31, డిసెంబర్ 2013, మంగళవారం

మా తెలుగుతల్లికి మల్లెపూదండ

శ్రీ శంకరంబాడి సుందరాచారిగారు రచించిన ఈ పాటను టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో ఇక్కడ వినండి.


ఈ వీడియోలో ఉన్న మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాటను సూర్యకుమారిగారు 1985వ సంవత్సరంలో బర్మింగ్‌హామ్‌లో శ్రీరంగారాయ మెడికల్ కాలేజీ పాత విద్యార్థుల పునస్సమాగమం సందర్భంగా జరిగిన ఉత్సవంలో గానం చేసారు.
ఈ‌ పాట ఆంధ్రప్రదేశప్రభుత్వ అధికారిక గీతం.

ఈ‌ పాట పూర్తి పాఠం ఇదిగో:


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం


  ఈ పాట ఒరిజినల్ రికార్డింగ్ అంటూ మరొక వీడియో కూడా కనిపించింది:




అలాగే, బాలూగాత్రంలో ఇదే మా తెలుగు తల్లికి పాట కూచిపూడి నృత్యాభినయ యుక్తంగా:



ఈ పాటకు క్రొత్త వరస కూడా ఉన్నది! చూడండి: 



ఇంత చెప్పుకున్నాక మరొకటీ చెప్పుకోవాలి మరి. ఈ పాటకు తెలంగాణావాదుల పేరడీ చూడండి. 




(టంగుటూరి సూర్యకుమారిగారి గురించి వికీపీడియాలో చదవండి.) (శంకరంబాడి సుందరాచార్యులవారి గురించి వికీపీడియాలో చదవండి.)

25, డిసెంబర్ 2013, బుధవారం

విద్యుత్తు వినియోగమూ - పొదుపూ.

ఈ రోజున  ఇంట్లో రోజుకొక యూనిట్ విద్యుత్ పొదుపు చేయటం ఎలా?   అనే టపా చూసాను విజ్ఞాన శాస్త్రము  బ్లాగులో.  మంచి విషయం స్పృశించారు.  మంచి పొదుపు చిట్కాలు చెప్పారు.

మన వాడుతున్న విద్యుత్తును ఒక్కో ఉపకరణమూ ఏ విధంగా వినియోగిస్తోందో తెలుసుకోవటమూ ఈ విషయంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ఒక విద్యుదుపకరణం (electrical equipment) రేటింగ్ W వాట్లు అనుకుంటే,  సగటున దానిని మనం రోజుకు H గంటలు వాడుతున్నాం అనుకుంటే, ఒక సంవత్సర కాలంలో అది ఖర్చుచేసే విద్యుత్తు విలువ W x H x 365.25 వాట్లు అవుతుంది.  ఒక వేయి వాట్ల వాడకం అనేది ఒక యూనిట్‌గా లెక్కిస్తారు మీటరు రీడింగులో.

కాబట్టి సంవత్సరంలో మనం ఈ విద్యుదుపకరణం ద్వారా కర్చుచేసే యూనిట్లు W x H x 0.36525

మనకు నెలలో కాల్చే యీనిట్ల విలువ తెలుసుకోవటం ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది కదా.  ఈ విలువ  W x W x 0.36525 / 12 = W x H x .030437

ఈ గణితం పైకి పెద్దగా ఆసక్తి దాయకంగా కనిపించదు.  కాని దీని నుండి సులభంగా మనం గుర్తుపెట్టుకోవటానికి మార్గం కనుక్కోవచ్చును చూడండి.

పైన ఇచ్చిన గణితంలోని .030437 అనే విలువను  33 చేత గుణిస్తే 1.004421 వస్తుంది.  దశాంశ భాగం చిల్లర చాలా చిన్నది కాబట్టి దాదాపుగా ఈ విలువని   1 అనుకోవచ్చును.

అంటే?

W వాట్ల ఉపకరణాన్ని రోజుకు 33 గంటలు చొప్పున వాడితే (రోజుకు అన్ని గంటలా అని అనకండి, ప్రస్తుతానికి) ఒక నెలలో మనం కాల్చే విద్యుత్తు W యూనిట్లు అన్నమాట.

ఈ బండగుర్తు సహాయంతో సులభంగా మన ఇంట్లోని ప్రతి విద్యుదుపకరణం మీద నెలకి ఎన్ని యూనిట్ల విద్యుత్తును కర్చు చేస్తున్నదీ లెక్క వేయ వచ్చును.

ఉదాహరణకు ఒక సీలింగ్ ఫాన్ ఉన్నది.  దాని వాటేజ్ 72W అని తెలుసు అనుకుందాం.  ఆ ఫానును రోజుకు  8 గంటల చొప్పున వాడితే నెలకు మనం 72 x 8 / 33 = 17.45 యూనిట్లు కాల్చుతున్నాం అన్నమాట.(మనం ఖచ్చితంగా లెక్కిస్తే 72 x 8 x 365.25/12000 = 17.53  యూనిట్లు వస్తుంది)

మరొక ఉదాహరణ కోసం 2000 W రేటింగ్ ఉన్న గీజర్ వాడకం చూదాం.   ఆ గీజర్ని ప్రతిరోజూ ఒక గంట సేపు వాడితె మనం  ఒక నెలలో 2000 x 1 / 33 = 60.61  యూనిట్లు కర్చు చేస్తున్నామన్న మాట. (మనం ఖచ్చితంగా లెక్కిస్తే 2000 x 1 x 365.25 = 60.88 యూనిట్లు వస్తుంది)

పై ఉదాహరణలో వచ్చిన తేడా అలా 1.004421ని  1గా తీసుకోవటం వలన వచ్చిన చిన్న వ్యత్యాసం.  స్వల్పాంతరత్యశ్చ బహూపయోగాః. తత్యజ్యతే తన్నతు దూషణాయ అని ఒక సూక్తి. అంటే చిన్న తేడా వలన హెచ్చు ఉపయోగం ఉంటే అలా గ్రహించటం మంచిదే అని అర్థం.

మరొక విషయం.  ఒక 100W ఉపకరణం రోజుకు 10గంటల చొప్పున వాడితే ఒక కాలెండరు నెలలో ఎన్ని రోజులో అన్ని యూనిట్ల విద్యుత్తు కాల్చుతుంది.  ఆ నెలలో రోజులు 31 ఐతే 31 యూనిట్లు, రోజులు 30 ఐతె 30 యూనిట్లు, రోజులు 28 ఐతే 28 యీనిట్లు. ఎందుకంటే 100W ను పదిగంటలు కర్చుచేస్తే ఒక యూనిట్ కాబట్టి.  కాని మనం పైన లెక్కించిన విధానం ప్రకారం  100 x 10 x 365.25 / 12000 = 30.4375 యూనిట్లు అవుతుంది. ఇది సంవత్సరంలో సగటు నెల విలువ అని గ్రహించ గోరుతాను.  మన చేసే ఉజ్జాయింపు లెక్కప్రకారం ఐతే, 100 * 10 / 33 = 30.3030 యూనిట్లు వస్తుంది.   పెద్దగా చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదు.

ఈ క్రింద ఇచ్చిన పట్టిక గుర్తుపెట్టుకోవటానికి సులభంగా ఉంటుంది.  (ఉపకరణం వాటేజ్ W అనుకుంటే..ఉజ్జాయింపుగా విద్యుత్తు ఖర్చు)

రోజుకు వాడకం గంటల్లో నెలకు కరిగే యూనిట్లు ఏడాదికి కరిగే యూనిట్లు
 1:00 W/33 3W/8
 2:45 W/12 W
 5:30 W/6 2W
 8:15 W/4 3W
11:00 W/3 4W
13:45 5W/12 5W
16:30 W/2 6W
19:15 7W/12 7W
22:00 2W/3 8W
24:45 3W/4 9W



వగల ప్రేమలు?






[ ముందుమాట: నిన్న శ్రీగుండువారు వగల ప్రేమలు చాలు అంటూ ఒక ఖండిక ప్రకటించారు. అందులో వారు సీమాంధ్రవాళ్ళు నీలంవారి శతజయంతిని ఘనంగా నిర్వహించి పీవీగారి వర్థంతిని ఏమాత్రం పట్టించుకోకుండా అవమానించారని ఆరోపిస్తూ "ఆ మహాత్మునికి జయంతి యంత ఘనము!యీ మహాత్ముని వర్థంతి యింత వెగటె?" అని అన్నారు.

వారి ఆ టపాకు నా స్పందన పంపితే అందులో బహుశః వారి దృష్టిలో సద్విమర్శాగౌరవానికి నోచుకోకపోవటం వలన కాబోలు ఆ నా స్పందనను ప్రకటించలేదు.  అలా జరగటం సాధారణవిషయమే కాబట్టి, అ స్పందన ప్రతిని అక్షరదోషాల వంటివి దిద్ది, చివరన ఒకటి రెండు వాక్యాలు చేర్చి ఒక టపాగా వేస్తున్నాను ఈ‌ బ్లాగులో.]

బాగుంది.  ఆడిపోసుకోవటం ఆపి, ఒక్క ముక్క ఆలకించండి.

నిజానికి దివంగత మహనీయులైన నీలంవారిని గాని పీవీగారిని గాని ఎవరు కించపరచటమూ హర్షణీయం కాదు.

మాజీ రాష్ట్రపతి నీలంవారి శతజయంతి మీరు అనుకుంటున్నంత ఘనంగా జరగనేలే దన్నది పచ్చినిజం.  ఆ వేడుకేదో అంతంతమాత్రంగానే జరిగినా, పీవీగారి వర్థంతి అంతమాత్రంగా కూడా జరగలేదని మీ అనుమానం కావచ్చును.

పీవీగారిమృతి సందర్భంగా స్వంతపార్టీకి ఎంతో‌ఘనకీర్తి తెచ్చిపెట్టిన ధీవిశాలుడైన పీవీగారికి కాంగ్రెసుపార్టీవారు ఎంత ఘనంగా అంతిమమైన వీడ్కోలు పలికారో తలుచుకుంటే ప్రతితెలుగువాడి హృదయమూ బాధతోనూ కోపంతోనూ ఊగిపోతుంది.  ఘోరావమానంగా జరిపించారు కాంగ్రెసువారు ఆ మహానేతకు వీడ్కోలు.  ఇదంతా సోనియమ్మగారి ఆధ్వర్యంలోనే జరిగింది.  కాదని బుకాయించే అమాయకులుంటారని అనుకోను.  ఆ విధమైన దుష్ప్రవర్తనతో పీవీకి అవమానం జరిపించిన సోనియాను నేడు నెత్తిన పెట్టుకొని దేవతలాగా కొలుస్తూ, ఆమెకు గుడులూ గోపురాలు కడుతూ తెలంగాణావీరజననాయకమ్మన్యులు కూడా పీవీగారి దివ్యస్మృతికి ఎటువంటి శ్రధ్ధాంజలి ఘటిస్తున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.  అది మాని సాకులు వెదకుతూ దివారాత్రములూ నిత్యం సీమాంధ్రులను తిట్టిపోయటమే పనిగా పెట్టుకోవటం అనేది మంచి పనేనా?  అలోచించుకోండి.

ఒక్క విషయం గ్రహించండి.  తెలుగువారికి ఢిల్లోలో  ఎన్నడు సరైన గౌరవం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ అక్కడ అంతా అరవపెత్తనం.  స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు తెలుగువారి ఆత్మగౌరవం  అనే నినాదంతో కాంగ్రెసువారికి వ్యతిరేకంగా ఉద్యమించటానికి అది కూడా ఒక ప్రధాన కారణం. వీలైనప్పుడల్లా తెలుగువారిని అవమానించటానికి అక్కడ నిత్యం ప్రయోగాలమీద ప్రయోగాలు నడుస్తూ ఉంటాయి. ఈ రోజు చిదంబరమూ ఆ తానులో ముక్కే - మీ కేదో నేడు ఒరగబెడుతున్నాడని కాక విస్తృతమైన పరిధిలో ఆలోచించగలిగితే మీకూ‌ బోధపడుతుంది.

ఇకపోతే తమ ఖండికలో శ్రీగుండువారు యధాప్రకారం తమ ధోరణిలో సీమాంధ్రులపై "స్వార్థపరులయ్య మీరలు స్వార్థపరులు" అనీ, "హృదయాన ఘోర విషము దాచుకొన్నట్టి మీర లధర్మపరులు"అనీ,  "నీది నటనె" అనీ పాత నిందారోపణలనే పునరుద్ఘాటించారు.  

14, డిసెంబర్ 2013, శనివారం

కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే

కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే
శమముషి భుజవీచివ్యాకులేఽగాధమార్గే
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్నః క్లేశమద్య త్యజామి



ఒకడొకానొక యెడారిలో పడి పోవుచుండెననగా వాని యవస్థ దుర్భరముగా నుండు నని లక్షవాక్యములలో చెప్ప నవుసరము లేదు.  కాళ్ళు బొబ్బలెక్కును కాని నీడ దుర్లభము. ఆకలి దహించును కాని తిండి దుర్లభము.  దప్పికతో నలమటించును కాని నీటి జాడ దుర్లభము.  వీటికి తోడుగా కొన్ని యెండమావులు కనిపించి యాడించును.  వాని యందు కనిపించు నీటికై యాసపడి యట్లే పరువెత్తుకొనుచు పోయి పోయి మరింత దుఃఖమనుభవించును.

ఈ సంసారము కూడ యెడారి వంటిదే.  జీవుల ప్రయాణములో నిచట నటువంటి బాధలే కలుగును. విశ్రాంతి యన్నది లేక ఈ సంసారములో పడి జీవుడు నడచు చుండును.  ఆకలిదప్పులవంటి ఆశామోహములను పొంది వాటిని అందించునట్లు భ్రమింపజేయు ఎండమావులవంటి యింద్రియసుఖములు వెంబడి పరువులెత్తుచు క్లేశములు పొందుటే జీవితములో హెచ్చుభాగమైన కార్యక్రమము కదా.

కాని ఈ సంసారములోని జీవుడు సరిగా నన్వేషించినచో నొక చక్కని కాసారము కనబడును.  అది భగవతుండని పేరు గలది!

ఎంతో అందమైన పద్మములున్నవి దానిలో.  అవి భగవంతుని యొక్క దివ్యమైన కరచరణములే.

ఎంతో చక్కని దివ్యకాంతులీను చేపలు సంచరించునా కాసారములో.  అవి భగవంతుని యొక్క దివ్యకృపాకటాక్షవీక్షణాప్రసార మొనరించు చున్న నేత్రములే సుమా.

ఆ భగవంతుడనే కాసారము లోని జలములు అమృతమే.  అన్ని విధములైన క్లేశములను తొలగించి హాయి గొలుపునా అమృతజలములు.

భక్తునకు భగవంతుని కృపాజలప్రపూర్ణమైన దివ్యకాసారము లభించినది.  అతడు సంతోషముగా ఎలుగెత్తి పలుకుచున్నాడు.

ఈ సంసారమనే ఎడారి బాధ నుండి విముక్తి లభించినది.  
ఇదిగో‌ ఈ‌ క్షణమే దీనిని విడిచిపెట్టున్నాను



స్వేఛ్ఛానువాదం:

తే. కరచరణములు పద్మముల్ కన్నులనగ
నందమై నట్టి చేపలౌ హరిసరసియె
పరమకరుణాంబుపూర్ణమం చరసి యిపుడె
పాడు సంసారమరుభూమి వదలినాడ


13, డిసెంబర్ 2013, శుక్రవారం

చింతయామి హరిరేవ సంతతం

చింతయామి హరిరేవ సంతతం
మందహాసముదితాననాంబుజం
నందగోపతనయం పరాత్పరం
నారదాదిమునిబృందవందితం


శ్రీహరిని చింతన చేయవలెను.  అది శుభప్రదము.  శుభ మనగా మోక్షమనియే యుద్దేశము.   హరిని మాత్రమే చింతచేయవలెను.  అన్యదేవతలను చింతించుట వలన కలుగు ఫలములు స్వల్పములు.  అట్టి దేవతలను చింతించుట వలన ఎంత గొప్ప ఫలము కలిగినను అది మోక్షమునకు సమానము కాదు గదా.  అందుచేతనే,  హరిరేవ సంతతం అని హరిని మాత్రమే ఎల్లప్పుడును నిష్ఠగా చింతించుచున్నానని కవి చెప్పుచున్నాడు.  దైవ చింతనమనగా వీలు చిక్కినప్పుడు కాలక్షేపమునకు చేయదగినది కాదు.  అది నిత్యముగా మనఃపూర్వకముగా చేయవలసినది.  ప్రహ్లాదాదులకు నిద్రలో కూడ హరినామస్మరణము మరుగు కాలేదని గదా ప్రతీతి.  అట్లన్న మాట.  ఎప్పుడు హరిస్మరణము జరుగుచున్నదో అప్పుడు హరియొక్క సుందరాతిసుందరమైన ముఖారవిందమును, అది అనుగ్రహ పూర్వకముగా చిందించుచున్న చిరునవ్వులును మనస్సులో రూపు కట్టవలెను.  ఇట్లు చెప్పుట యెందుకనగా, యాంత్రికముగా నోటితో హరినామమును జపించుట కాక అది మనఃపూర్వకముగా చేయవలసినదిగా చెప్పుటకే.  మరొక విషయమేమనగా అట్టి స్మరణము ప్రేమపూర్వకమైనది.  అట్లైనప్పుడే కదా, హరి యొక్క అందమైన నగుమోము మనస్సులో రూపించుట? ఆ హరి నందగోపునకు దయతో కుమారుడైన వాడు.  ఆయన పరాత్పరుడు.  అయనకు నిజముగా తండ్రి యెవడు?  కాని నందుడు చేసుకొన్న పూర్వపుణ్యప్రభావము చేత, ఆయనకు శ్రీహరి స్వయముగా పుత్రుడై అలరించెను.  అనగా ఆయన అనుగ్రహము ఎంత గొప్పగా ఉదారముగా నుండునో మనము అర్థము చేసుకొన వలసినదే కాని వర్ణించలేనిది. అర్థము చేసుకొని తరించుటకు కూడ పెట్టిపుట్టవలెను.  నారదాదులు అట్టివారు.  వారు శ్రీహరిపట్ల పరమప్రేమతో తరించిరి.  అందుచేత శ్రీహరి వారి హృదయములలో నిత్య నివాసియై యుండును.  ఆ మహాత్ములకు శ్రీహరి స్మరణకీర్తనములు తప్ప వేరు కార్యక్రమములే యుండవు.   సారాంశ మేమనగా, శ్రీహరిని మిక్కిలి ప్రేమతో నిత్యమును స్మరించుచు నా పరాత్పరుని నగుమోమును హృదయకమలమున నిత్యము దర్శించుచు తరించవలె ననుట.


స్వేఛ్ఛానువాదం

ఆ.వె. నందగోపతనయు నారదాదిమునీంద్ర
వంద్యు హాసపూర్ణపద్మముఖుని
పరమపురుషు హరిని భావింతు నేవేళ
చిత్తమందు భక్తి చెలగుచుండ



సాగతీత?


అదిగో వచ్చెను తెలగాణా బిల్!
వచ్చెనసెంబ్లీ చర్చలకొరకై!
ఒకటో రెండో మూడు రోజులో
సమయం పట్టును చర్చలకొరకై!


ప్రత్యేకంగా యుధ్ధవిమానం
మోసుకు వచ్చెను విభజన బిల్లు
శ్రధ్ధగ చదివిన పిమ్మట చర్చకు
దిగవలె తొందరపడరాదండీ

కానీ, బిల్లుకు ప్రెసిడెంటిచ్చెను
ఆరువారముల సమయమ్మిప్పుడు!!
ఇంత సమయమ్ము నిచ్చుట కేదో
బలమైన కారణమ్ముండవలెనయా!


చర్చకు తగిన సమయం బిచ్చుట
సంప్రదాయమని మరువరాదయా
ఎప్పటిలాగే ఆరువారముల
గడువు నిచ్చిరని గమనించుడయా

అనుమానమ్మెదొ పొడసూపెను మది!
కాలమిచ్చి యిక సాగదీయుటకె
కాదుగదా సీమాంధ్రుల కుట్రల
లాబీయింగుల మహిమమ్మిదియే?


లాబీయింగులు సీమాంధ్రులకే
కలిసొస్తే యీ బిల్లొచ్చేనా
లేనిపోని యారోపణలెందుకు
చీటికిమాటికి చిందులెందుకు

కేంద్రము పూనిన కార్యము చక్కగ
సకాలమ్ములో నెరవేరును గద!
భేషు భేషనును తెలగాణమ్మే!
దీప్తిమంతమై కాంగ్రెసు వెలుగును!!


కేంద్రము చేసిన దుష్కార్యములే
కాంగ్రెసు నిప్పుడు కాటికి పంపును
కాలము చెప్పును కలసి వచ్చునది
తెలంగాణకో సీమాంధ్రముకో

త్వరత్వరగా చర్చల జరిపించియు
కేంద్రముకంపగ యత్నించుటయే
ముందరనున్న మహత్కార్యమ్మిది!
తాత్సారమ్మిక చేయగనేలా


ఎందుకు లెండి హడావుడి పడటం
కేంద్రం‌ కరుణకు గడబిడపడటం
మహత్కార్యమో దుష్కార్యమ్మో
సమయం తీసుకు చర్చించవలె

కుట్రచేయుచో తిప్పికొట్టెదము!
మంచికేయైన కొనియాడెదము!
త్వరగా తేల్చుడు వారములోనే
త్వర త్వర త్వర త్వర త్వర త్వరగా!!


కొత్తగడువులను పెట్టేటందుకు
మీరెవరయ్యా తప్పుగదయ్యా
మీ దూషణలకు చింతించరయా
మీ మెప్పులతో పనిలేదయ్యా

(ఇది శ్రీగుండువారి సాగదీత...కుట్రేనా?  అనే టపాకు స్పందన)


11, డిసెంబర్ 2013, బుధవారం

ఆశ..దోశ.. అంటే సరా?



సమైక్యాంధ్రయె వలయునంచును
తెలంగాణము బిల్లు వచ్చిన
అసెంబ్లీలో ఓడజేతుమ
టంచు పలుకకయా! 

ఎందుకొచ్చిన బిల్లు బాబూ
ఎవరికోసం వ్యర్థచర్చలు
పనికిమాలిన బిల్లు వచ్చిన
ఓడిపోవుట తప్పునా

 
బిల్లు వచ్చిన చర్చ సేయుడు!
రాదు ఓటింగునకు నదియే!
ఆర్టికలు మూడునను నిదియే
చెప్పబడెనయ్యా!

ఓడినా పట్టించుకొననిది
చర్చచేయుట దండుగే కద
పనికిమాలిన చర్చ కోసం
మూడునంబరు ముచ్చటా

 
అవిశ్వాసమదేమియైనను
పార్లమెంటున తెలంగాణము
బిల్లు పెట్టుట తథ్యమయ్యా!
కండ్లు తెరువుడయా!

 

తెలుగుజాతిని పార్లమెంటున
తుంచి మీతో లాభ మెంచే
వారి స్వార్థములోని కుటిలత

తెలిసి కన్నులు తెరువుడీ
గౌరవము కాపాడుకొని మీ
రిట్టి బిల్లును చర్చ సేయుడు!
పెద్దరికమును నిలుపుకొనుడయ!
వెలిగిపోవుడయా!

 

ఇట్టి బిల్లును గూర్చి చర్చలు
చేసి మురిసే పెద్దరికమును
బుధ్ధిహీనులు తప్ప గోరరు
ఛీ కొట్టి నెట్టెదరోయ్

( గమనిక:  ఇక్కడ ఆకుపచ్చరంగు లోనిది శ్రీగుండువారి   ఆశ...దోశ...అప్పడం...వడ... టపాకు నా స్పందన.  ఆ టపా శీర్షిక చూస్తే వెక్కిరింత,  విషయప్రస్తారం చూస్తే బుజ్జగింపుధోరణిలో బెదిరింపు! )

6, డిసెంబర్ 2013, శుక్రవారం

తెగతెంపుల నిర్ణయం వెలువడింది.

తే. ఆంధ్రజాతికి దుర్దిన మాయెననగ
విభజనము కోరు వారికి వేడుకనగ
నిర్ణయము వచ్చె తెలుగింట నిప్పుపుట్టె
ముందుముందేమి పుట్టునో యిందువలన

వ. కొందఱ కిది స్వాతంత్యసిధ్ధి యట!

సీ. పూర్ణస్వాతంత్యంబు పొల్పెట్టు లుండునో
      ప్రత్యేకదేశమై వరలు వారొ
సర్వస్వాతంత్యంబు చాడ్పెట్టులుండునో
      భరతదేశంబులో వారు గారొ
అరువదేండ్ల స్వప్న మందురే పెక్కేండ్లు
      విభజనోద్యమమెందు విడిసి యుండె
అమరవీరులు కల రధికులీ యుద్యమ
      రాజకీయమునకే రాలినారు

తే. అనుదినంబును నింద లన్యాయ భాష
ణంబు లివి యెల్ల ధర్మాగ్రహంబు పేర
నిన్ని నాళులు దాయాదు లన్న మిషను
వేలు చూపించి కురిసిరీ వీరు లకట
 
తే. వేరు కాపురములు వీలుగా కుదిరెను
చాలు దాయాదులను మాట సఖ్య మొప్ప
అన్నదమ్ముల మగుటయే యెన్న దగిన
బాంధవంబను తీయని పలుకు పుట్టె
 
తే. రాష్ట్రములు వేరు తెలుగువా రంద రొకటె
యన్న సొంపైన మాట యే మంత పొసగు
తిట్లు కురిపించుటయు చేరదీయుటయును
వారి చిత్తంబు వీరి సౌభ్యాగ్య మగునె
 
ఉ. కాలము చేత సర్వమును గల్గుచు నుండును క్రిందుమీదులన్
కాలము చేయ కొందరధికంబగు మోదము నొంద కొంద రార్తులై
బేలతనంబు బొందుటయు వింత యనంగ రాదు గర్వశోకముల్
కాలము వేఱు భంగి చనగా విపరీతము లౌటయు పుట్టు చుండెడిన్

క. కాలము నీదు స్వరూపము
నీ లీలకు తిరుగు లేదు నీ వేదో పె
న్మేలెంచి చేయుచున్న ద
దే లాగున తెలియ నేర్తు మీశ్వర చెపుమా
 
శా. తౌరక్యాంధ్రము కోరి కొందరు మహాదోషాచరుల్ దీక్షమై
పోరంబోరగ వారి యాశ లవి సంపూర్ణంబుగా దీరు చో
నేరం బేమియు లేని శిక్ష పడి యీ నిర్భాగసీమాంధ్రు లీ
ఘోరం బింక సహించి యుండవలెనా కోదండరామప్రభూ

సీ. కాంగిరేసును వల్లకాటికి పంపక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
భాజపామూర్ఖుల పట్టి పల్లార్చక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
సీమాంధ్రమంత్రుల చెత్తగా నూడ్వక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
సోనియమ్మకు చెప్పుచూపించు నందాక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
 
ఆ. తెలుగుజాతిపరువు దిల్లీబజారులో
అమ్ముకొన్న దుష్టు లల్పమతుల
రేపు శోకవహ్ని రూపర జేయక
ఆంధ్రజాతి కోప మణగు టెట్లు

తే. అన్నిటికి నీవు గలవని విన్నవించి
యూర కుందును శ్రీరామ యుచిత మైన
భంగి విభజనవాదుల భంగపరచి
బుధ్ధి చెప్పుము దుడు కారిపోవు నట్లు

2, డిసెంబర్ 2013, సోమవారం

హైదరాబాదు విషయంలో ఉభయపక్షాలకూ విజ్ఞప్తి.

వ. ఓ సీమాంధ్రప్రజలారా,

మన మిక హైదరాబాదును గూర్చి విచారించి ప్రయోజనము గలదా? 

మన మందరము తెలుగువారము, ఆంధ్రప్రదేశము మన తెలుగువా రందరిది, యీ రాజధాని మన తెలుగువా రందరిది యని భావించి మోసపోతిమి గదా!
 
సీ. రాష్ట్రప్రజల కెల్ల రాజధాని యటంచు
     భావించు కొనుటయే ప్రజల తప్పు
అందరి యూరని యతినమ్మకంబున
     పెంచి పోషించుటే పెద్దతప్పు
ఇన్నాళ్ళు  ప్రేమతో నీ‌ భాగ్యనగరమ్ము
      మన దను భ్రాంతితో మనుట తప్పు
ఇచట చేరిన వారి నెల్లర దూషించు
     మాన్యుల నెఱుగమి మనది తప్పు

తే.ఇన్ని తప్పులు చేసిన దెందువలన
ఇన్ని నిందలు మోసిన దెందువలన
ఇన్ని నాళులు తెలియలే దెందువలన
అసలు తెలుగువార లుదారు లందువలన
 
సీ. మన యైకమత్యంబు మన్ను మశానంబు
     మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె
మన యతి నమ్మక మను బలహీనత
     మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె
మన బుధ్ధి కీ యూరు మనదని తోచుట
     మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె
మన సంపదలు దెచ్చి ఘనముగా పెంచుట
     మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె

తే.  ఒకరి నన నేల బుధ్ధి లేకుండ మనము
తెలుగు జాతి యంతటికి నుద్దిష్టమైన
పట్టణం బని హైదరాబాదు మీద
మమత గొని యుంట మన నోళ్ళ మట్టి గొట్టె
 
తే. హైదరాబాదు మీ కొక యద్దెకొంప
హైదరాబాదుపై మీకు హక్కు లేదు
పూని యైదేండ్లలో రాజధాని కట్టు
కొనుడు సీమాంధ్రులను మాట కూడ బుట్టె
 
కం. తగదట యూటీ చేయుట
తగునట యీ యూరిపైన తమ పెత్తన మ
ట్లగుచో సీమాంధ్రుల పై
పగగొని యగచాట్లు పెట్ట వచ్చును గనుకన్
 
కం. కాలము వ్యత్యస్తంబై
చీలికలై రాష్ట్ర మిటుల చెడు చుండగ నిం
కేలా చింతించుట యే
మేలగు కీడగును కాలమే చేయుగదా
 
కం. రేపో మాపో కాలం
బా పక్షము నుండి మరలి యరుదెంచునుబో
కాపాడును దైవంబని
యోపికగా నెదురుచూడు డో జనులారా
 

వ. ఓ వీరతెలంగాణా వాదులారా!
 
కం.  తెలగాణరాష్ట్రపాలన
తెలగాణపుదొరల దగుట దివ్యంబుగ మీ
వలసిన రీతిని మీదగు
కెలనన్ మీ రేల వచ్చు కేరింతలతో
 
కం. ఉమ్మడి యూరికి పెత్తన
మిమ్మని మీ రిట్టు లడుగు టేమి యుచిత మా
యుమ్మడి యగు కాలంబును
పొమ్మన నిం డవల మీది ముమ్మాటికిని నౌ


కం. విను డెల్ల రాత్మగౌరవ
మనగా తెలగాణ వారి కది యెట్లగునో
చను నటు సీమాంధ్రులకుం
జనులకు సామాన్యమగుట సర్వవిధములన్


కం. దినదినమును సీమాంధ్రుల
పనిగొని నిందించి యిట్లు పరమానందం
బును బొందుచుండి వదరుట
నొనగూరెడు లాభ మొక్కటి గలదే


కం. మంచిది మీ రడిగిన వే
కొంచెంబును గోత పెట్టకుండగ హితులై
పంచెడు వా రిడు చుండగ
కించిత్సంశయము పేర కీడెంచదరో


కం.  ఇచ్చెడు వారలు గలిగిన
ముచ్చటగా భూమి నెల్ల మోమోటము లే
కచ్చముగా మా కిండని
హెచ్చిన గరువమున గోర నెంచెదరు గదా!


కం.  ఇక దేనికి మీ వగపులు
ప్రకటంబుగ కాలమహిమ వలనన్ రాష్ట్రం
బిక చీలుటయే తథ్యం
బకటా పగ లుడిగి శాంతులై యుండదగున్

1, డిసెంబర్ 2013, ఆదివారం

in the days of Intellegint biological machines.



Kids are intelligent biological machines in learning process.

Youngsters are intelligent biological machines in earning process.

Oldies are intelligent biological machines waiting to be recycled.

A family is a smallest collection of intelligent biological machines working together.

Society is the largest collection of intelligent biological machines working together.

A State is the collection of intelligent biological machines working together and communicating in a given protocol.

The world is the universal collection of  intelligent biological machines found on the globe at any given point of time.

Death is the point of no return for an intelligent biological machine as it ceases to work.

Birth is the point of entry for an intelligent biological machine into the contemporary world.

Emotion is an ancient word that used to describe a humanitarian reaction to an external stimulus before intelligent biological machines replaced the human race due to efficiency reasons.

Moral behaviour is a protocol used by intelligent biological machines to prevent them accidentally confronting one another. 

The now extinct human race used to communicate in inexact and unnatural coding languages which ironically were then called 'natural' languages.

There are traces of some evidences that intelligent biological machines may have been ushered on to the globe by the now extinct human race!