12, ఆగస్టు 2018, ఆదివారం

పంపకం


అప్పట్లో,  పెద్దబ్బాయీ చిన్నబ్బాయీ కూడా అమెరికా చెక్కేసే సరికి, రాఘవయ్య గారికి పిచ్చెక్కినట్లయింది.

అక్కడికీ చిన్నబ్బాయి విమానాశ్రయానికి పరిగెత్తే హడావుడిలో ఉండగా ఉండబట్ట లేక ఒక ముక్క అననే అన్నారు. "ఒరే చిన్నాడా, ఈ తోటలూ పొలాలూ, ఈ రెండిళ్ళూ అన్నీ ఇంకెవరికోసంరా? నువ్వూ అన్నా కూడా మమ్మల్ని విడిచి ఎగిరిపోతుంటే" అని.

చిన్నోడు పెద్దాడిలా గుంభన మనిషి కాదు. నోటికేదొస్తే అదే అనేస్తాడు. "మరేం జెయ్యమన్నావూ? ఇంత చదువూ చదివి ఇక్కడ ఎడ్లను తోలుకుంటూ వ్యవసాయం చేయమన్నావా?" అని దులిపినట్లుగా ఒక్క ముక్క అనేసి చక్కా పోయాడు.

ఆరాత్రి మాత్రం పెద్దాడు ఫోన్ చేసాడు గొప్పగా ఓదారుస్తూ, "నువ్వేం  బెంగెట్టుకోకు నాన్నా, వస్తూపోతూనే ఉంటాంగా? అమ్మను చూడు ఎంత ధైర్యంగా ఉందో" అని గొప్ప మాటన్నాడు.

అసలు ఆ రాజ్యలక్ష్మమ్మగారు ఎంత బెంగపడుతున్నదీ ఎంత నిరాశపడుతున్నదీ ఈ కుర్రకుంకలిద్దరికీ ఏం తెలుస్తున్నదీ అని రాఘవయ్యగారు నిర్వేదం చెందాడు. తనకైతే ఏదో వ్యవసాయం పనులూ గట్రా ఉంటాయి. ఇంటికే పరిమితం ఐన తన ఇల్లాలు ఒక్కర్తీ కూర్చుని ఈ పిల్లాళ్ళ కోసం ఎలా అంగలారుస్తున్నదీ వీళ్ళకి తెలియటం లేదే అని బాధపడ్డారు.

ఇంక ఇంట్లో మిగిలినది ముసలాళ్ళం ఇద్దరమే అనుకొని ఆయనకు క్రమంగా ఏపని మీదకూ ఆసక్తి కలగటం మానేసింది.

అదీ కాక చిన్నబ్బాయి విమానం ఎక్కివెళ్ళిపోయన ఆర్నెల్లకు పిల్లలమీద బెంగతో రాజ్యలక్ష్మమ్మ మంచం ఎక్కింది.

ఓ ఆర్నెల్లపాటు వైద్యం నడిచింది.

కోలుకుంటున్నట్లే ఉండటం మళ్ళా జబ్బు తిరగబెట్టటమూ జరిగింది.

బాగా ఆలోచించి పొలాలూ తోటలూ కౌళ్ళ కిచ్చి రాఘవయ్యగారూ ఇంటిపట్టునే ఉండసాగారు.

అయన ఉపచారాల పుణ్యమా అనో వైద్యం గొప్పదనమనో చెప్పలేం కాని రాజ్యలక్ష్మమ్మ మరొక ఆర్నెల్ల తరువాత లేచి తిరగటం మొదలు పెట్టింది.

కాని మునుపటి ఉత్సాహం లేదు.

బాగా ఆలోచించి పెద్దాడికి ఫోన్ చేసారు రాఘవయ్య గారు.

కోడలు ఎత్తింది ఫోన్. పుత్రరత్నంగారు ఎక్కడికో కేంపుకు వెళ్ళారట. వచ్చాక చెబుతాను లెండి. ఐనా ఈ సీజనులో టిక్కెట్లు బాగా ఖరీదు. అదీ కాక పిల్లలకీ వీలు కుదరాలిగా. మెల్లగా వీలుచూసుకొని వస్తాం అని పెట్టేసింది.

ఇక చిన్నాడికీ ఫోన్ చేసి చెప్పారు, ఒకసారి వచ్చె వెళ్ళరా అని. వాడు గయ్యిమన్నాడు. నీకే మన్నా పిచ్చానాన్నా. నేను వచ్చి ఏడాది ఐందో లేదో ఇప్పుడే ఎలా వస్తానూ. మళ్ళీ ఏడాది చూదాంలే అని విసుక్కుని పోను ఠపీ మని పెట్టేసాడు.

కోడలి గొంతులోని నిరాసక్తతా చిన్నకొడుకు నిర్లక్ష్యమూ రాఘవయ్యగారికి విరక్తి కలిగించాయి.

ఇంక ఆయన ఎన్నడూ పిల్లలకు ఫోన్ చేయలేదు.

వాళ్ళు ఊరికే కుశలం కనుక్కుందామని అన్నట్లు అరుదుగా చేసే ఫోనులకు ముక్తసరి సమాధానాలు చెప్పి ఊరకుంటున్నారు.

కాలం ఇలాగే గడిచిపోతుందా? మనం ఇలాగే వెళ్ళిపోతామా అని రాఘవయ్యగారు మథనపడుతూ ఉన్న రోజుల్లో - అంటే చిన్నబ్బాయి కూడా తనకు అమెరికా సిటిజెన్ షిప్ వచ్చేసిందని సంబరపడుతూ ఫోన్ చేసిన మర్నాడు వాళ్ళింటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు.

ఆ పిల్లవాడి పేరు వీరేశం. వీరేశం తండ్రి రాఘవయ్యగారి దగ్గరే పాలేరుగా ఉండే వాడు. వీరేశం అన్నగారు పట్నంలో ఒక స్టీలు దుకాణంలో వాటాదారుగా చేరాడు. తండ్రిని పని మానిపించి తీసుకొని పోయాడు. కొన్నాళ్ళు సమాచారం ఏమీ లేదు రాఘవయ్యగారికి. ఇదిగో ఈమధ్యన ఆ కొట్టు ఎత్తేసి వాటాదారు డబ్బుతో సహా మాయం అయ్యాడట. అప్పులవాళ్ళు మీదకు వస్తే వీరేశం అన్న తట్టుకోలేక ఇంట్లో అందరికీ విషం కలిపి పెట్టేసాడు. అన్నా వదినా పోయారు. హాస్పిటల్లో తండ్రికీ వీరేశానికి బాగయ్యింది. కాని దిగులుతో ఆ తండ్రికాస్తా ఎంతో కాలం బ్రతకలేదు. వీరేశం చేతికి ఒక ఉత్తరమ్ముక్క ఇచ్చి, నేను పోయాక, నువ్వు పోయి రాఘవయ్యగారి పంచన బ్రతుకు అని చెప్పాడు.

ఇదంతా విని రాఘవయ్యగారూ రాజ్యలక్ష్మమ్మగారూ ఎంతో బాధపడ్డారు.

పదేళ్ళ పిల్లాడికి వచ్చిన కష్టానికి చలించిన రాజ్యలక్ష్మమ్మగారు, "ఇంక వీడు నా కొడుకే" అని ప్రకటన చేసేసింది.

రాఘవయ్యగారికి మళ్ళా ఉత్సాహం వచ్చింది.  ఇదిగో ఈ పిల్లాడి చదువుసంద్యలని ఏమి, వాడికి వ్యవసాయం పనులు నేర్పటం అని ఏమి మళ్ళా మునపటి మనిషిలా అవటానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు.

ఉన్నట్లుండి ఒకరోజున పెద్దాడూ చిన్నాడూ కలిసి అదేదో కాల్ చేసారు. సారాంశం ఏమిటంటే చిన్నోడికి అక్కడే మంచి అమ్మాయి దొరికిందట ఆరోజునే పెళ్ళి చేసుకున్నాడట.

రాఘవయ్యగారికి కోపం వచ్చి కేకలు వేసారు ఫోనులోనే.

రాజ్యలక్ష్మిగారు కూడా కొంచెం దుఃఖపడి చివరకు "అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడా" పోనివ్వండి. అసలే ఈ మధ్య మీ ఆరోగ్యం బాగోలేదు అని ఊరడించింది రాఘవయ్యగారిని.

ఆ చిన్నాడి పెళ్ళి అంత ముచ్చటగా దేశాంతరంలో కన్నవారిపరోక్షంలో జరిగిన ఐదేళ్ళకు కాబోలు పెద్దాడి ఇంట్లో ఏదో శుభకార్యం సందర్భంగా అందరూ కలిసి జరుపుకున్న సందడి తాలూకు వీడియో ఒకటి రాఘవయ్యగారికి పంపింది చిన్నకోడలు.

దానితో పాటే ఒక ఉత్తరం. తామంతా ఎన్నో తప్పులు చేసామనీ పెద్దమనసుతో మీరు క్షమించి దీవించాలనీ మీదగ్గరకు అందరం ఒకసారి తొందరలో వద్దామనుకుంటున్నామనీ దాని సారాంశం.

ఆ ఉత్తరం చేరిన నాడో మరునాడో చిన్నాడి నుండి ఫోన్. నాన్నా ఈ నెలాఖరుకు అన్నయ్యా నేనూ కుటుంబాలతో వస్తున్నాం అని.

రాఘవయ్యగారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది.
రాజ్యలక్ష్మమ్మ గారికి ఎంతో ఆనందం కలిగింది.

నెలాఖరు కల్లా ఇల్లంతా పిల్లా మేకాతో కళకళలాడి పోయింది.

చెరొక నెలరోజులూ సెలవులు పెట్టుకొని వచ్చారట. పెద్దకోడలు ఎన్నడూ ఎరుగనంత వినయవంతురా లయింది. కొడుకు లిద్దరూ తండ్రిని అరచేతితో ఆకాశానికి ఎత్తుకొంటూ గౌరవించుతున్నారు.

మనవలకైతే ఈ వాతావరణం అంతా చాలా అబ్బురంగా ఉంది. పెద్దాడి ఇద్దరుపిల్లలకీ తెలుగు అర్థమౌతుంది కాని మాట్లాడలేరు. చిన్నాడి కూతురికి తెలుగు అర్థం కూడా కాదు.

కొడుకులిద్దరూ వీరేశాన్ని గమనించుతూనే ఉన్నారు.

ఇంటిపనులన్నీ వాడే చూసుకొంటూన్నాడు. వ్యవసాయం పనులన్నీ వాడే చక్కబెడుతున్నాడు.  అమ్మేమో నాన్నా వీరేశా అంటుంది.  నాన్నైతే అబ్బిగా అంటాడు.

వీడూ మరీ అన్యాయమే, నాన్నగారూ అంటున్నాడు. ఇదిగో ఈముక్క కంపరంగా తోచింది అన్నదమ్ములిద్దరికీ.

ఓరోజున అమ్మకు హితోపదేశం చేసాడు చిన్నబ్బాయి. అమ్మా పాలేరును పాలేరుగానే చూడాలి కాని వీడికి ఈ చనువేమిటమ్మా అని.

రాజ్యలక్ష్మమ్మగ్సారు చర్రుమంది. ఒరే, మీరిద్దరూ దేశాలట్టుకుపోతే మాకు రెక్కాసరా ఇస్తున్నది వీడేరా - వీరేశాన్ని ఎప్పుడూ పరాయి చేసి ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది.

అరోజు రాత్రే ఆస్తిపంపకాల గురించి తండ్రితో మాట్లాడాడు పెద్దబ్బాయి. ఆలోచించి ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు కాని రాఘవయ్య గారు అలాగే అన్నాడు కాదు.

అక్కడే వింటూనే ఉన్న చిన్నబ్బాయి అందుకున్నాడు. అదికాదు నాన్నా, నువ్వా పెద్దాడివి ఐపోయావు - నీ ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. పంపకాలు చేస్తేనే బాగుంటుంది కదా అని.

రాఘవయ్యగారు కంటగించుకొన్నాడు. ఒరే ఎప్పుడేమిచేయాలో నాకు నువ్వు చెప్పాలా గ్రుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు? ఈ ఆస్తి అంతా నాస్వార్జితం. ఇప్పుడు నువ్వూ నీ అన్నా వచ్చి ఆస్తి పంచివ్వూ అంటే కాదు - నాకు తోచినప్పుడే ఆస్తి పంపకాలు చేస్తాను సరా అని ఉరిమాడు.

కొడుకులకు ఇంక మాట్లాడటానికి ఏమీ దారి ఇవ్వలేదు ఆయన.

నెల పూర్తవుతూనే వెళ్ళారిద్దరూ కుటుంబాలతో తమతమ స్వస్థలాలకి.

పోతూపోతే చిన్నబ్బాయి వీరేశాన్ని పిలిచి ఒక్క ముక్కన్నాడు. ఎక్కడుండ వలసిన వాళ్ళు అక్కడుండాలి, నువ్వు మా పాలేరువు కదా మాయింట్లోనే ఉండట మేమిటీ?  లోకంలో ఇలా ఎక్కడన్నా ఉంటుందా? ఇదేమీ బాగోలేదు అని.

వీరేశం ఏమీ సమాధానం చెప్పలేదు.

వాళ్ళు వెళ్ళిపోయిన మర్నాడు చిన్నబ్బాయిగారు ఇలా అన్నారండీ అని రాజ్యలక్ష్మమ్మగారితో చెప్పి పనమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

రాఘవయ్యగారు అగ్గిరాముడై పోయాడు.

ఇదంతా జరిగి మూడేళ్ళు కావస్తున్నది.

ఇప్పుడు మళ్ళా ఇల్లంతా పెద్దబ్బాయీ చిన్నబ్బాయిల కుటుంబాలతో బిలబిలలాడుతూ ఉంది.

కార్యక్రమాలన్నీ ముగిసిన మరునాడు, పెద్దబ్బాయి తల్లిదగ్గర ఆస్తి పంపకాల సంగతి ఎత్తాడు.

రాజ్యలక్ష్మమ్మగారు ఏమీ మాట్లాడలేదు.

నాన్న పంపకాలు చేసి వెళ్ళిపోతే బాగుండేదా. ఇప్పుడు మేమే చేసుకోవాలి అన్నాడు చిన్నబ్బాయి.

ఆవిడ ఏమీ మాట్లాడలేదు.

కొంచెం ఆగి నాన్నా వీరేశా అంది.

వీరేశం వచ్చి పిలిచావా అమ్మా అన్నాడు.

స్టుపిడ్ అమ్మగారూ అనలేవా అమ్మా ఏమిటీ అన్నాడు చిన్నబ్బాయి.

అమ్మని అందరూ అమ్మా అనే పిలుస్తారు అన్నాడు వీరేశం శాంతంగా,

వీరేశా నువ్వెళ్ళి పోష్టుమేష్టార్నీ గవర్రాజుగారిని పిలుచుకురా నాయనా అంది రాజ్యలక్ష్మమ్మ.

గవర్రాజుగారికి చెప్పి పొలం వెళ్తానమ్మా చాలా పనులుండిపోయాయీ అన్నాడు.

సరే నాన్నా అంది రాజ్యలక్ష్మమ్మగారు.

ఓ. నాన్నగారు పంపకాలు చేసారన్న మాట ఐతే అన్నాడు పెద్దాడు,  వీరేశం అటు వెళ్ళగానే

రాజ్యలక్ష్మమ్మగారు ఏమీ మాట్లాడలేదు,

గవర్రాజు గారూ రాఘవయ్యగారూ బావా అంటే బావా అని పిలుచుకొనే వారు - ప్రాణస్నేహితులు. పోష్టుమేష్టారు కూడా రాఘవయ్యగారికి ఒకప్పుడు చదువుచెప్పిన మాష్టారి కొడుకున్నూ రాఘవయ్యగారికి సన్నిహితుడున్నూ. వాళ్ళిద్దరితో పాటు గవర్రాజు గారి కొడుకూ, కూతురూ వచ్చారు. వాళ్ళ వెనకాలే పోష్టుమేష్టరు గారబ్బాయి శేఖరం వచ్చాడు. అతను లాయరు.

పనమ్మాయి అందరికీ ఫలహారాలూ కాఫీలు అందించింది.

అన్నట్లు శేఖరానికి చిన్నబ్బాయి క్లాసుమేటే.

మీ నాన్నగారు విల్లు వ్రాసి రిజిష్టరు చేయించారు అన్నాడు శేఖరం.

రాజ్యలక్ష్మమ్మగారు కొడుకుల ముఖాల్లోకి తొంగిచూసింది.

ఆస్తిపాస్తులన్నీ ఆయన రెండు భాగాలుగా విభజించారు అన్నాడు శేఖరం.

చెప్పండి నా వాటలోకి ఏం వచ్చాయో అన్నయ్య వాటా యేమిటో అన్నాడు చిన్నబ్బాయి.

శేఖరం చిరునవ్వు నవ్వి. "మీ అన్నదమ్ము లిద్దరికీ రాఘవయ్యగారు ఏమీ ఇవ్వలేదు" అన్నాడు.

మీద పిడుగుపడిన ట్లైంది అన్నదమ్ములకీ వాళ్ళ భార్యామణులకీ,

"మరి?" అన్నాడు పెద్దాడు ముందుగా తేరుకొని.

సగం ఆస్తి రాజ్యలక్ష్మమ్మగారికి చెందేలాగున్నూ మిగతా సగమూ తన పెంపుడుకొడుకు వీరేశానికి చెందేటట్లున్నూ వీలునామా వ్రాసారు మీనాన్నగారు, రాజ్యలక్ష్మమ్మగారు తనతదనంతరం తనవాటా ఆస్తిని తన ఇష్టానుసారం ఎవరికైనా ఇవ్వవచ్చును అని కూడా వ్రాసారు. అన్నాడు శేఖరం వీలునామా చూపుతూ.

"ఇదంతా అన్యాయం అమ్మా. నీక్కూడా తెలియకుండా నాన్నెంత పని చేసాడో చూసావా?" అని చిందులేశాడు చిన్నబ్బాయి.

"ఇలా పంచమని మీనాన్నగారికి నేనే చెప్పాను. మరొక సంగతి వినండి, నా తదనంతరం నా వాటాకూడా వీరేశానికే ఇస్తాను." అంది స్థిరంగా రాజ్యలక్ష్మమ్మ.

"అన్యాయం అమ్మా" అన్నాడు పెద్దాడు నోరు తెరచి.

 "మీకు అమ్మ అక్కర్లేదు. నాన్న అక్కలేదు. స్వదేశం అక్కర్లేదు. ఎక్కడికో పోయి కూర్చున్నారు. అక్కడ మీరు బాగానే ఉన్నారు. ఇక్కడి ఆస్తులెందుకు అమ్ముకుందుకు కాకపోతే? ఆమధ్య చిన్నాడేమన్నాడూ 'ఇక్కడేముందమ్మా మట్టి అని కదూ'. ఇప్పుడు ఆ మట్టికే రేట్లు బాగా పెరిగి కోట్లు పలుకుతున్నాయని కదా మళ్ళా మీకు మా మీద ప్రేమ పుట్టుకొచ్చిందీ? అందుకే కదా మీరంతా ఆమధ్య వచ్చి వెళ్ళిందీనూ? మీ యిద్దరూ ఇక్కడి పొలాలు ఏమాత్రం పలుకుతున్నాయో వాకబు చేసుకొని వెళ్ళిన సంగతి మీ నాన్నగారికి తెలియలేదని అనుకుంటున్నారా ఇద్దరూ? మీ యిద్దరూ ఇల్లు వదలి మీదారిన మీరు పోయాక దైవికంగా దొరికిన బిడ్ద ఈ వీరేశం. వాడు మమ్మల్ని అమ్మా నాన్నా అంటుంటే మీ కెందుకు అంత కంటగింపుగా ఉన్నదీ? మీ అమ్మానాన్నల్ని వాడూ అమ్మా నాన్నా అంటున్నాడనా? ఎక్కడ మీ నాన్న వాడికేదన్నా దోపుతాడో అన్న కచ్చ తోనా అన్నది నాకు తెలియదా మీ నాన్నకి తెలియదా?  వాడికీ ఏదో ఏర్పాటు  చేయండీ అన్నాను. అన్నీ ఆలోచించే ఇలా విల్లు వ్రాస్తానన్నారు మీనాన్న. సరే అన్నాను. అప్పుడే మీనాన్న సలహా ఇచ్చారు. వీరేశానికే ఇవ్వు నీ వాటాకూడా అని."

పెద్దాడి ముఖంలోనూ చిన్నాడి ముఖంలోనూ కత్తి వాటుకు నెత్తురుచుక్క లేదు.

"మనం ముందే మేలుకొని ఈ వీరేశం గాడిని ఇంటినుండి తరిమి వేసుంటే ఈ తిప్పలొచ్చేవి కావు" అంది చిన్నకోడలు అక్కసుగా.

"మా నాన్నగారితో మాట్లాడదాం. మనకు వాటాలు ఎందుకురావో తేల్చుకుందాం" అంది పెద్దకోడలు. ఆవిడ తండ్రి కూడా ప్లీడరేను.

"లాభం లేదమ్మా. ఈ ఆస్తిపాస్తులన్నీ రాఘవయ్యగారి స్వార్జితం." అన్నాడు శేఖరం.

"మావయ్య గారు పూర్తి స్వస్థతతో ఉండే వ్రాసారా ఈ విల్లు? ఈ వీరేశం ఏదో మతలబు చేసి వ్రాయించాడేమో" అంది ప్లీడరుగారమ్మాయి. "పైగా అయన ఆరోగ్యం గత యేడాదిగా బాగుండటం లేదుట కదా? ఈ విల్లు చెల్లదేమో "అని కూడా అంది.

"అలాగా? ఈ సంగతి  కూడా వినండి. పోష్టుమాష్టార్నీ గవర్రాజుగార్నీ సంప్రదించి మరీ ఇలా విల్లు వ్రాసారు. మీరు ఆమధ్య వచ్చి వెళ్ళిన మూడోరోజునే ఈ విల్లు వ్రాయటం రిజిష్ట్రీ చేయటం  కూడా జరిగింది. అప్పుడు మీ మావయ్యగారు నిక్షేపంగా ఉన్నారు. ఆయనా పెద్దమనుషులూ పట్నం వెళ్ళి విల్లు రిజిష్టరు చేయించుకొని మరీ వచ్చారు." అని నిష్కర్ష చేసింది రాజ్యల్క్ష్మమ్మ.

"అమ్మాయీ, నేను గవర్నమెంటు డాక్టర్ని అన్న సంగతి నీకు తెలియదేమో" అన్నాడు గవర్రాజు గారు.

"ఇంకేం పని మనకిక్కడ" అంది పెద్దకోడలు విసురుగా.

కొడుకులూ కోడళ్ళు రుసరుసలాడుతూ లేచ్చక్కాపోయారు అక్కణ్ణుంచి.

ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ ఐంది.

నువ్వూ నీ వీరేశం గాడూ ఉట్టికట్టుకొని ఊరేగండి. మాకింత అన్యాయంచేసిన వాడు ఎలాబాగుపడతాడో చూస్తాంగా అని తల్లిముందు రంకెలు వేస్తూ మరీ వెళ్ళాడు చిన్నబ్బాయి.

పెద్దబ్బాయి కాస్త గుంభన మనిషి అని చెప్పాను కదా.  తమ్ముణ్ణి సముదాయించాడు, బోడి ఈ మట్టి లేకపోతే మనం బ్రతకలేమా? జస్ట్ డోంట్ కేర్. వీళ్ళిలాంటి ప్రేమలూ అభిమానాలూ లేని మనుషులనే నాకు ఇక్కడికి రావటానికే అసహ్యం. లెట్స్ గో" అన్నాడు.

39 కామెంట్‌లు: 1. కథ మొదటి పది వాక్యాల లోనే ఎట్లా ముగుస్తుందో తెలిసి పోతోంది.

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. సాదా సీదాగా జరుగుతున్న కథ.

  కథా చట్రంలోనే మాటాడక తప్పదు. ఇలా చేయచ్చు అలా చేయచ్చు, విదేశాలకు పంపినదీ వాళ్ళే,చూడలేదన్నదీ వాళ్ళే.....ఇలా ఎన్నేనా అనచ్చు, నరం లేని నాలుక.

  ”కలిబోసి పెట్టినా ఉట్టి వంకే చూసిన” సామెతగా తల్లి తండ్రులంతా పిల్లలకే సంపద వదలిపోతున్నారు, తాము కష్ట పడి కూడా! కథలో దానికి భిన్నంగా జరిగింది, ఇది సామాన్యంకాదు,మానవ మనస్తత్త్వానికి దగ్గరగా లేదు. అందుకే కథయ్యిందా?

  ఎలా జరిగినా చివరిదాకా ఉత్కంఠ ఉండేలా కథా సంవిధానం ఉంటే మరికొంచం బాగుండేదేమో!

  కామెంట్ మీకు నచ్చకపోతే ప్రచురించకండి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విదేశాలకు పంపినదీ వాళ్ళే అనుకోలేమేమో. తలిదండ్రులకు బిడ్డలు దూరదేశాలు పోవటం సమ్మతంగా లేదన్నట్లే కథ మొదట్లోనే చెప్పాను కదా.

   ఉన్నది ఉన్నట్లుగా కాక అప్పుడప్పుడూ లోకవృత్తానికి భిన్నంగా కూడా జరిగే సందర్భాలుంటాయి అవే కథలకు మంచి వస్తువులు. యథాలోకాదర్శం అన్నట్లుంటే ఆట్టే కథేముంటుంది కనుక.

   సంఘటనాక్రమంగా చెప్పటం కాక, మంచి ఉత్కంఠ కలిగేలా చెప్పి ఉంటే బాగుండేది అన్నది నిర్వివాదం. ఐతే ఎందుకో అలా చెప్పా లనిపించలేదు. ఇక్కడ క్రైమ్ కాని క్రైమ్ ఉంది. కాని మిష్టరీ చేసి చెప్పటం వలన పెద్దగా ఏమీ ఉపయోగం అనిపించలేదు.

   నిజానికి ఎందుకనో మొదలు పెట్టి మొత్తం పది పదిహేను నిముషాల్లో టకటకా వ్రాసానే కాని చిత్రికపట్టి దీన్ని ఒక చమత్కారకథ చేయాలన్న ఊహ కలుగలేదు.

   తొలగించండి
 3. సాధారణంగా కధల్లో ఏదో ఒక సందేశం ఉంటుంది.చెడ్డవాడిని చంపటమో లేక చెడ్డవాడిని మార్చడమో ఉంటుంది.చెడ్డవాడిని మార్చడం సాధ్యం కాదు కాబట్టి చంపేస్తుంటారు.
  మీ కధలో చెడ్డవారిని(అనుకుని) మార్చడానికి తల్లిదండ్రులు చెడ్డవారిగా మారిపోయారు.పిల్లలనే క్షమించనివారు సామాజికంగా ఏం ఉపయోగపడతారు ? వీరి జీవితం నుండి ఏమి నేర్చుకోవాలి ?
  సామాజిక ప్రయోజనం లేని కధ వ్యర్ధం ! నొప్పించినా వాస్తవాన్నే చెప్పాలి...క్షమించండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కథ వ్రాయటం ఒక దృక్కోణం నుండి ప్రపంచాన్ని చూపటం. అది అరుదుగా జరిగే సంఘటన(ల)ను చూపటం కావచ్చు - తరుచుగా జరిగే సంఘటనలను చూపటం కావచ్చును. చదివే వారి దృక్కోణం అలాగే రచయిత దృక్కోణం కానవసరం లేదు.

   అందుచేత ఒక రచన చదువరుల్లో కొందరికి నచ్చవచ్చును.కొందరికి అస్సలు నచ్చకపోవచ్చును.

   తల్లిదండ్రులు తమ పిల్లలకు తమసంపాదనను ఇచ్చితీరాలా? తమ పిల్లలకు మాత్రమే ఇచ్చి తీరాలా?

   ఇచ్చినా అందరికీ సమానంగానే పంచాలా? ఆ పిల్లల అవసరాలకు అనుగుణంగా పంచాలా?

   పెంచుకున్న అబ్బాయి కొడుకు కాకుండాపోతాడా?

   కన్నబిడ్డలకు అమ్ముకుందుకు తప్ప ప్రయోజనం లేని అస్తిని పెంచుకున్న బిడ్డకు ఎందుకు ఇవ్వకూడదూ? అందునా తాము తప్ప మరొక ఆసరాలేని వాడికి ఎందుకు ఇవ్వకూడదు?

   ఒకప్పుడు ఈ భూములూ వ్యవసాయాలూ దండగ అనుకున్న వాళ్ళు మళ్ళా వాటికోసమే తల్లిదండ్రులను చేరి ఆప్యాయత చూపినంత మాత్రాన యోగ్యులైపోతారా? తమపాదాలవద్ద వినయంగా తమను తల్లిదండ్రులనే భావనతోనే సేవించుకుంటున్న వాడికన్నా ఆ కన్నబిడ్దల యోగ్యత ఎలాగు ఎక్కువ?

   సమాజానికి ప్రయోజనం అన్నది సంపదను సద్వినియోగం చేయమని చెప్పమనే సందేశం అనుకోవచ్చునేమో. ఇది సద్వినియోగం కాదని మీరనుకుంటే నా అక్షేపణ ఏమీ లేదు. లోకో భిన్న రుచిః

   మీ అభిప్రాయం మీరు చక్కగా వ్రాసారు. ఇందులో క్షమించమని అడగవలసిన అవసరం లేదు.
   అన్ని రకాల ఆలోచనా విధనాలనూ కలగలుపుకొని ముందుకు సాగటంలోనే సమాజానికి ప్రయోజనం ఉన్నది ఎప్పుడూ.

   మీ విమర్శకు ధన్యవాదాలు.

   తొలగించండి
  2. సామాజిక ప్రయోజనం అంటే ఏమిటో నిర్వచించడం కష్టం. కాల్పనికమయిన రచనలలో సామాజిక ప్రయోజనం లేదా సందేశం ఉండే తీరాలని పట్టు పట్టడం సబబు కాదు.

   తొలగించండి
  3. >>>>తల్లిదండ్రులు తమ పిల్లలకు తమసంపాదనను ఇచ్చితీరాలా?>>>>
   ఇచ్చి తీరాలి. పిల్లలు తమను చూడడం లేదని ఫిర్యాదు చేసే హక్కు తల్లిదండ్రులకు ఉన్నపుడు పిల్లలకూ తండ్రి ఆస్థి మీద హక్కు ఉండాలి.

   >>>>తమ పిల్లలకు మాత్రమే ఇచ్చి తీరాలా?>>>>
   చట్టప్రకారం దత్తత తీసుకున్నట్లు ప్రకటించకుండా ఇతరులకు స్వార్జితాన్ని దానం చేయడం పిల్లలను మోసం చేయడమే !

   >>>>ఇచ్చినా అందరికీ సమానంగానే పంచాలా? ఆ పిల్లల అవసరాలకు అనుగుణంగా పంచాలా?>>>>
   తమ తదనంతరం భాగస్వామితో సహా అందరికీ సమానంగా పంచాలి.

   >>>>>పెంచుకున్న అబ్బాయి కొడుకు కాకుండాపోతాడా?>>>>
   కొడుకయినా,పెంపుడు కొడుకయినా....తల్లిదండ్రులను సేవించుకోవడం కావచ్చు, పిల్లలను, భార్యను చూసుకోవడం కావచ్చు ఎటువంటిది అయినా సరే ! మగవారికి సమాజం మీద,కుటుంబం మీద బాధ్యత ఉండితీరాలి. బాధ్యతలేనివారికి బుద్ధి చెప్పడానికి బాధ్యత లేకుండా ప్రవర్తించనవసరం లేదు. కన్నబిడ్డకు అన్యాయం చేసి పెంపుడు కొడుకుకి న్యాయం చేస్తే అహం చల్లారుతుందేమో కానీ ఆత్మ శాంతించదు.
   >>>>కన్నబిడ్డలకు అమ్ముకుందుకు తప్ప ప్రయోజనం లేని అస్తిని పెంచుకున్న బిడ్డకు ఎందుకు ఇవ్వకూడదూ? అందునా తాము తప్ప మరొక ఆసరాలేని వాడికి ఎందుకు ఇవ్వకూడదు?>>>>
   పిల్లలందరూ ఆస్థిని, వారసత్వాన్ని కొనసాగిస్తారని ఆశించలేము. ఒక తండ్రికి పుట్టిన పిల్లల్లోనే భిన్న మనస్థత్వాలున్నవారు ఉంటారు. పెంపుడు కొడుకుకి కొంత భాగాన్ని ఇవ్వవచ్చు కానీ తన ఆస్థి మొత్తాన్ని దోచి పెట్టడం అన్యాయం ! ఇలా చేస్తే మరొక్కరు కూడా అలాగే చేస్తారు. అలా అంతా చేస్తే వారసత్వం అన్న మాటకు అర్ధమే ఉండదు. కమ్యునిజం నశించిపోతుంది. సమాజం అన్నాక కొంత కట్టుబాటు ఉండాలి. సమాజం అంతా ఒకదారిలోనే నడవాలి. ఎవరిష్టం వచ్చినట్లు వారు చేస్తే సమాజం అడవిలాగా తయారు అవుతుంది. అపుడు ఆస్థి కోసం ఒకరినొకరు చంపుకుంటారు.

   తొలగించండి
  4. >>>>సామాజిక ప్రయోజనం అంటే ఏమిటో నిర్వచించడం కష్టం. కాల్పనికమయిన రచనలలో సామాజిక ప్రయోజనం లేదా సందేశం ఉండే తీరాలని పట్టు పట్టడం సబబు కాదు.>>>>

   నిజమే ! రచయత/త్రులూ తమ తమ భావావేశాలతో కధలనూ, కవితలనూ వ్రాస్తుంటారు. వాటిని చదవగలమే కానీ మీరు ఇలాగే వ్రాయండి అని పాఠకులు అడగలేరు/కూడదు. మాకు కధ/కవిత ఎందుకు నచ్చలేదో చెప్పే అవకాశం ఇపుడు ఉంది. సమాజం లో ఉన్నపుడు చట్టానికి లోబడి నడుచుకోవడమే సామాజిక ప్రయోజనం. చట్టంలో స్వార్జితాన్ని ఏమైనా చేసుకోవచ్చు అని ఉంది కాబట్టి దానం చేసేస్తాను అంటే సమాజం పరిస్థితి ఏమిటి అనేదే ఇక్కడ చర్చ !

   తొలగించండి
  5. నచ్చలేదని చెప్పే మీలాంటి వారి వాదననుండి రచయితలు కొన్ని అలోచనీయాంశాలు గమనించవచ్చును.

   తొలగించండి
  6. @నీహారిక:

   చట్టాలు సాధారణంగా ఆచారాల నుండే వస్తాయి. బహుళ సమ్మతం పొందిన ఆచారాలకు చట్టం ఆమోద ముద్ర వేస్తుంది.

   మారుతున్న సామాజిక క్రమంలో వ్యవస్థలు ఒక్కోసారి తదనుగుణంగా అంతే వేగంగా మారవు. అలాంటప్పుడు వ్యవస్తీకృత మార్పు కోసం ధిక్కార స్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది (i.e. revolution vs. evolution).

   ఇకపోతే ఆస్తి హక్కు అంటేనే సొంత సంపాదనపై పూర్తి హక్కులు ఉండడం (right to spend one's earnings anyway one deems fit). వ్యక్తులు కలిసి సమూహంగా ఏర్పడక ముందే ఈ హక్కు ఉండింది. Natural rights predate formation of collective systems. కృత్రిమంగా ఏర్పరుచుకున్న సమూహాలు, వాటి ఆచారాలు, తద్వారా వచ్చే చట్టాల కంటే సృష్టి రీత్యా హక్కులు ప్రాధమికం (social contract theory).

   ప్రస్తుత కథ మూలాంశం మారుతున్న సమాజంలో ఖాళీ గూడు (empty nest) అనే కొత్త సమస్య రావడం. పాశ్చాత్య దేశాలలో వ్యవస్థ ఈ సమస్యను ఇమడ్చుకోగలిగింది, భారతీయ సమాజంలో మనకు కొత్త. ఇందుకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయి, మాస్టారు చట్టబద్ధమయిన శాంతియుత మార్గం ఎంచుకొని ఘర్షణ minimize చేసారు.

   తొలగించండి
  7. >>>>చట్టబద్ధమయిన శాంతియుత మార్గం ఎంచుకొని ఘర్షణ మినిమిజె చేసారు.>>>>

   చట్టబద్దత ఉంది కాబట్టే పిల్లలు నోరు ఎత్తలేదు. నేను చట్టబద్దత గురించి ప్రశ్నించలేదు.అందరూ అలా చేస్తే ఎలా అన్నదే నా ప్రశ్న!
   వారెన్ బఫెట్ పిల్లలందరికీ తలా వందకోట్లు ఇచ్చి (షుమారుగా అనుకుందాం) మిగతాది గేట్స్ ఫండేషన్ కి వ్రాసారు.అపుడు అది పిల్లలమీద ద్వేషంతో చేసినది అని ఎవరూ అనలేరు.ఇక్కడ పిల్లల మీద ద్వేషంతో చేసిన పని అని స్పష్టంగా తెలుస్తుంది.తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డల మీద తన బాధ్యత ఏమీ ఉండదా ? వారిని పెంచిన విధానంలో లోపాలు ఉన్నాయని తెలియడం లేదా ? తన మీద తనే శిక్ష వేసుకున్నట్లు మీకనిపించడం లేదా ? తన స్వార్జితాన్ని ఇతరులకు దానం చేయడం ద్వారా సమాజానికి కుటుంబానికీ ఏం చెప్పదలుచుకున్నారు ?

   తొలగించండి
 4. మీ కధ చదువుతుంటే "Shathamanam Bhavathi" సినిమా గుర్తుకొస్తుంది సర్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవునా? ఐతే ఆ సినిమాను ఒక సారి చూస్తాను. You tube లో దొరుకుతుం దనుకుంటాను.

   తొలగించండి
 5. మరీ అంతగా ఇలా లేదేమోనండి ఇప్పుడు. చాలామంది వెనక్కి వచ్చేస్తున్నారని విన్నా గూగిల్, అమెజాన్ లాంటి కంపెనీలు కూడా ఇండియా వచ్చేస్తున్నాయి కనక.

  మరో విషయం ఇల పిల్లలిద్దరూ అమెరికా వెళ్ళిపోతే తల్లి తండ్రులు కూడా వెళ్ళిపోతున్నారు లేదా ఇద్దరూ వెనక్కి వచ్చేస్తున్నారు. అయినా కధ బానే ఉంది కానీ కొస మెరుపు లేదు కధలో. వీరేశం 'ఆ డబ్బులన్నీ నాకొద్దు, అనాధాశ్రమానికి ఇచ్చేయండి, నేను మామూలు ఉద్యోగం చూసుకుంటా, లేకపోతే నా జీవితం నేను చూసుకోగలను అని ఉంటే కాస్త బాగుండేదేమో? మరో విషయం వ్రాతలో. మొత్తం కధంతా (దాదాపుగా) థర్ద్ పెర్సన్ చెప్తున్నట్టూ గడిచింది, ఇద్దరి మధ్యన డయలాగుల్లా ఉంటే బాగుంటుంది.

  ఏది ఏమైనా డాలర్ల మీద ఆపోహ, సాఫ్ట్ వేర్ అంటే అదేదో బ్రహ్మ విద్య అనేవి మాత్రం అలాగే ఉన్నాయి జనాల్లో. మేరా భారత్ మహాన్ మాత్రం పబ్లిక్ రోడ్డు మీద విసర్జన కార్యక్రమం లాగానే ఉంది. స్వఛ్ఛ భారత్ ఏమైందో ఆ పరమేశ్వరుడికే ఎరుక. భూముల రేట్లు పెరిగినా, ఏది ఏమైనా, ఏ పార్టీ నాయకులకీ రైతు జీవితాలని బాగు చేద్దామనీ, అసలు దేశానికున్న దౌర్భాగ్యపు ఇంఫ్రా స్ట్రక్చర్ బాగు చేద్దామనే ఆలోచనే రాకపోవడం శోచనీయం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇదే కథను రకరకాలుగా వ్రాయవచ్చును కదండీ.

   మీరన్నట్లు కొసమెరుపులువేసి కూడా చెప్పవచ్చు. కాని ఆదృష్టితో వ్రాయలేదంతే.

   అలాగే మీ రన్నట్లు కొంత సినిమాటిక్ ముగింపూ ఇవ్వచ్చును వీరేశం చేత నాకొద్దులెండి అనిపించి. కాని అదంతా అవసరం అనిపించలేదు.

   ఈ కథలో ఇంకా కొన్ని కోణాలున్నాయి. ఎవరన్నా ప్రస్తావించితే వాటి గురించి మాట్లాడుకోవచ్చును.

   తొలగించండి
 6. అమెరికా పిల్లలు అనకాపల్లి పెద్దలు ఈ సుత్తి కథలు ప్రతివారం ఈనాడు ఆదివారం లో వేస్తుంటారు. మళ్లీ అవసరమా సార్.

  రిప్లయితొలగించండి
 7. బాగుందండి. ప్రస్తుతసమాజంలో జరుగుతున్న నాటకాలే. అమెరికాలో సంపాదనలు ఎక్కువైనకొద్దీ ఇండియాలో ఆస్తిమీద వ్యామోహం కూడా ఎక్కువవుతుంది. ఆస్తిమీద ఉన్న కళ్ళు తల్లిదండ్రులమీద లేవు. మీరు కథని బాగానే ఆవిష్కరించేరు. పెద్దవయసులో తమని ఆదుకున్న పిల్లవాడిని దత్తుడు గా ఆదరించడంలో ఔచిత్యం ఉంది.

  రిప్లయితొలగించండి
 8. ఇది ప్రస్తుతం మన దేశంలోని ప్రతీ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్య

  చివరి రోజుల్లో ఎవరైతే వృద్ధుల మంచీ చెడ్డలు
  చూసుకుంటారో వాళ్ళకే తమ స్వార్జితాన్నివ్వడం నాయ సమ్మతం
  శ్యామలీయం గారూ
  మీ ముగింపు నాకు బాగా నచ్చింది

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు వసంత కిశోర్ గారూ.
   (ఈ రోజుల్లో రమేశ్ అని కాక రమేష్ అనీ కిశోర్ అని కాక కిషోర్ అని వ్రాయటం ఒక ఫేషన్ స్థాయిని దాటి సర్వసాధారణం ఐపోయినా మీరు చక్కగా కిశోర్ అని వ్రాయటం మిక్కిలి ఆనందం కలిగించింది.)

   తొలగించండి
  2. బాగా చెప్పారు శ్యామలరావు గారూ 👌. ఇటువంటివే - వెంకటే..ష్వ..ర రావు, ష్రీ..నివాస రావు, ష..ర్మ, షా..స్త్రి, ష్యా..మల, షా..రద, షు..క్రవారం, ష..నివారం, ఆకా..షం, ఆ..ష - వగైరాలు సామాన్యమైపోయాయి. కిశోర్ గారిని మెచ్చుకోవాలి.

   నాకిప్పటికీ బాగా గుర్తు ... ఈ “ష” ఫాషన్ రాని ముందు రోజుల్లో సిమ్లా ని సిమ్లా Simla అనే వ్రాసేవారు, ఇప్పుడు Shimla అయింది; నాసిక్ ని Nasik అనే వ్రాసేవారు, ఇప్పుడు Nashik అయింది; Srivastav కాస్తా Shrivastav అయింది. 1980 ల్లోనే సామర్లకోట (సామాల??) లక్ష్మీ రాజ్ అని ఒకరు ఒక వారపత్రికలో “ష పలకడం ఫాషనా, రోగమా?” అని ఒక పేజీడు వ్యాసం వ్రాశారు. ఇక ఇప్పుడు ఆ అలవాటు బాగా పాతుకుపోయింది .. చాలామటుకు సినిమావాళ్ళ వలన అని నా అభిప్రాయం. చిన్నపిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నారు .. అంటే తరవాత తరం కూడా ఇలాగే పలుకుతారన్నమాట 😢.

   తెలుగు భాషలో మూడు వేరు వేరు శబ్దాలున్నాయి - స, శ, ష. ఒక్కోదాన్నీ పలకవలసిన పద్ధతి ఉంది. ఇప్పుడు సర్వం జగన్నాథం (ఎందుకంటున్నానంటే .. సినిమా ని షినిమా, సెప్టెంబర్ ని షెప్టెంబర్, డిసెంబర్ ని డిషెంబర్, సోమవారాన్ని షోమవారం అని పలికేవాళ్ళు కూడా చాలామంది తగులుతున్నారు ఈ రోజుల్లో 🙁).

   తొలగించండి
  3. మా అబ్బాయి పేరు "శేఖర్" అంటే సేఖర్ లాగా అనిపిస్తుంది.అందుకే శేఖర్ అని వ్రాస్తున్నాం.
   పిలిచేటపుడు షేఖర్ అని పిలుస్తాం. ప్యాషన్ కోసం కాదండీ కొన్ని పేర్లంతే....రమేశ్, కిశోర్ అంటే బాగోగోదేమోనండీ ?

   తొలగించండి
  4. @వసంత కిశోర్ గారు,
   వంశాభివృద్ధి, వంశవృక్షం, పాణిగ్రహణాలూ, నాతిచరామి, గుప్పెడు పేలాలూ,అగ్నీ అర్భాటమూ ఇవన్నీ ఎందుకండీ దండగ ?

   అనాధాశ్రమాల్లో కూడా వృద్ధులకు పిల్లలను దత్తతకి ఇవ్వరు.పిల్లలేమయినా మనల్ని కనమన్నారా ? ఎవరయితే చూస్తారో వారికే ఆస్థి ఇచ్చేస్తాము అని అంటే పిల్లలతో బేరాలా ? వ్యాపారంలో కూడా లాభనష్టాలకు గ్యారెంటీ లేదు.ప్రేమని పెట్టుబడిగా పెట్టాలి....మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.నేను ప్రేమించాను కాబట్టి నువ్వు కూడా తిరిగి ప్రేమించు అని బెదిరించడం నాకు నచ్చలేదు.

   తొలగించండి
  5. ఇది ప్రస్తుతం మన దేశంలోని ప్రతీ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్య.... నిజమే, అందుకోసమే అందరం సిద్ధంగా ఉండాలి. ఆస్థులను ఏర్పాటుచేసుకున్నది అందుకోసమేగా ? ఇపుడు వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి.

   పేదల గురించే ఆలోచించాలి. జబ్బుపడి మంచాన పడ్డ నిరుపేదలను ప్రభుత్వాలు ఆదుకోవాలి.

   తొలగించండి
  6. నీహారిక గారు,
   అగ్నీ అర్భాటంఊ దండుగ అనుకొంటూ కొందరు ఉండవచ్చును. అసలు తల్లిదండ్రులు మనకెందుకు దండుగ అని కూడా కొందరు అనుకొంటూ ఉండవచ్చును. రెండు రకాల వాళ్ళనీ చూస్తున్నాను సమాజంలో.

   పిల్లలతో పెద్దల బేరసారాలు తప్పే. పెద్దలతో పిల్లల బేరసారాలూ టక్కులూ కూడా తప్పే. తేడాలేదు.

   ఈ కథలో బెదిరింపు ఉందనుకుంటే ఉంది - లేదనుకుంటే లేదు.

   తొలగించండి
  7. >>>>నా అభిప్రాయంలో నాలుగు భాగాలు చేయడం సబబు - ఇద్దరు కొడుకులకు తలొక పావు, భార్య కొక పావు (ఆవిడ తదనంతరం ఆ భాగం కూడా తన స్వంత పిల్లలకే చెందేట్లు), పాలేరుకు ఒక పావు - అలా చేస్తే కడుపు మంట తక్కువగా ఉండచ్చు.>>>

   ఎవరికి ఎంత కడుపు మంట ఉన్నదీ ఇక్కడ చర్చ కాదు. ఇక్కడ మాట్లాడుతున్నది జరిగిపోయిన పంపకం గురించి మాత్రమే కాని జరగవలసిన పంపకం గురించి కాదు.నేను ప్రశ్నించేది జరగబోయే పంపకాలు కూడా ఇలానే ఉండాలనా రచయత ఉద్దేశ్యం ? అని అడుగుతున్నాను. జరిగిపోయిన దానిని మార్చలేము. రచయత ఉద్దేశ్యం తెలుసుకోవాలని అడుగుతున్నాను.

   అగ్నీ ఆర్భాటం దండగ అన్నది నా ఉద్దేశ్యం కాదు.పిల్లలకి ఆస్థులిచ్చే ఉద్దేశ్యమే లేనపుడు ఈ పెళ్ళిళ్ళూ ఆర్భాటాలూ దండగ కదా అని అంటున్నాను. పిల్లలు పుట్టగానే ఎవరికో ఒకరికి పెంపకానికి ఇచ్చేస్తే వారే ఆస్థులు ఇచ్చుకుంటారు కదా ? ఈ కధలో నీతి ఇలాగే ఉంది.

   తొలగించండి
  8. "పిల్లలకి ఆస్థులిచ్చే ఉద్దేశ్యమే లేనపుడు" అన్న మాట ఆలోచనీయం. ఈ కథలో అటువంటిది చెప్పబడలేదే. అలాగే "పిల్లలు పుట్టగానే ఎవరికో ఒకరికి పెంపకానికి ఇచ్చేస్తే వారే ఆస్థులు ఇచ్చుకుంటారు కదా ?" అన్నమాట కొంచెం ఆవేశపూరితంగానూ ఆందోళనాభరితంగానూ అనిపిస్తున్నదండీ. 'కన్నబిడ్డలకు ఏమీ ఇవ్వద్దూ పెంచుకున్నవారికే అన్నీ ఇవ్వాలీ' అన్న నినాదం ఏమీ ఇవ్వటం లేదండీ యీ కథ. ఈకథలో పరిస్థితులు ఎలా వచ్చాయీ అన్నదాని బట్టి తల్లిదండ్రులు వాళ్ళకు సబబు అనుకున్న నిర్ణయాన్ని వారు చేసారు. అది అందరకూ సబబు అనిపించాలని లేదని ఒప్పుకుంటాను. ఐతే కన్నబిడ్డలు కసాయీల్లాగా ఉన్నాసరే వాళ్ళకు తల్లిదండ్రులపైనా వాళ్ళ సంపాదనలపైనా సర్వాధికారాలు జన్మహక్కులుగా నిర్ద్వంద్వంగా సంక్రనించాలన్నది మీ అభిప్రాయం ఐన పక్షంలో అది అంత సమంజసం కాదని అనుకుంటున్నాను. మీరు నాతో యీ విషయంలో ఏకీభవించాలని పట్టుబట్టలేను. మీ అభిప్రాయం మీది.

   తొలగించండి
  9. 2.పిల్లలు తమను చూడడం లేదని ఫిర్యాదు చేసే హక్కు తల్లిదండ్రులకు ఉన్నపుడు పిల్లలకూ తండ్రి ఆస్థి మీద హక్కు ఉండాలి.
   2. తన స్వార్జితాన్ని ఇతరులకు దానం చేయడం ద్వారా సమాజానికి, కుటుంబానికీ ఏం చెప్పదలుచుకున్నారు ?

   తొలగించండి
  10. 1. ఈ కథలో పిల్లలు తమను చూడడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారన్నది సరి కాదు. వారు అడిగినప్పుడు వివరణ ఇచ్చారే కాని, వారిని పల్లెత్తు మాట అనలేదే.
   2. స్వార్జితాన్ని అర్హులకు ఇవ్వటం సబబు అని కథలో తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. తమబిడ్దలు అర్హులైన పక్షంలోనో వారికీ అవసరం ఉన్న పక్షం లోనో వారికీ వాటా ఇచ్చే వారేమో. పాశ్యాత్యదేశాల్లో కూడా కుబేరులైనవారు ఆస్తి అంతా మా కన్నబిడ్డలకే అనటం లేదని గమనించండి.

   తొలగించండి
  11. వారెన్ బఫెట్ పిల్లలందరికీ తలా వందకోట్లు ఇచ్చి (షుమారుగా అనుకుందాం) మిగతాది గేట్స్ ఫండేషన్ కి వ్రాసారు.అపుడు అది పిల్లలమీద ద్వేషంతో చేసినది అని ఎవరూ అనలేరు.ఇక్కడ పిల్లల మీద ద్వేషంతో చేసిన పని అని స్పష్టంగా తెలుస్తుంది.తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డల మీద తన బాధ్యత ఏమీ ఉండదా ?

   తొలగించండి
  12. నీహారిక గారు,
   మీరు విబేధించటాన్ని అర్థం చేసుకోగలను. మీకు నచ్చనంత మాత్రాన కథను తొలగించటం వీలుపడదు. అలాగైతే ఏ రచన కూడా నూటికినూరు మందికీ నచ్చదు. వ్రసేది ప్రతిదీ అందరికీ నచ్చితీరాలన్న నియమంతో ఎవరూ వ్రాయలేరు. అలాంటి నియమం ఉన్నపక్షంలో ఎవరూ ఏదీ వ్రాసే వీలే ఉండదు. కొందరికి ఈ ముగింపు నచ్చటాన్ని కూడా గమనించండి దయచేసి.

   మీరు ప్రశ్న వేస్తూనే ఉన్నారు - అదే ప్రశ్న. రక్తం పంచుకు పుట్టిన బిడ్డల మీద వారికి తమతమ కాళ్ళపైన నిలువగల శక్తి యుక్తులను సమకూర్చటం వరకే తల్లిదండ్రుల బాధ్యత. ఆతల్లిదండ్రులకు వార్ధక్యంలో అండగా ఉండటం పిల్లల బాధ్యత. ఈ కథలో రాఘవయ్యదంపతులు తమ బాద్యతలు సరిగా నిర్వహించారా లేదా అన్నది సుస్పష్టంగానే ఉంది. తమ బాధ్యతల పట్లవారి బిడ్డలకు శ్రధ్దలేకపోవటమూ అంటే స్పష్టంగా ఉంది. అవునా కాదా? ఇంక దేనికీ చర్చ అంటారు?

   మరొక మాట. ఒక కథలో వ్యక్తుల అభిప్రాయాలూ ప్రవర్తనలూ అన్నీ రచయితకు ఆపాదించటం అంత సబబు కాదు. ఈ కథలో పాత్రల తరపున నేను విపులీకరించ గలిగినంత చెప్పాను. కథను కథలాగే స్వీకరించండి. ఆలోచనీయాంశాల మీద తప్పక చర్చించ వచ్చును. అందుకే మీతో విపులంగా చర్చించినది.

   తొలగించండి
  13. మీ కధను తీసివేయమని నేను అడగడం లేదు.ఆ తల్లితండ్రులు చేసింది తప్పు అని బలంగా చెపుతున్నాను.తల్లిదండ్రులను చూడకపోయినా బిడ్డలను ఈ భూమి మీదకు తీసుకువచ్చినందుకు వాళ్ళకి తమ వారసత్వాన్ని అందించడం వారి కర్తవ్యం అని చెపుతున్నాను.మాలాంటి వాళ్ళు చెపితే మీలాంటి వాళ్ళు వినరు.శంఖంలో పోస్తేనే తీర్ధం అంటారు.

   తొలగించండి
  14. నీహారిక గారు,

   మీ అభిప్రాయం మీది. అది గమనించాను. గౌరవించాను. మీ వాదనను ఇక్కడ స్వేఛ్చగా వినిపించారు. ఆ విషయం మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను.

   ఇకపోతే "మాలాంటి వాళ్ళు చెపితే మీలాంటి వాళ్ళు వినరు" వంటి మాటలు అవసరం లేదని గ్రహించ గలరు. శేషం కోపేన్ పూరయేత్ అన్నట్లుగా మాట్లాడకండి దయచేసి.

   మీరు భిన్నాభిప్రాయాన్ని వినిపించటాన్ని నేను వ్యతిరేకించలేదు కదా. ఇంక వివాదం ఏముంది? మీకు నచ్చలేదు కాబట్టి ఆ కథ వ్రాయటం అపరాథం అని నేను మీకు క్షమాపణలు చెప్పాలని ఆశిస్తున్నారా? మీరు మీ వాదనను నిరంతరాయంగా కొనసాగిస్తూ పోవటం ద్వారా ఏమి సాధించ దలచుకున్నారో బోధపడటం లేదు. మీ అభిప్రయాన్ని ప్రకటించటమూ అవసరమనుకున్న వివరణలు ఇవ్వటమూ జరిగింది కాబట్టి మీతో ఈ చర్చను నిలిపివేస్తున్నాను. దయచేసి అపార్థం చేసుకోవద్ధని విజ్ఞప్తి.

   తొలగించండి
 9. “పంపకం” కథ మొత్తంమీద బాగుంది.

  పైన ఒకరు అన్నట్లుగా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల వెనకాల అమెరికా వెడుతున్నారన్నది నిజమే కానీ ఆ దేశంలో స్ధిరనివాసం ఉండిపోయేవారు ఎంతమంది? అదిన్నూ అంత్యదశ వరకూ అక్కడే ఉండిపోవడం అరుదు (ఏదో యద్దనపూడి సులోచనా రాణి గారి లాగా విజిటర్ గా వెళ్ళి అనుకోకుండా హఠాత్తుగా అక్కడే కడతేరడం వేరే సంగతి). బయటకు వెళ్ళాలంటే పిల్లల మీద ఆధారపడాలి. మందూమాకూ అవసరమైతే పిల్లలు తెచ్చివ్వాలి. ఖర్చుకి చేతిలో నాలుగు డాలర్లు ఉండాలంటే పిల్లల్ని అడగాలి. ఇంతగా ఆధారపడాల్సి ఉండడం నచ్చదు కదా. కాబట్టి అలవాటైన పరిసరాల్లో అలవాటైన బతుకే నయమని వెనక్కి వచ్చేస్తారు. మీరూ అమెరికాలో ఉండి వచ్చారు కదా, మీకు తెలియనిదేముంది.

  అదే మనదేశంలోనే స్వంతూర్లో కాకపోయినా మరే ఊరిలోనైనా పిల్లలు ఉద్యోగం చేస్తుంటే తల్లితండ్రులకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ఆస్తులు చూసుకుంటూ స్వంతూర్లోనే ఉండిపోతే మరీ బాగుంటుంది. కానీ అంత చదువులు చదివిన వాళ్ళ దగ్గర్నుంచి అటువంటి సర్దుబాటు ఆశించడం ఒక రకంగా చూస్తే తల్లిదండ్రులకు కరక్ట్ కాదు. విద్యాధికులైన ఆ పిల్లలకు ఎలాగూ నచ్చదు. పైగా విదేశాలకు వెళ్ళిపోయిన తమ స్నేహితులును చూసి తామూ అలాగే చేస్తే బాగుంటుందనుకుంటారు - దానికి తోడు వెనకాల ఇల్లాలి పోరు కూడా ఉండచ్చు కదా. ఏతావాతా నేను చెప్పేదేమిటంటే ఈ ఆధునిక జీవనవిధానం గణనీయంగా మారుతుందని నాకయితే అనిపించడం లేదు, ఇది ఇలాగే సాగుతుండే సూచనలే ఎక్కువ. దీన్నేదో మార్చాలనే ప్రయత్నాలు కూడా వ్యర్థమవుతాయనే నా అంచనా.
  ఈ అంశం ఆధారంగా “సీతారామయ్య గారి మనుమరాలు” అని ఎ.ఎన్.ఆర్ నటించిన ఒక సినిమా వచ్చింది - ముగింపు కాస్త సినిమాటిక్ గా ఉంటుంది కానీ మొత్తం మీద బాగా తీసిన సినిమా.

  మీ కథ ముగింపులోని అసలు సంగతి .. ఆస్తుల పంపకం చేసిన పద్ధతి ఒక రకంగా కక్షసాధింపా అనిపించక తప్పదు. ఎంతైనా స్వంత పిల్లల పట్ల ఏ తండ్రి అయినా అలా ఉంటాడంటారా? నిజమే, చివరి రోజుల్లో తమ బాగోగులు చూసిన వాడిని కూడా మర్చిపోకూడదు. కాబట్టి నా అభిప్రాయంలో నాలుగు భాగాలు చేయడం సబబు - ఇద్దరు కొడుకులకు తలొక పావు, భార్య కొక పావు (ఆవిడ తదనంతరం ఆ భాగం కూడా తన స్వంత పిల్లలకే చెందేట్లు), పాలేరుకు ఒక పావు - అలా చేస్తే కడుపు మంట తక్కువగా ఉండచ్చు.

  నాకీ ఆస్తి వద్దు, ఇదంతా అనాథాశ్రమానికి ఇచ్చేస్తాను అని ఆ పాలేరు గనక అంటే ఏదో సినిమాలో చిరంజీవి చేసినట్లు సినిమాటిక్ గా ఉంటుంది. అసలలా అనే అవకాశాలు కూడా దాదాపు శూన్యం. పైగా ఆ ముసలావిడ భాగం కూడా తనకే చెందుతుందని తెలుసుకున్న తరువాత ఆవిడకి హాని తలపెట్టే ప్రమాదం కూడా కొట్టిపారెయ్యలేం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కథ వీరేశం గురించి కాదు. నిజానికి అతను ఇందులో పాత్ర కూడా కాదు, కేవలం ఒక కథా ప్రక్రియ (plot device) మాత్రమే.

   తొలగించండి
  2. వీరేశం ఒక కథాపరికరం అని జై గారి ఉద్దేశం. అలా అభిప్రాయ పడటం సబబే.

   తొలగించండి
  3. సవరణకు ధన్యవాదాలు మాస్టారూ.

   ఈ కథ వీరేశం గురించి కాదన్న నా అభిప్రాయం విమర్శ కాదు. "సమన్యాయం" కోసమని అతని గురించి ఇంకొంచం రాసి ఉండుంటే కథలో పట్టు & వేగం తగ్గేవి, దీనితో మీరు చెప్పదలిచిన విషయాలు కాస్తయినా డైవర్ట్ అయ్యేవి.

   తొలగించండి
 10. విన్నకోట, వారూ

  ఆసక్తిదాయకమైన పాయింట్లు లేవనెత్తారు. సంపదను అవసరం ఉన్నవాళ్ళకు ఇవ్వటం ఒకవిషయం, హక్కులాగా భావించే వాళ్ళకు ఇవ్వటం ఒక విషయం. ఈ విషయంలో రకరకాల న్యాయనిర్ణయాలు ఉంటాయి. వాటిమంచిచెడ్డల్ని నిక్కచ్చిచేసి చెప్పలేం. ఏ విధమైన నిర్ణయం పైన నేనా అక్షేపణలూ ఆమోదాలూ కూడా సమాజంలో సహజం. కక్షసాధింపు అంటారా కొందరు - కానివ్వండి అటువంటీ అవకాశం ఉందని ఆ పంచిన పెద్దమనిషులకు తెలిసే ఆపని చేసారంటే వాళ్ళ కారణాలు వాళ్ళవి.

  ఇక వీరేశం విషయం. అతను తన పరిమితుల్లోనే ఉన్నాడు కానీ యజమాని కుటుంబసభ్యులలో ఎవరినీ ఎదిరించి మాట్లాడడు. అతని నోటి వెంట వచ్చిందిగా ఈ కథలో ఉన్నది ఒకే వాక్యం - అదీ జనాంతికం గానే. అతడు అమిత భక్తివిశ్వాశాలున్నవాడా ఆషాఢభూతివంటి వాడా అంటే ఆవిషయమై కథలో ఏంమీ ఆధారాలు లేవు. జనం ఊహకో కాలానికో దాన్ని వదలవలసిందేను.

  ఆధునిక జీవన విధానం కొన్ని పాతసమస్యలను పరిష్కరించింది. ఉదాహరణకు అత్తాకోడళ్ళమధ్య పోరువంటివి. ఆపోరు నేడు టీవీసీరియళ్ళలో తప్ప సమాజంలో స్వల్పాతిస్వల్పం. కొన్ని కొత్తససమస్యలను సృష్టించింది. అవినేడు మనకు అనుభవంలోనే ఉన్నాయి. కాని వాటిలో కొన్ని కాలక్రమేణా మనకు అలవాటైపోవచ్చును, కొన్ని మరింత దుర్భరం కావచ్చును. మెల్లగా తెలుస్తుంది.

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.