దరితో పాటు గవర్రాజు గారి కొడుకూ, కూతురూ వచ్చారు. వాళ్ళ వెనకాలే పోష్టుమేష్టరు గారబ్బాయి శేఖరం వచ్చాడు. అతను లాయరు.

పనమ్మాయి అందరికీ ఫలహారాలూ కాఫీలు అందించింది.

అన్నట్లు శేఖరానికి చిన్నబ్బాయి క్లాసుమేటే.

మీ నాన్నగారు విల్లు వ్రాసి రిజిష్టరు చేయించారు అన్నాడు శేఖరం.

రాజ్యలక్ష్మమ్మగారు కొడుకుల ముఖాల్లోకి తొంగిచూసింది.

ఆస్తిపాస్తులన్నీ ఆయన రెండు భాగాలుగా విభజించారు అన్నాడు శేఖరం.

చెప్పండి నా వాటలోకి ఏం వచ్చాయో అన్నయ్య వాటా యేమిటో అన్నాడు చిన్నబ్బాయి.

శేఖరం చిరునవ్వు నవ్వి. "మీ అన్నదమ్ము లిద్దరికీ రాఘవయ్యగారు ఏమీ ఇవ్వలేదు" అన్నాడు.

మీద పిడుగుపడిన ట్లైంది అన్నదమ్ములకీ వాళ్ళ భార్యామణులకీ,

"మరి?" అన్నాడు పెద్దాడు ముందుగా తేరుకొని.

సగం ఆస్తి రాజ్యలక్ష్మమ్మగారికి చెందేలాగున్నూ మిగతా సగమూ తన పెంపుడుకొడుకు వీరేశానికి చెందేటట్లున్నూ వీలునామా వ్రాసారు మీనాన్నగారు, రాజ్యలక్ష్మమ్మగారు తనతదనంతరం తనవాటా ఆస్తిని తన ఇష్టానుసారం ఎవరికైనా ఇవ్వవచ్చును అని కూడా వ్రాసారు. అన్నాడు శేఖరం వీలునామా చూపుతూ.

"ఇదంతా అన్యాయం అమ్మా. నీక్కూడా తెలియకుండా నాన్నెంత పని చేసాడో చూసావా?" అని చిందులేశాడు చిన్నబ్బాయి.

"ఇలా పంచమని మీనాన్నగారికి నేనే చెప్పాను. మరొక సంగతి వినండి, నా తదనంతరం నా వాటాకూడా వీరేశానికే ఇస్తాను." అంది స్థిరంగా రాజ్యలక్ష్మమ్మ.

"అన్యాయం అమ్మా" అన్నాడు పెద్దాడు నోరు తెరచి.

 "మీకు అమ్మ అక్కర్లేదు. నాన్న అక్కలేదు. స్వదేశం అక్కర్లేదు. ఎక్కడికో పోయి కూర్చున్నారు. అక్కడ మీరు బాగానే ఉన్నారు. ఇక్కడి ఆస్తులెందుకు అమ్ముకుందుకు కాకపోతే? ఆమధ్య చిన్నాడేమన్నాడూ 'ఇక్కడేముందమ్మా మట్టి అని కదూ'. ఇప్పుడు ఆ మట్టికే రేట్లు బాగా పెరిగి కోట్లు పలుకుతున్నాయని కదా మళ్ళా మీకు మా మీద ప్రేమ పుట్టుకొచ్చిందీ? అందుకే కదా మీరంతా ఆమధ్య వచ్చి వెళ్ళిందీనూ? మీ యిద్దరూ ఇక్కడి పొలాలు ఏమాత్రం పలుకుతున్నాయో వాకబు చేసుకొని వెళ్ళిన సంగతి మీ నాన్నగారికి తెలియలేదని అనుకుంటున్నారా ఇద్దరూ? మీ యిద్దరూ ఇల్లు వదలి మీదారిన మీరు పోయాక దైవికంగా దొరికిన బిడ్ద ఈ వీరేశం. వాడు మమ్మల్ని అమ్మా నాన్నా అంటుంటే మీ కెందుకు అంత కంటగింపుగా ఉన్నదీ? మీ అమ్మానాన్నల్ని వాడూ అమ్మా నాన్నా అంటున్నాడనా? ఎక్కడ మీ నాన్న వాడికేదన్నా దోపుతాడో అన్న కచ్చ తోనా అన్నది నాకు తెలియదా మీ నాన్నకి తెలియదా?  వాడికీ ఏదో ఏర్పాటు  చేయండీ అన్నాను. అన్నీ ఆలోచించే ఇలా విల్లు వ్రాస్తానన్నారు మీనాన్న. సరే అన్నాను. అప్పుడే మీనాన్న సలహా ఇచ్చారు. వీరేశానికే ఇవ్వు నీ వాటాకూడా అని."

పెద్దాడి ముఖంలోనూ చిన్నాడి ముఖంలోనూ కత్తి వాటుకు నెత్తురుచుక్క లేదు.

"మనం ముందే మేలుకొని ఈ వీరేశం గాడిని ఇంటినుండి తరిమి వేసుంటే ఈ తిప్పలొచ్చేవి కావు" అంది చిన్నకోడలు అక్కసుగా.

"మా నాన్నగారితో మాట్లాడదాం. మనకు వాటాలు ఎందుకురావో తేల్చుకుందాం" అంది పెద్దకోడలు. ఆవిడ తండ్రి కూడా ప్లీడరేను.

"లాభం లేదమ్మా. ఈ ఆస్తిపాస్తులన్నీ రాఘవయ్యగారి స్వార్జితం." అన్నాడు శేఖరం.

"మావయ్య గారు పూర్తి స్వస్థతతో ఉండే వ్రాసారా ఈ విల్లు? ఈ వీరేశం ఏదో మతలబు చేసి వ్రాయించాడేమో" అంది ప్లీడరుగారమ్మాయి. "పైగా అయన ఆరోగ్యం గత యేడాదిగా బాగుండటం లేదుట కదా? ఈ విల్లు చెల్లదేమో "అని కూడా అంది.

"అలాగా? ఈ సంగతి  కూడా వినండి. పోష్టుమాష్టార్నీ గవర్రాజుగార్నీ సంప్రదించి మరీ ఇలా విల్లు వ్రాసారు. మీరు ఆమధ్య వచ్చి వెళ్ళిన మూడోరోజునే ఈ విల్లు వ్రాయటం రిజిష్ట్రీ చేయటం  కూడా జరిగింది. అప్పుడు మీ మావయ్యగారు నిక్షేపంగా ఉన్నారు. ఆయనా పెద్దమనుషులూ పట్నం వెళ్ళి విల్లు రిజిష్టరు చేయించుకొని మరీ వచ్చారు." అని నిష్కర్ష చేసింది రాజ్యల్క్ష్మమ్మ.

"అమ్మాయీ, నేను గవర్నమెంటు డాక్టర్ని అన్న సంగతి నీకు తెలియదేమో" అన్నాడు గవర్రాజు గారు.

"ఇంకేం పని మనకిక్కడ" అంది పెద్దకోడలు విసురుగా.

కొడుకులూ కోడళ్ళు రుసరుసలాడుతూ లేచ్చక్కాపోయారు అక్కణ్ణుంచి.

ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ ఐంది.

నువ్వూ నీ వీరేశం గాడూ ఉట్టికట్టుకొని ఊరేగండి. మాకింత అన్యాయంచేసిన వాడు ఎలాబాగుపడతాడో చూస్తాంగా అని తల్లిముందు రంకెలు వేస్తూ మరీ వెళ్ళాడు చిన్నబ్బాయి.

పెద్దబ్బాయి కాస్త గుంభన మనిషి అని చెప్పాను కదా.  తమ్ముణ్ణి సముదాయించాడు, బోడి ఈ మట్టి లేకపోతే మనం బ్రతకలేమా? జస్ట్ డోంట్ కేర్. వీళ్ళిలాంటి ప్రేమలూ అభిమానాలూ లేని మనుషులనే నాకు ఇక్కడికి రావటానికే అసహ్యం. లెట్స్ గో" అన్నాడు.

10, ఆగస్టు 2018, శుక్రవారం

పరమదయాశాలి యైన వాడు రాముడు


పరమదయాశాలి యైన వాడు రాముడు వాడు
దరిజేరిన వారి నెల్ల దయజూచెడు వాడు

చెడుబుధ్ధులు కైకమ్మకు చెవిలో నూది
వడిగా పట్టాభిషేకభంగము చేసి
అడవికంపు మంథర యడుగుల బడిన
కడుగడు కరుణతో కాపాడిన వాడు

కావరమున సీతమ్మను కాకియై హింసించి
శ్రీవిభుడు బ్రహ్మాస్త్రము చేగొని విసర
తీవరమున లోకములు తిరిగివచ్చి వాడు
కావుకావు మనగానే కాపాడిన వాడు

పగతుని తమ్మునకు మంచిపదవి నిచ్చు వాడు
పగతుని చారులను కూడ వదలిన వాడు
పగతుడా యలసిన రావణ రేపు రమ్మని
తెగవేయక కాపాడిన దేవుడు వాడు

9, ఆగస్టు 2018, గురువారం

వలదు వలదు వలదు


వలదు వలదు వలదు మీకు వలదయ్యా వలదు
తెలిసి తెలిసి తప్పుజేయ వలదయ్యా వలదు

రామనామ సుజపానురక్తుల కేల
పామరులను జేరి వాదప్రతివాదములు
రామహిత కార్యానురక్తుల కేల
పామరులను జేరి పిచ్చి పనుల నుండుటలు

రామచంద్రకీర్త నానురక్తుల కేల
పామరుల ప్రశంస జేసి భంగపడుటలు
రామపాద పూజానురక్తుల కేల
సామాన్యదేవతల సాగి కొల్చుటలు

రామకథాపఠ నానురక్తుల కేల
ఏమేమో యైహికకథ లిక చదువుటలు
రామపదము జేరగోరు వారలకేల
ఈ ముల్లోకముల యందెట్టి పదవులు

8, ఆగస్టు 2018, బుధవారం

చిరుజీవికి హితవు.


ఓయి చిరుజీవీ,

ముదుక నని తిట్టినట్టి యో మూర్ఖ జనుడ
మొగ్గ పూవౌను కాయౌను ముదిరి పండి
నేల వ్రాలును సృష్టిలో కాలగతిని
ముసలితన మేల నీకు రాబోదు చెపుమ

కాలగతి జేసి బాల్యము కరిగిపోవు
కాలగతి జేసి యుడుకు రక్తము శమించు
కాలగతి జేసి వార్థక్య గరిమ కలుగు
కాలగతి జేసి తొలగెడు క్షణము కలుగు

కాలమున జేసి సర్వము కలుగుచుండు
కాలమున జేసి సర్వము తొలగుచుండు
కాలమున జేసి విశ్వమే కలుగు తొలగు
కాల మెఱుగు విజ్ఞానులు గర్వపడరు

స్వస్తి.


(Originally posted today as a comment at blog racca banda.)

7, ఆగస్టు 2018, మంగళవారం

మనఃపుష్పార్చన


ఉన్న దొకే చిన్న పూవు మన్ని కైన పూవు
నిన్ను చేరు తహతహతో నున్నదీ పూవు

సేవించగ వచ్చినదీ చిన్న పూవు దాని
తావి నీవు మెచ్చిన కడు ధన్యమగు పూవు
ఈ వెఱ్ఱి మనసనే యెంతో చిన్నపూవు
నీవు గైకొన్న గాని నిలువలేని పూవు

నీ పై యనురక్తితోడ నిండిన దీ పూవు
ఓప లేని తహతహతో నున్నదీ పూవు
చేపట్టి యేలుదువని చేరిన దీ పూవు
నీ పాదసన్నిధిని నిలచిన దీ పూవు

తనరు భక్తిపరీమళము దాల్చిన పూవు
జనకజారమణు కరుణ జాలను పూవు
తనకు వేరు గతి వలదని తలచు పూవు
మనసనే పూవు మంచి వినయము గల పూవు