10, ఆగస్టు 2018, శుక్రవారం
పరమదయాశాలి యైన వాడు రాముడు
పరమదయాశాలి యైన వాడు రాముడు వాడు
దరిజేరిన వారి నెల్ల దయజూచెడు వాడు
చెడుబుధ్ధులు కైకమ్మకు చెవిలో నూది
వడిగా పట్టాభిషేకభంగము చేసి
అడవికంపు మంథర యడుగుల బడిన
కడుగడు కరుణతో కాపాడిన వాడు
కావరమున సీతమ్మను కాకియై హింసించి
శ్రీవిభుడు బ్రహ్మాస్త్రము చేగొని విసర
తీవరమున లోకములు తిరిగివచ్చి వాడు
కావుకావు మనగానే కాపాడిన వాడు
పగతుని తమ్మునకు మంచిపదవి నిచ్చు వాడు
పగతుని చారులను కూడ వదలిన వాడు
పగతుడా యలసిన రావణ రేపు రమ్మని
తెగవేయక కాపాడిన దేవుడు వాడు
2 కామెంట్‌లు:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీరొక విషయం గమనించారో లేదో తెలియదు. మీకు ఆగ్రహం కలిగినవేళనే రాముడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఇటువంటి పద్యాలు వ్రాయగలుగుతున్నారు.
రిప్లయితొలగించండిఅవునా!
తొలగించండినేను గమనించ లేదు సుమండీ. మంచి విషయం గమనించి చూపారు. బాగుంది.
అనేక ధన్యవాదాలు మీకు.